అందరం అటు చూశాం. ఆటక క్రింద పెద్ద పెట్టె వుంది. ప్రశస్తమైన టేకుచెక్కతో చేసినట్టుంది అది. చాలా పురాతనమైనది. ఒక మనిషి హాయిగా అందులో కూర్చోవచ్చు. దాన్ని చూసి "సరిపోతుంది" అన్నాడు వెంకటేష్.
"మంచిది. మరెప్పుడు కూర్చుంటారు?"
"ఇప్పుడే"
నేను కంగారుపడి- "ఏదయినా ఘోరం జరిగితే అందరం ఇరుక్కుంటాం" అన్నాను.
వెంకటేష్ నావైపు తిరిగి, "ఎటువంటి ఘోరం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు?" అని అడిగాడు. నేను చెప్పటానికి సంశయించాను. అంతలో అతడికి అర్థమయినట్టు నవ్వి, "ఓ అదా!" అన్నాడు. నిజమే....నేనుగానీ పెట్టెలో మరణిస్తే పోలీసులు మిమ్మల్నందర్నీ అరెస్టు చేస్తారు. నా మూలాన మీరందరూ కేసులో ఇరుక్కోవటానికి నేను ఇష్టపడను. అందుకని నేను ఒక ఉత్తరం వ్రాసి పెడ్తాను- నా ఆత్మహత్యతో ఎవరికీ సంబంధం లేదని! ఒకవేళ నేను మరణిస్తే ఆ ఉత్తరం బైట పెట్టండి" అన్నాడు.
"ఎందుకిన్ని గొడవలు?" అన్నాను, ఎలాగయినా దీన్ని ఇక్కడ ఆపుచేద్దామన్న ఉద్దేశంతో. ఇంతవరకూ వచ్చాక ఇక దాన్ని మేమే సృష్టించామనుకుంటారు. మీరు మీ ఇంటిలోనే దాన్ని ఏ బల్లమీదో పెట్టి, వస్తే బావుంటుంది" అన్నాడు రామ్మూర్తి.
వెంకటేష్ లేచి- "సరే" అని నావైపు తిరిగి, "రండి. మా ఇంటికి వెళ్ళి అయిదు నిముషాల్లో వచ్చేద్దాం" అన్నాడు. నేను రామ్మూర్తి వైపు చూశాను. అతడు కర్చీలోంచి లేస్తూ, "ఈ లోపులో పెట్టెలో వస్తువులు తీయించి ఖాళీ చేయిస్తాను" అన్నాడు.
"ఏమున్నాయ్ అందులో?"
"వెండి సామాను" అన్నాడు రామ్మూర్తి.
"కొంచెం సాంబ్రాణి పోగా అదీ వేయించండి, లేకపోతే వాసన భైర్మచ లేం" అంటూ కదిలాడు వెంకటేష్.
ఇద్దరం కలిసి అతడి ఇంటికి వెళ్ళాం. తాను జీవితంమీద విరక్తి చెంది ఈ ఆత్మహత్య చేసుకుంటున్నాననీ, తన మరణంతో ఎవరికీ సంబంధంలేదనీ అతడు ఉత్తరం వ్రాసి టేబుల్ మీద పెట్టాడు. తరువాత లోపలి వెళ్ళి రెండు నిముషాల్లో వస్తూ "పదండి" అన్నాడు.
మేం తిరిగి వచ్చేసరికి పెట్టెని శుభ్రంచేసి ఉంచాడు రామ్మూర్తి. లోపల చెక్క మిలమిలా మెరుస్తూంది. మోకాళ్ళ మీద కూర్చోవటానికి గానీ, పక్కకి వత్తిగిలి పడుకోవటానికి గాని సరిపోయేటట్లు వుంది అది. వెంకటేష్ దానివైపు సంతృప్తిగా చూశాడు.
గడియారం గంటలు కొట్టడం ప్రాంభించింది.
