శేషు చెప్పిన కథ: వరండా కుర్రాడు
సన్నగా, పొడుగ్గా వుంటుంది రాధ. అలా అని చెప్పి ఈసురోమంటూ వుండదు. సన్నటి నడుము, అక్కణ్ణుంచి ప్రారంభమైన బలమైన కాళ్ళూ, ఆరోగ్యాన్ని సూచించే చెక్కిళ్ళు..... ఆ అమ్మాయి అందమంతా ఆమె చలాకీతనంలో వుంది. పెళ్ళయి ఆరేళ్ళయినా ఆ హుషారు తగ్గలేదు సరికదా మరెంతో పెరిగింది- అప్పుడే పిల్లలు వద్దనుకోవటంతో.
భర్త విశ్వనాథం స్టేట్ బ్యాంకులో బుల్లి ఆఫీసర్. అప్పుడే లోన్ తీసుకుని ఇల్లు కట్టేశాడు కూడా. ముచ్చటైన ఇల్లు. ముందు చిన్న గులాబీతోట. ఇంటిముందు వరండా. వరండాకి కుడివైపు సెపరేట్ గా ఒక గది.
ఇల్లంతా నీట గా ఉంచటం రాధ ప్రత్యేకత. భర్త ఆఫీసు కెళ్ళిన తర్వాత గది సర్దేసి ఏ పత్రికో పట్టుకుని చదువుతూ పడుకుంటుంది కొంతసేపు. రేడియో వినడం ఆమె హాబీ. ఆమె భర్తకి ఇఅతర హాబీల్లేవు. ఐదున్నరకల్లా వచ్చేస్తాడు తరువాత షికారుకో, సినిమాకో.......చాలా మంది అమ్మాయిలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటారో రాధ వర్తమానం అలాంటిది.
ఆ రోజు కూడా భర్త ఆఫీసుకు వెళ్ళిపోయాక ఆమె ఏదో వారపత్రిక చదువుతూ పడుకుని వుండగా, తలుపు కొట్టిన చప్పుడయింది. ఈ వేళప్పుడు ఎవరు వచ్చారా అని ఆమె ఆశ్చర్యపడుతూ వెళ్లి తలుపు తీసింది.
వరండాలో ఒక కుర్రవాడు నిలబడి వున్నాడు. కాలేజీ స్టూడెంట్ లో వున్నాడు.
"ఏం కావాలి?" అని అడిగింది రాధ కొద్దిగా భయపడి. ఆ లొకాలిటీలో ఇళ్ళు విసిరేసినట్టున్నాయి. ఎదురుగా నిలబడిన కుర్రవాడు రాష్ గా రౌడీలా వున్నాడు. చేతిలో సిగరెట్ వెలుగుతూంది.
"మీ ఇంటిలో గది ఖాళీగా వుందని విశ్వనాధం గారు చెప్పారు"
ముందు గది, దాని వెనుక వరండా గది ఎవరైనా కొత్త దంపతులకిస్తే కాస్త కాలక్షేపంగా వుంటుందని రాధ భర్తకి చెప్పింది. ఇలాటి కుర్రవాణ్ణి పంపిస్తాడనుకోలేదు.
"గదులేం లేవు" అంది రాధ కటువుగా.
అతడు కదలకుండా "అంటే విశ్వనాధంగారు అబద్ధం చెప్పారా?" అని అడిగాడు.
అతడు అలా నిలదీస్తున్నట్టు అడిగేసరికి ఆమెకు కోపం వచ్చింది. ".....గదుల్లేవు. పోర్షనుంది" అంది దెబ్బకొట్టినట్టు.
"ఫర్లేదు.....పోర్షన్ మొత్తం నేనే తీసుకుంటాను" అన్నాడు.
"ఒంటరివాళ్ళ కివ్వం-"
"నేను ఒంటరి వాడినని ఎవరన్నారు?"
"అంటే మీకు మ్యారేజీ అయిందా?"
"మ్యారేజి కాని వాళ్ళందరూ ఈ ప్రపంచంలో ఒంటరిగాళ్ళేనా-" అనేసి ఆ మాటలకి చివర ఒక నవ్వు కలిపాడు. ఆ నవ్వు 'తిరిగి దెబ్బకొట్టాను సుమా' అన్నట్టు వుంది.
