Previous Page Next Page 
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 13


    యస్తేస్తనః శశయో యోమయో భూర్యోరత్నధా వసువిద్యాః సుదత్రః |
    యేనవిశ్వాపుష్యసి వీర్యాణి సరస్వతి తమిహదాతవోకః ఉర్వ్య న్తరిక్షమన్వేమి ||

                                      రెండవ ప్రపాఠకము

                                     మొదటి అనువాకము

    (రెండు, మూడు, నాలుగు ప్రపాఠకములందు సోమయాగము చెప్పబడినది. ఈ అనువాకము యజమాని యాగశాలా ప్రవేశము వరకు గల సంస్కారములు చెప్పబడినవి.)

    1. జలము జీవనము. జలము దీర్ఘాయువు. జలము వర్చస్సు. జలముచే యజమాని తల తడుపబడును గాత.

    (యజమాని తూర్పుముఖముగా కూర్చుండును. అధ్వర్యు అతని తలను తడుపవలెను.)

    2. ఓషధులారా! యజమానిని రక్షించండి. కత్తీ! యజమానిని బాధించకము. దేవతలందు ప్రసిద్ధుడనగు మంగలినగు నేను యజమానికి వపనము చేయుచున్నాను.

    (అధ్వర్యుడు యజమాని తల గొరగవలెను.)

    3. అనంతర కర్మలను నిరాటంకముగ చేయగలను.

    4. జలము తల్లివంటిది. అది యజమానిని పరిశుద్ధుని చేయవలెను. మేఘము వర్షించునవియు, స్రవించుచున్న జలము మమ్ము పునీతులను చేయును గాత. మానుండి సమస్త పాపములను తొలగించును గాత.

    (అధ్వర్యుడు యజమానికి స్నానము చేయించవలెను.)
   
    5. స్నాన, ఆచమనములచే శుద్ధుడను అయినాను. నీటినుండి లేచి వచ్చుచున్నాను.

    6. ధవళవస్త్రమా! 'సోమస్య తనూరసి'. నీవు చంద్రుని దేహమవు. నా దేహమును కాపాడుము.

    (బట్ట కట్టుకొనవలెను.)

    7. నవనీతమా! నీవు ఆవుపాలనుండి వచ్చిన దానవు. స్నిగ్ధతయు వర్చస్సు కలుగజేయు దానవు. నాకు వర్చస్సు కలిగించుము.

    (ఆపాదమస్తకము వెన్నరాసుకొనవలెను.)

    8. కాటుకా! నీవు వృత్రుని నల్లగ్రుడ్డువు. కంటిని కాపాడు దానవు. నా కంటిని కాపాడుము.

    (అధ్వర్యు యజమాని కంటికి కాటుక పెట్టవలెను.)

    9. జ్ఞానములకు స్వామియైనవాడు యజమానివగు నిన్ను సూర్యకిరణరూపములగు దర్భల చిద్రము లేని పవిత్రమున పవిత్రుని చేయును గాత.

    వాక్పతియగు దేవత యజమానివగునిన్ను ఛిద్రములేని పవిత్రమున పునీతుని చేయును గాత.

    సవితాదేవత నిన్ను అచ్చిద్ర పవిత్రమున పునాతు.

    (అధ్వర్యు దర్భల పవిత్రముచే యజమానిపై నీరు చల్లవలెను.)

    10. పవిత్ర పతే! నీ యొక్క అచ్చిద్ర పవిత్రము వలన కర్మ కొరకుగాను నేను పవిత్రుడను అయినాను. యాగము చేయు సమర్థుడను అగుదును గాత.

    11. యజ్ఞ సంబంధ దేవతలారా! మిమ్ము యజ్ఞమునకు ఆహ్వానించుచున్నాము. సత్య ధర్మము కలవారమగు మేము యజ్ఞమునకు వచ్చుచున్నాము.

    (అధ్వర్యుడు యజమాని 'ప్రాగ్వంశల' యజ్ఞశాల యందు ప్రవేశించవలెను.)

    12. ఇంద్రాగ్నులారా! ద్యావాపృథ్వులారా! జలములారా! ఓషధులారా! మీరు ఈ యజమానిని గుర్తించండి.

    13. ఆహవనీయాగ్నీ! నీవు నియమపాలకుడవు. నేను నీ దగ్గర వున్నాను. నన్ను కాపాడుము.

