"ఏయ్! ఆగు."
ఉలిక్కిపడ్డాడు. ఆడపిల్లగొంతు. తననేనా? ఆగడానికి అభిమానం అడ్డువచ్చి ముందుకే కదిలాడు.
"ఆగమంటుంటే వినిపించటంలేదూ?"
అనుకోకుండా అతని కాళ్ళాగిపోయాయి. వెనుతిరిగి చూసేసరికి మాధవి అతనివైపు నడిచివస్తోంది.
అతనికాశ్చర్యంగా వుంది. ఏమిటీ పిల్లకింతధైర్యం అనుకుంటూ నిలబడ్డాడు.
ఆమె అతనికి దగ్గరగావచ్చింది. వాళ్ళకు కొంతదూరంగా ఒకవైపు ఆడపిల్లలూ, ఇంకోవైపు మొగపిల్లలూ నిలబడివున్నారు.
మాధవి అతని కభిముఖంగా నిలబడింది.
"నన్నేనా పిలిచావు?" అనడిగాడు రాజా పొగరుగా.
"అవును. నిన్నే."
"దేనికని."
"దేనికా? మొగవాడివి కదా అనే గర్వంతో, ఒక ఏడాది సీనియర్ వి కదా అన్న అలుసుతో, ఒక ఆడపిల్లని దారుణంగా అవమానించిన నీకు బుద్ధి చెప్పటానికి."
క్షణంలో అతని కళ్ళు కోపంతో మెరిశాయి. "నాకు బుద్ధి చెప్పేటంతటి మొనగత్తెవా నువ్వు."
అతను ఊహించలేదు. కన్నుమూసి తెరిచేలోపున ఆ సంఘటన జరిగిపోయింది. అతని చెంప ఛెళ్ళుమంది.
నిశ్చేష్టుడైపోయాడు. ఇంచుమించు వందమంది చూస్తున్నారీ సన్నివేశం.
ఆవేశంతో ఒళ్ళు మరిచిపోయాడు. "నామీద చెయ్యి చేసుకుంటావా? చూడు నిన్నేం చేస్తానో" అంటూ కుడిచేతిని పైకెత్తాడు.
"ఒక ఆడపిల్ల మాన ప్రాణాలు దోచుకునేందుకు సిద్ధపడిన నువ్వు మెడికల్ స్టూడెంట్ వా? నువ్వెక్కడో దాక్కుని వేరే మొగాడిని ఇందుకు ఉసికొల్పుతావా? ఎవరో ఆడవాళ్ళ సాయంతో ఆమెను న్యూడ్ చెయ్యటానికి ప్రయత్నిస్తావా?"
ఎత్తిన చెయ్యి ఎత్తినట్లే వుండిపోయింది. కళ్ళప్పగించి చూస్తున్నాడు.
"ఆమె జాకెట్టుని చింపినందుకు..." మరోసారి చెంప ఛెళ్ళుమంది.
"చీర కుచ్చిళ్ళు లాగినందుకు..." ఇంకోసారి చెంప పేలిపోయింది.
"రాత్రి... ఆమె ప్రయత్నం సఫలమై ఆత్మహత్యే చేసుకునివుంటే... ఒక నిండు జీవితం బలికావటానికి నువ్వే కారకుడివయ్యేవాడివి. దుర్మార్గుడా! మనిషిగా పుట్టి పశువులా ప్రవర్తించటానికి నీకు సిగ్గనిపించడంలేదూ?"
అతనింకా నిర్ఘాంతతనుండి కోలుకోలేదు. అలాగే అచలనంగా వుండిపోయాడు.
"నువ్వు పెద్ద రౌడీవని తెలుసు. నీ వెనక పెద్ద బలగమున్నదనీ తెలుసు. నేను ఒంటరిదాన్ని. అయినా నీతో ఢీ కొన్నాను. చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి. నిన్నెలా ఎదుర్కోవాలో నాకు తెలుసు" అతనివంక తిరస్కారంగా చూసి అక్కడ్నుంచి విసవిస నడుస్తూ వెళ్ళిపోయింది.
ఈ సంఘటన అక్కడున్న విద్యార్థులందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచివేసింది. ఏవో మాటలు చెదురుగా వినపడ్డాయి తప్ప, దూరంగా వుండబట్టి మాధవి ఏమన్నదీ వాళ్ళకు సరిగ్గా వినరాలేదు. వాళ్ళకు అర్థమయిందల్లా ఒక్కటే- మాధవి రాజాని చితగొట్టేసింది.