"సారీ..." అని చెప్పి రాధ తలుపు వేసింది. ఆ సాయంత్రం భర్తకి చెప్పి మురారిని చివాట్లు పెట్టిదామనుకుంది. కానీ- వస్తూ వస్తూ భర్తే లోపలికి పిలిచి ఏదో చెప్పబోయేంతలోనే- అతడు ఆ వచ్చిన కుర్రాడికి రెండు గదులూ చూపించటం, అతడు తలూపటం, అద్దె అడ్వాన్స్ గా ఇవ్వటం జరిగిపోయినయ్!
మరుసటిరోజు సామాన్లు తీసుకొచ్చి ఇంటిలో జేరిపోతానని చెప్పి ఆ అబ్బాయి వెళ్ళిపోయాక భర్తతో దెబ్బలాట వేసుకుంది. "-ఇలాంటి స్టూడెంట్ కుర్రాళ్ళకి ఇవ్వడానికి ఇదేం లాడ్జింగ్ హౌస్ అనుకున్నారా?"
విశ్వనాధం తెల్లబోయాడు. "అదేమిటి రాధా! నువ్వేగా ఇంత పెద్ద ఇంటిలో వుంటే తోచటం లేదూ అన్నావ్" అన్నాడు.
"అలా అని కాలేజి కుర్రవాడిని తీసుకొచ్చి పెడతారా? ఎవరయినా ఆడవాళ్ళుంటే మీరు ఆఫీసుకెళ్ళినప్పుడు కాస్త కబుర్లు చెప్పుకోవచ్చు. కదా అనుకున్నాను" అంది.
ఆమెని అనునయించడానికి అతడు కొద్దిగా కష్టపడవలసి వచ్చింది. ఆమె అయిష్టంగానైనా ఒప్పుకోడానికి రాత్రి పదకొండు అయింది. సవతహాగా విశ్వానాధం కంటె రాధ తన మాట నెగ్గించుకొంటుంది. అలా అని చెప్పి దురుసు మనిషీ కాదు. చాలా హుషారుగా వుంటుంది. రాత్రిళ్ళు మరీనూ! ఒకోసారి ఆమె తాకిడికి అతడు తట్టుకోలేదు కూడా. తృప్తిపరచడం ద్వారా మగవాడిని డామినేట్ చేసిన భార్య మిగతా అన్ని విషయాల్లోనూ పై చెయ్యిగా ఉండగలుగుతుంది. స్త్రీ ఫ్రిజిడ్ గా ఉన్నకొద్దీ భర్త నిరంకుశుడూ అవుతాడు. ఒక్కసారి అతడికి తృప్తి లభించటం మొదలుపెట్టిన తర్వాత, తనంతట తానే ఆమెకు అధికారాన్ని అప్పగిస్తాడు. ఈ చిన్న సైకలాజికల్ పాయింటు ఆ భార్యభర్తలకి తెలియకపోయినా జరుగుతున్నది అదే! దానివల్ల నష్టంలేదు సరికదా- ఆ దంపతులు చాలా సంతోషంగా వున్నారు. ఒంటరిగా వున్నప్పుడు ఆమె భర్తని 'బుజ్జిబాబూ' అని పిలుస్తూంది. మరీ సంతోషం ఎక్కువైనప్పుడు ఇంకా చొరవ తీసుకుంటుంది. కానీ, ఇక్కడ వివరణ అప్రస్తుతం "నువ్వెన్నయినా చెప్పు బుజ్జిబాబూ! నాకు ఆ హిప్పీ కుర్రాడు అస్సలు నచ్చలేదు అంది. ఆ మాటల్లో ముందున్నంత కఠినత్వం లేకపోయేసరికి విశ్వనాధం సంతోషించాడు. అతడు శంకర్ కి చాలా జనరస్ గా వాగ్ధానం యిచ్చేశాడు అంతకుముందు రోజే!
సరిగ్గా పదకొండింటికి, మరుసటిరోజు ఆ కుర్రవాడు వచ్చి రూమ్ లో దిగాడు. ముందు ఒక కుక్క భౌ భౌ మని అరవటం వినిపించింది. ప్రహరీ దాటుకొని కుక్క లోపలికి ఎలా వచ్చిందా అని ఆమె ఆశ్చర్యపడి, చదువుతున్న పుస్తకం పక్కన పేట్టి వెళ్ళి తలుపు తీసి చూసింది.
