Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 11


    సమ్మోహనాస్త్ర ప్రయోగానికి గురయ్యారా అన్నట్టు పత్రికా ప్రతినిధులు అందరు క్షణం చలనరహితులై, వెంటనే కర్తవ్యం గుర్తించి, చకచకా షార్ట్ హాండ్ లో రాసుకున్నారు.

    "సర్! మీ విద్యాభ్యాసం వగైరా వగైరా..."

    "వగైరా  వగైరాలంటూ ఏమీలేవుగాని, చిన్నప్పుడు గురుకులంలో, ఆ తరువాత ప్రభుత్వ కళాశాలలో, ఆపైన నలందా విశ్వవిద్యాలయంలో, ఆ పిదప తత్వశాస్త్రంలో పి.హెచ్ డి; ప్రస్తుతం మనస్తత్వ శాస్త్రంలో ప్రయివేటుగా సెకండ్ ఎం.ఏ."

    ప్రధాని ఇంకా చదువుకుంటున్నారు అని విని జర్నలిస్టులు అందరు విస్తుపోయారు. తమ ప్రధాని పట్ల వారికి గౌరవం ఇనుమడించింది.

    "మీరు ఇంగ్లీషు కాన్వెంట్లలో, విదేశాలలో..."

    "చదవలేదు!"

    "ఎందుకని?"

    "మా నాన్నగారికి గురుకుల విద్యపట్ల మక్కువ ఎక్కువ. ఆ ఒరవడిలో పెరిగిన నాకు సహజంగానే భారతీయ తత్వశాస్త్రం, చరిత్ర, సంస్కృతి గురించి పరిశోధనల పట్ల ఆసక్తి పెరిగింది..."

    "మీరు మరల ఇప్పుడు మనస్తత్వ శాస్త్రంలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవచ్చా, సర్!"

    "ష్యూర్ ష్యూర్! విజ్ఞానం ఏ ఒక్కరోజులోనే లేదా నిర్ణీత కాల వ్యవధిలోనో అబ్బేది కాదు. ఒక జీవిత కాలంలో మనం ఎంత విజ్ఞానాన్ని ఆర్జించామో గుర్తుచేసుకుంటే, ఈ అనంతవిశ్వంతో పోల్చుకుంటే, అణువంత సయితం అలవర్చుకోలేదనిపిస్తుంది. కనుక, నేను జీవితాంతం విద్యార్ధినే! నా పరిశోధనలు, నా కృషి అంతా మానవ సమాజపురోగతికి..."

    తమ దేశ ప్రధానిలో ఒక సామాజిక తత్వవేత్తను చూసుకోగలిగారు వారు.

    "అంటే మీరు, ఫలానిది సాధించాలి అనే నిర్దిష్టమైన ప్రణాళిక అంటూ లేకుండానే ఇంతా చేస్తున్నారా?" ద్వంద్వార్ధంగా ప్రశ్నించాడొక ప్రతినిధి.

    క్షణ కాలం మౌనం వహించారు ప్రధాని. అతని వ్యంగ్యాన్ని గుర్తించారు.

    "తమ దేశానికి, తమ ప్రజలకు ఏదయినా మంచి చేయవలెననే భావనకు ముందే ప్రతి వ్యక్తీ అసలు తన గురించి, తన పరిసరాల గురించి, వాటి ప్రభావాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసుకోవాలి కదా! ప్రస్తుతం నేనూ ఆ అన్వేషణలోనే పయనిస్తున్నాను." చిరునవ్వుతూ సమాధాన మిచ్చారు ప్రధాని.