రాజా ఎందుకు ఊరుకున్నాడు? అదే వాళ్ళకర్థం కావటంలేదు. అతని ఆవేశం వాళ్ళకి తెలుసు. అతని శక్తి వాళ్ళకి తెలుసు. అయినా...
"రాజా ఊరుకోడు. ఈమె అంతం చూస్తాడు. ఏం జరిగిందో తెలియదుగాని అనవసరంగా అతన్తో పేచీకి దిగింది. అందులో అలాగూ ఇలాగూ కాదు. భయంకరంగా. రాజా ఈ పరాభవానికి అంత భయంకరంగానూ జవాబు చెప్తాడు" అని ఆడపిల్లలు రకరకాలుగా వ్యాఖ్యానించుకున్నారు.
రాజా ఫ్రెండ్స్ అతనిచుట్టూ చేరారు.
"రాజా! ఏమిటిది? ఎందుకలా సైలెంట్ అయిపోయావు?"
"రాజా! ఒక ఆడపిల్ల నిన్ను కొట్టటమా?"
"రాజా! నువ్వు ఊ అను. దాని కోరలు తీసిపారేసి తీసుకొచ్చి నీ కాళ్ళమీద పడేస్తాం?"
చివరకు రాజా మాట్లాడాడు. "ప్లీజ్! నన్ను ఒంటరిగా వుండనివ్వండి."
"రాజా!"
"ప్లీజ్."
విధిలేక అతన్ని విడిచి వాళ్ళంతా వెళ్ళిపోయారు. తర్వాత ఒక్కొక్క అడుగూ వేసుకుంటూ రాజా నెమ్మదిగా నడవసాగాడు.
* * *
"అయ్యయ్యో! ఎంత పనిచేశావు మాధవీ! అతను నీ మీద పగబట్టి ఏ అఘాయిత్యమైనా చేస్తే?" అంది కల్యాణి భ్యమ్గా.ఆమెకు ఉదయం నుంచీ బాగా జ్వరంగా ఉంది. అందుకని కాలేజికి వెళ్ళకుండా హాస్టల్లోనే పడుకుని వుంది.
"నేను కల్యాణిని కాను. మాధవిని" అంది నవ్వుతూ.
"అయినా ఆడపిల్లవి."
"కాని మాధవిని."
"మరీ అంత ధైర్యం పనికిరాదు మాధవీ. పదిమంది కలసి దౌర్జన్యానికి వస్తే ఏం చెయ్యగలవు?"
మాధవి ఒక గెంతు గెంతి స్మార్ట్ గా రెండుచేతులూ కత్తుల్లా జాపి, "కరాటే, కుంగ్ ఫూ, షాడో మార్క్, కిల్లింగ్ దంచ్, డబుల్ కిక్" అంది చాలా సీరియస్ గా అభినయిస్తూ.
కల్యాణికి నవ్వు వచ్చిందిగాని కడుపులోని బాధ, భయం ఆ నవ్వును దిగమ్రింగేశాయి.
"ఇదంతా నా వల్లే వచ్చింది" అన్నది పశ్చాత్తాపంతో.
"పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని ధైర్యంగా వుండు" అని కసిరింది మాధవి.
మరునాడు కాలేజి బస్సు దిగి వరండాలోకి అడుగుపెడుతుండగా దివాకర్ ఎదురయాడు.
"కంగ్రాచ్యులేషన్స్" అన్నాడు.
"దేనికి?" అనడిగింది మాధవి.
"ఆ రాజాగాడ్ని ఎడాపెడా వాయించేశావటగా."
"ఏదోలెండి. అన్నట్లు మీకు జాయింట్లన్నీ సరిగ్గా వున్నాయా?"
"ఏం? సరిగ్గావుంటే వాటినికూడా ఓ చూపు చూస్తారేమిటి?" అన్నాడు కంగారుపడి.
"ఛ. అదికాదండీ! మీకేదో అయిందని ఎవరో చెబితేనూ."
"ఛఛ. నా కవటమేమిటండీ. అయితే గ్రహం వక్రించటంచేత చిన్న చిన్న ఒడుదుడుకులు వస్తుంటాయి."
"అంతేనన్నమాట. అవునూ, హాస్పిటల్ లేదా ఏమిటి ఇలా వచ్చారు?"