అతడిని వరండాలో చూసి, అప్రయత్నంగా అడుగు వెనక్కీ వేసింది.
"హల్లో" అన్నాడు అతడు. ఆమె చూస్తూంది అతనిని కాదు. ఒకటి చేతిలో గొలుసు తెంపుకొనేటంతగా ప్రయత్నిస్తూ ముందు కాళ్ళమీద గెంతుతూన్న బొచ్చుకుక్కని. రెండు- అతడి వెనకేవున్న సామానుని. అంత సామానుతో ఒక నాలుగు కుంటుబాలు చాలా సులభంగా సంసారం చెయ్యొచ్చు. అయితే ఆ సామాను సంసారానికి పనికి వచ్చేది కాదు. అతడు నిలబడితే నడుమెత్తు వరకూ వచ్చే ఎత్తయిన స్టీరియో స్పీకర్లు అతడి వెనుక వున్నాయి. గిటారు ఆకారంలో జాయింటుగా వున్న పెట్టె వుంది. నాలుగైదు పెద్ద పెద్ద ఫోటోలున్నాయి. పెద్ద భోషాణం లాంటి బాక్సు వుంది. బట్టల మూటలోనుంచి రెండు మూడు జీన్స్ బైటికి వేలాడుతున్నాయి.
ఆమె నోరు తెరుచుకుని చూస్తున్నదల్లా అతడి మాటలకి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. "కాస్త నా గది తలుపు లోపలికి వెళ్ళి తీస్తారా" అంటున్నాడు అతడు.
"ప్లీజ్ గో! వియ్ ఆర్ నాట్ ఇంటరెస్టెడ్ ఇన్ లేట్టింగ్" అని అరుద్దామన్న ప్రయత్నాన్ని అతికష్టమ్మీద అణచుకుని లోపలికి వెళ్లింది. బెడ్ రూమ్ లోకి వెళ్ళి ఆ రూమ్ లోనుంచి అతడు తమ పడగ్గదిలోకి తొంగి చూడకుండా తొందర తొందరగా ధడేలున మధ్యతలుపులు వేసేసింది. ఆమెకెందుకో ఒక్క సారిగా రోషమూ, ఎవరిమీదో తెలియని కసీ, నీటిరూపంలో కళ్ళల్లో గిర్రున తిరిగాయి. తమ స్వేచ్చని ఎవరో బంధించినట్టు ఒక ఫీలింగ్ కలిగింది. అంతలో అతడు తన గదిలో సామాను పడెయ్యటం స్పష్టంగా వినిపించింది. ప్రతీదీ...... అంటే..... తమ గదిలో ప్రతీ శబ్దమూ ఇలాగే స్పష్టంగా ఆ గదిలోకి వినిపిస్తుందన్న మాట!
టేబిల్ లాంప్ ని విసిరికొడదామన్నంత కోపం వచ్చింది. అంతలో బైట తలుపు మీద చప్పుడు వినిపించింది. ఆమె బెడ్ రూమ్ లో నుంచి బయటకొచ్చింది.
ఆ కుర్రాడే.
"ఎక్స్ క్యూజ్ మి! కొంచెం మంచినీళ్ళిస్తారా?"
"ఇవ్వను" అని మొహంమీద తలుపు వేసేద్దామన్న కోర్కెను అతిబలవంతం మీద అణచుకుని లోపలికి వెళ్ళి గ్లాసుతో నీళ్ళు తీసుకొచ్చి, అతడు అందుకోవటానికి చేయి సాచేలోపులో.....కిటకిలో పెట్టింది.
అతడు నీళ్ళు తాగుతూ "నా పేరు శంకర్- రవిశంకర్" అన్నాడు. అతడు నీళ్ళు తాగితే, మళ్ళీ ఆ గ్లాసు ఇవ్వడానికి ఇంకొకసారి తలుపు కొట్టకుండా, అప్పుడే గ్లాసుని లోపలికి తీసుకుపోదామని నిలబడింది. "మీ పేరు?" అని అడిగాడు.