    (యజమాని అగ్ని వద్ద కూర్చుండవలెను.)

                             రెండవ అనువాకము

        (యజమానికి యజ్ఞ దీక్ష చెప్పబడుచున్నది.)

    1. యజ్ఞ సంకల్పము కలిగించు అగ్నికి స్వాహా. ధారణ సిద్ధించుటకు నా అభిమానియైన అగ్నయే స్వాహా. మంత్రోచ్చారణ శక్తికై వాగింద్రియ పోషకుడగు అగ్నయే స్వాహా.

    బృహస్పతి మా హవిస్సులచేత వర్థిల్లును. గాత. దివినుండి వచ్చి గొప్ప సస్యములను ఫలింపచేయు జలవృష్టి వర్థిల్లును గాత. ద్యావాపృథ్వులు వర్ధిల్లును గాత. అంతరిక్షము వర్థిల్లును గాత - స్వాహా.

    2. విశ్వ స్వరూపుడు, జగన్నిర్వాహకుడగు వాని అనుగ్రహమును యజమాని కోరుచున్నాడు. ధనములకు ప్రభువవగు నిన్ను యజ్ఞము కొరకు ధనము కోరుచున్నాను. ధనములకు ప్రభువవగు నిన్ను యజ్ఞము కొరకు ధనము కోరుచున్నాను - స్వాహా.

    (పన్నెండుసార్లు నేతిని స్రుక్కులోనికి తీసికొని పూర్ణాహుతి చేయవలెను.)

    3. కృష్ణాజినము నందలి శుక్ల, కృష్ణలేఖలారా! మీరు ఋక్సామముల శిల్పములు. ఈ ఉత్తమ యజ్ఞ పరిసమాప్తి వరకు నన్ను రక్షించండి.

    (యజమాని పరచిన జింక చర్మమును తాకవలెను.)

    4. వరుణదేవా! యజమాని అగ్నిష్టోమ యాగమును సంకల్పించి ఉన్నాడు. అతనికి చక్కగా బోధించుము. యాగము పూర్తి చేయించుము.

    కృష్ణాజినము సమస్త విఘ్నములను దాటించగలది. సుఖము కలిగించగలది. తరింప చేయగలది. అట్టి నావ వంటి జింక చర్మముపై ఆసీనులము అగుచున్నాము.

    (అధ్వర్యుడు మోకాలు చూపి కృష్ణాజినమును చేరవలెను.)

    5. మేఖలా! నీవు అంగిరసుల అన్నరూపమవు. ఉన్ని వలె మృదువైనదానవు. నాకు అన్నరసము ప్రసాదించుము. బాధించకుము. రక్షించుము.

    (యజమానికి దర్భల మొలత్రాడు కట్టవలెను.)

    వస్త్రమా! నీవు విష్ణువునకు సుఖకరమవు. యజమానికి, నాకు సుఖములనిమ్ము. నక్షత్ర ప్రకాశమున నన్ను రక్షించుము.

    (యజమానికి వస్త్రము కప్పవలెను.)

    6. జింక కొమ్మా! నీవు ఇంద్రుని జన్మమునకు కారణమవైనావు. మా హింసీః - నన్ను బాధించకుము.

    7. మట్టిగడ్డా! నిన్ను పంట పండించుటకు పెల్లగించుచున్నాము.

    (జింక కొమ్ముచే మట్టిగడ్డను త్రవ్వి తీయవలెను.)

    8. సత్ఫలములనిచ్చు ఓషధుల కొరకు గోకుకొనుచున్నాను.

    9. దండమా! నీవు దేవతా స్వరూపమవు. వనస్పతివి. నీవు పైన ఉండుము. యజ్ఞము పూర్తియగు వరకు నన్ను కాపాడుము.

    (మేడికర్రను యజమానికి ఇవ్వవలెను.)

    10. యజ్ఞమును మనసున దాల్చుచున్నాను. ద్యావాపృథ్వులు యజ్ఞమును ఆశ్రయించినవి. మహా అంతరిక్షము యజ్ఞమును ఆశ్రయించినది.

    వాయుదేవుని అనుగ్రహమున యజ్ఞము ఆరంభించుచున్నాను.

    (యజమాని చేతి వ్రేళ్ళను రెండేసి చొప్పున ముడుచుచు పిడికిలి బిగించవలెను.)

 Previous Page Next Page