వెంకటేష్ ఒక కాలుని పెట్టెలో పెట్టి అందరివైపూ చూశాడు. అందరం అతడినే చూస్తున్నాం ఎందుకో తెలీదుగానీ, నా వెన్ను ఒక్కసారిగా జలదరించింది. ఆడవాళ్ళ వైపు చూశాను. మేము వెళ్ళాక భర్తతో బాగా ఘర్షణ పడ్డట్టు రామూర్తి భార్య మొహం చెబుతూంది. అరుణ అయితే తనకి తండ్రి వయసువాడితోనో పెళ్లి కాబోతున్నది అన్న విషయం మర్చిపోయి, జరిగే తంతుని ఉత్సకతతో చూస్తూంది. ఆ అమ్మాయి వయసులో ఉండే థ్రిల్ అలాంటిది.
వెంకటేష్ రెండోకాలు కూడా లోపల పెట్టేసి, పెట్టెలో కూర్చున్నాడు. రామ్మూర్తి పెట్టె దగ్గిరకు వెళ్ళి తలుపు మూయబోతూ ఒక సుత్తి లాటిదాన్ని అతడికి అందించి, "లోపల ఉండలేకపోతే దీనితో కొట్టండి. రాత్రంతా నేను దీని పక్కనే కూర్చొని వుంటాను. మొహమాటపడకండి" అన్నాడు.
వెంకటేష్ తలబైటపెట్టి నవ్వి, "నాకంత అవసరం రాదనే అనుకుంటున్నాను" అని సుత్తిని బైట పడేసి తలుపు జార్చేసుకున్నాడు.
'టప్' మన్న చప్పుడుతో మూతపడిపోయింది. గదిలో ఒక మూలగా ఆడవాళ్ళిద్దరూ భయంతో నిలబడి వున్నారు. రామ్మూర్తి పెట్టె గడియవేసి, వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు.
గడియారం తాలూకు టిక్ టిక్ మన్న చప్పుడు తప్ప మరేమీ వినిపించటం లేదు. గదిలో ఆ మూల శవపేటికలా పెట్టె.....
నేను దానివైపే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను. అయిదు నిముషాలు.... పది నిముషాలు.... లోపల్నుంచి ఏ శబ్దమూ లేదు. లోపల వెంకటేష్ హాయిగా నిద్రపోతున్నాడా? (లోపల ఏంజరిగిందో ఇప్పుడు నేను చెపుతాను).
పెట్టె తలుపు టప్ మన్న శబ్దంతో మూసుకుపోగానే లోపలంతా గాఢాంధకారమయింది. ఇటువంటి చీకటికి అనుభవం లేనివాడయితే మొదటి క్షణంలోనే పిచ్చెక్కిపోతాడు. గదిలో కరెంటు పోవడం వేరు, పెట్టెలో నాలుగు మూలలూ ఇరుగ్గా వున్నచోట కూర్చోవటం వేరు. అసలు గాలి తగలదు 'బైటకు వెళ్ళడానికి వీలవదు-' అన్న భావమే భయపెట్టి రక్తప్రసారాన్ని పెంచి పిచ్చివాళ్ళని చేస్తుంది. ఆ భయం అనుభవంతో తప్ప మామూలుగా తెలియదు.
కాని వెంకటేష్ ఇంతకన్నా చిన్నపెట్టెలో ఇంతకన్నా ఎక్కువకాలం వుండటాన్ని ప్రాక్టీస్ చేసినవాడు.
పెట్టె తలుపు మూసుకుపోగానే కదలకుండా ఒక క్షణం ఆగి, గుండెనిండా వూపిరి పీల్చుకున్నాడు. తరువాత చకచకా తనపని మొదలుపెట్టాడు.
ముందు పాంటు మడతలో దాచిన పెన్ టార్చి తీసి వెలిగించాడు. తరువాత జేబులోంచి చిన్న సీసా తీసాడు. ఇవన్నీ అతడు ఆత్మహత్య ఉత్తరం వ్రాసి పెట్టడానికి ఇంటికి వెళ్ళినప్పుడు తనతోపాటు తెచ్చుకున్నవి ఆ సీసాలో వున్న ద్రవం కొన్ని మూలికలతో చేయబడింది. అది రాసుకుంటే వంటికి చెమట పట్టదు. గాలి లేక శరీరంలో జరిగే పరిణామాల్ని అది ఆపుచేస్తుంది. అతడు ఆ ద్రవాన్ని పూర్తిగా రాసుకున్నాడు.