"మిసెస్ వి. విశ్వనాధం" అంది కటువుగా
తాగుతూన్న నీళ్ళు పోలమారేటట్టు నవ్వాడు. "కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ సెన్స్ ఆఫ్ ది రిపార్టీ.....మిసెస్ వి.....వి...నాధం." ఒక అరవ శ్రీమతిని అభినందిస్తున్నట్టు అని, ఆ తరువాత తన గదిలోకి వెళ్ళి రాధకన్నా ముందే తన గది తలుపు వేసుకున్నాడు.
ఆ తరువాత అయిదు నిముషాలయినా గడవకముందే అతడి గది స్సీకర్లలో నుంచి గిటారు వినిపించసాగింది. చాలా మంచి ట్యూన్ అది . కాలేజీలో చదివే రోజుల్లో వుమెన్స్ కాలేజీనంతా ఒక వూపు వూపేసింది ఆ.... వెంచర్స్ పాట...... అంత అందంగా ఈ కుర్రవాడు.....
ఈ గోల భరించలేను. భర్త రాగానే చెప్పి ఖాళీ చేయించాలి. ఇది ఇల్లు అనుకుంటున్నాడా? నైట్ క్లబ్ అనుకుంటున్నాడా? డామిట్.
ఆమెని రక్షిస్తున్నట్టు అతడు తలుపు తాళం వేసుకుని వెళ్ళి పోయాడు. ఆమె హాయిగా వూపిరి పీల్చుకుంది.
అప్పుడు వెళ్ళినవాడు సాయంత్రం అయిదింటివరకూ రాకపోయేసరికి ఇక అతడి గురించి తాత్కలికంగా మర్చిపోయింది. అయినా అటువంటి కుర్రాళ్ళు రాత్రి పదకొండింటి లోపులో ఇంటికి ఎప్పుడు చేరుకుంటారు గనక.
అయిదున్నర వరకూ భర్తకోసం చూసి, తలుపు దగ్గరగా జారేసి ఆమె స్నానానికి వెళ్ళింది. రెండు నిముషాలకి భర్త వచ్చిన అలికిడి అయింది. "వచ్చేస్తున్నా నేనొచ్చి కాఫీ ఇస్తా! మీరా వంటింటిలో ఏమీ కెలక్కండి" అంది. విశ్వనాధం బుద్ధిమంతుడు. గొడవ చెయ్యడు, ఆమెకెందుకో ఆకస్మాత్తుగా భర్తని చిలిపిగా ఏడిపించాలని బుద్ధిపుట్టింది. కుచ్చిళ్ళు సర్దుకుని బాత్ రూమ్ తలుపు తీస్తూ "మీరు చెయ్యాల్సిన పన్లన్నీ రాత్రిళ్ళు నన్ను చెయ్యమని వేపుకు తింటారు చూడండి- ఒకటే ఒళ్ళు నొప్పులు" అంటూ బయటకొచ్చింది. ఇలా అల్లరి చెయ్యటం ఆమెకి బాగా అలవాటు. విశ్వనాధానికి ఇష్టంకూడా.
కానీ దురదృష్టవశాత్తూ అతడు కాదు ఆ గదిలో ఉన్నది. ఆమె విన్న అలికిడి ముందు హాల్లో శంకర్ ది. అతడి చేతిలో కూజా వుంది.
భూమి రెండుగా చీలిపోయి తను అందులో కూరుకుపోతే బావుణ్ణు అన్న భావన కలిగిందామెకి. అంత చూసుకోకుండా మాట్లాడేసినందుకు తనమీద తనకే కోపం వచ్చింది. అతడి మోహంలో కనపడీ కనపడనట్టు కదలాడిన చిరునవ్వు ఆమెకి మరింత కోపాన్నీ, ఉక్రోషాన్నీ కలింగించింది. సొంత ఇల్లు అయినట్టు అలా లోపలికి వచ్చి తన రహస్య జీవితంలో ప్రవేశించటం ఏమిటి? పైగా ఆ రహస్యాన్ని కనుకున్నట్టు నవ్వేమిటి?.....ఇడియట్.
ఆ రోజంతా ఆమెకి ఏమీ తోచలేదు. ఎవరిమీదో అకారణంగా కోపం వస్తూంది. ఆ కుర్రవాణ్ణి ఎలా అయినా గది ఖాళీ చేయించాలన్న కోర్కె క్షణక్షణానికి బలంగా పెరుగుతూంది. వీలైతే ఈ రోజు భర్తమీద నిరాహారదీక్ష ప్రకటించాలని కూడా అనుకుంది.