    "ఒకప్పుడు రత్నగర్భగ, మహోన్నత సంస్కృతికి వారసత్వంగా వినుత కెక్కిన భారతదేశం ఈనాడు సమస్యల సుడిగుణ్ణంలో కొట్టుకులాడుతున్నది. కుల, మత సంఘర్షణలు, అతివృష్టి, అనావృష్టి. ఈతిబాధల మధ్య సామన్యుని సగటు జీవనం. దారిద్ర్య రేఖకు దిగువున కోట్లాది ప్రజల ఆక్రందనల ఆకలి కేకలు. బ్రతుకు దుర్భరం, విచ్చిన్నకర శక్తుల విజృంభణ. హింసాకాండ. భయానక వాతావరణం. ఇదీ నేటి భారతావని ముఖచిత్రం. సర్! ఇదే సమయంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తరహాలో శాంతి-భద్రతలు అదుపు  తప్పుతున్నాయి. పంజాబ్ లో ఖలిస్తాన్ ఉద్యమకారులు. అస్సాంలో బోడోలు. కాశ్మీరులో జె.కె.ఎల్.ఎఫ్; తమిళనాడులో ఎల్.టి.టి.ఇ. అంధ్రప్రదేశ్ లో నక్సలైట్లు. ఏమిటి ఈ విధ్వంసకాండలు? వీటి గురించిన మీ అవగాహన, కార్యాచరణ పథకాలు ఏమిటి? ఈ దేశాన్నీ, దీని భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు?" ఒక సీనియరు జర్నలిస్టు లేచి సీరియస్ గా ప్రశ్నల వర్షం కురిపించాడు.

    క్షణం గాంభీర్యత చోటుచేసుకుంది ప్రధాని ముఖంలో. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నారు.

    "ప్లీజ్, సర్! ఏదో ఒకటి మీ నిశ్చితాభిప్రాయంగా చెప్పండి. దాటవేయడానికి మాత్రం ప్రయత్నించకండి!" నిష్కర్షగా అడిగాడు మరొక ప్రతినిధి.

    అప్పుడు కనిపించాయి ప్రధాని ముఖంలో భావోద్వేగ చిహ్నాలు. ముఖం కందిపోయింది. భృకుటి ముడిపడింది. అక్కడి ఆహ్లాదకర వాతావరణం అంతా ఒక్క మాటతో మారుమారై, క్షణంలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది.

    తొందరపడిన ఆ పత్రికా ప్రతినిధి నాలుక్కరచుకున్నాడు. మిగిలినవారు అతనిని వెలివేస్తున్నట్టు చూశారు. ప్రధాని సిబ్బంది అయితే పళ్ళు పటపట లాడించుకున్నారు.

    పత్రికా ప్రతినిధులు అడిగే అన్నిప్రశ్నలకు తగువిధంగా జవాబులు చెప్పడం రాజకీయ నాయకుల విజ్ఞతకు చిహ్నం. ప్రశ్నలను ఔచిత్య భంగం కలుగని రీతిలో హుందాగా అడగడం పత్రికా ప్రతినిధుల ప్రాధమిక ఆచారం. ఆ సత్సంప్రదాయానికి ఇప్పుడు ఇక్కడ గండిపడినట్టయింది!

    ప్రధానితో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు లక్ష్యం కొత్త సమాచార సేకరణ, అధికారిక ధృవీకరణ. ప్రధానీ అందుకు సన్నద్ధంగానే వున్నారు. అటువంటప్పుడు, ప్రశ్నలకు జవాబులను దాటవేయడం అనే ప్రస్థావన ఎందుకు వచ్చినట్టు? ఇది కొంటెతనం. కావాలని చేసిన  కవ్వింపు కావచ్చు. ఒక సామన్యుని వీథిన నిలదీసినట్టు, తాము ఏదైనా సరే, ఎలా అయినా సరే అడిగే స్వేచ్చ తమ హక్కు భుక్తమైనట్టు, విధిగా జవాబులు చెప్పవలసిన బాధ్యత ప్రధానిదైనట్టు ధ్వనించిన ఆ ప్రతినిధి తొందరపాటుకు అటు ప్రధాని, ఇటు మిగిలిన పత్రికా ప్రతినిధులు కూడా నొచ్చుకున్నారు.

 Previous Page Next Page