ఇదంతా జరగడానికి అయిదు నిముషాలు పట్టింది. అప్పుడే పెట్టెలో ప్రాణవాయువు అయిపోయి.....కొద్దిగా ఇబ్బంది పెట్టసాగింది. కాని వెంకటేష్ కి ఏ పని ఎంతసేపట్లో- ఏ వయసలో చేయాలో బాగా తెలుసు. అనుభవమున్న డాక్టరు తన పని తాను చేసుకుపోతున్నట్టు ఒకదాని తరువాత మరొకపని చేసుకుంటూపోతున్నాడు.
ఒంటినిండా రసాయనం రాసుకోవడం పూర్తిచేసుకోగానే జేబులోంచి నాలుగు మాత్రలు తీసుకున్నాడు. అవి మామూలు నిద్ర మాత్రలు కావు. అంత కంటే పవర్ ఫుల్ అయినవి. వేసుకున్న అయిదు నిముషాల్లో నిద్ర పట్టేస్తుంది- ఎటువంటి పరిస్థితుల్లో వున్నాసరే.
ఈ మాత్రలు వేసుకుని నిద్రపోకపోతే ఆ చీకటికి ఒక విధమైన ఫోబియా వస్తుంది. ఒక్కసారి నిద్రపోతే, మళ్ళీ లేచేసరికి ఇరవై నాలుగు గంటలు గడిచిపోతాయి. ఈ మాత్రలు వేసుకుని సరిగ్గా ఇరవై నాలుగు గంటల తరువాత- అరగంట అటూ ఇటూ కాకుండా లేవతాన్ని అతడు చాల బాగా ప్రాక్టీసు చేశాడు. అతడు లేచి అన్నీ సర్దుకుని బయటకొచ్చే సరికి, బయటి వాళ్ళు తలుపు లేసి, లోపల్నుంచి నవ్వుతూ లేచిన ఆ మానవాతీత వ్యక్తిని చూసి, ఆశ్చర్యంతో తలమునకలై పోతారన్నమాట.
అతడు నాలుగు మాత్రలూ మింగి, తను చెయ్యవలసిన పన్లతో ఆఖరి ఐటమ్ కి వచ్చాడు.
చొక్కా లోపలి భాగంలోంచి ఒక డ్రిల్లింగ్ మిషన్ లాటిది తీశాడు. స్పెషల్ బ్యాటరీతో పనిచేసే పరికరం అది. దాని చివర సూదిగా వుంది, స్క్రూడ్రైవర్ లా.....
బటన్ నొక్కగానే అది గిర్రున తిరగసాగింది. చెక్కకి కన్నం పెట్టే సాధనం అది.
తను ఏ భంగిమలో పడుకున్నాడో, గోడ ఎటువైపుఉందో ముందే చూసుకుని గుర్తుపెట్టుకున్నాడు అతడు. గోడవైపు కన్నం పెడితే (చాలా చిన్న కన్నం) ఎవరికీ తెలియదు.
ఆ కన్నానికి సరిపడా పట్టే గొట్టం కూడా అతడి దగ్గర ఉంది. దాన్ని బైటకి తీశాడు. ఆ గొట్టం ఒక చివర రెండుగా విడిపోయింది. ఆ రెండు చిన్న గొట్టాల్ని ముక్కుకన్నాల్లో దోపుకుని వాటిద్వారా గాలి పీల్చటాన్ని కూడా అతడు చాలా కాలం నుంచి ప్రాక్టీసు చేశాడు.
పెట్టెకి కన్నం చేసి, ఆ కన్నం గుండా రబ్బరు గొట్టాన్ని బయటకు జారిస్తే ఇక తాను ఈ విశాల ప్రపంచంలో వున్నట్టే.
మాత్రల ప్రభావం మొదలై- కనులమీద నిద్రతెరజారుతూ వుండగా అతడు పెట్టెకి కన్నపెట్టటం అనే అంశాన్ని చేపట్టాడు.
* * *
"ఏవండీ! నా కెందుకో భయంగా వుందండీ" అంది రామ్మూర్తి భార్య.
"నీ మొహం భయం ఎందుకు?" అన్నాడు రామ్మూర్తి. పైకి అలా అన్నాడే గానీ, తను ఓడిపోతున్నానన్న భయం అతడి మొహంలో కొట్టొచ్చినట్టు కనబడుతూంది. అవును మరి. వెంకటేష్ లోపలి వెళ్ళి అప్పుడే అరగంట గడుస్తూంది. ఇంటి అల్లుడు పందిరిమంచం గదిలోకి వెళ్ళి పడుకున్నట్లుగా అతడు లోపలి వెళ్ళి పడుకున్నాడు. చిన్న అలికిడి కూడా లేదు లోపలినుంచి.
"మనం రాత్రంతా ఇలాగే కాపలా కాయాలా?"
"అక్కరలేదు. పోయి పడుకుందాం. నన్ను క్షమించు- నీకు చాలా ముసలి అల్లుణ్ణి తెచ్చి పెడుతున్నాను. ఆ బాధతో ఈ రాత్రంతా నీకు నిద్ర పట్టదేమో!" అన్నాడు రామూర్తి.
"ఆ బాధేమో కానీ, ముందు చేతులు పీక్కుపోతున్నాయి- ఇంత ఇనప్పెట్టెని పైనుంచి దించి శుభ్రం చేసేసరికి" అంది ఆవిడ.
"ఇనప్పెట్టెమిటి- చెక్క పెట్టె కదా" అన్నాను నేను.
"కాదు- చాలా బరువుంటుంది" అన్నాడు రామ్మూర్తి దానివైపే చూస్తూ..... "మా పూర్వీకులు జమీందార్లు. దీనిలో బంగారాన్ని దాచుకొనేవారట. ఓడలు బళ్ళయి....మేం వెండి, స్టెయిన్ లెస్ స్టీలు దాచుకోంటున్నాం. చెక్కలా కనబడేట్టు నగిషీ చెక్కినందుకు ఆ పనివాడికి ఒక పరగణా వ్రాసి ఇచ్చాడట ఆ రోజుల్లో మా మూట్టాట తాత. ఇప్పటికీ కథల్లా చెప్పుకుంటూ వుంటాం. దాన్ని మీరిద్దరూ వుండగానే దింపాల్సింది. మీరు వెళ్ళిపోయేటప్పటికి -మేం ముగ్గురం దీన్ని ఆటక మీదనుంచి దించటానికి చచ్చాం."
* * *
"తరువాతేమయింది?" వూపిరి బిగపట్టి వింటూన్న నలుగురిలో శేషూ ఆతృత పట్టలేక అడిగాడు.
వెంకు నవ్వి, "ఈ రోజు బిల్లు నేను ఇవ్వక్కర్లేదు అంటే చెప్తాను" అన్నాడు అంతే చెప్పాలి. ఆ కథకు ఎన్ని మార్కులు వేయాలి అన్నది మిగతావాళ్ళు నిర్ణయిస్తారు. అందరికన్నా తకువ మార్కులు వచ్చినవాళ్ళు బిల్లు ఇవ్వాలి. అంతేగానీ, కథ ముగింపు దగ్గిర ఆపుచేసి ఇలాటి కండిషన్ పెట్టగూడదు" అన్నాడు విజ్జూ.
వెంకు మళ్లీ నవ్వి, "అయితే నా కథ అయిపోయింది" అన్నాడు.
విజ్జూ శేషువైపు తిరిగి "నువ్వు మొదలుపెట్టు నీ కథ" అన్నాడు.
* * *
విమానాశ్రయం నిద్రాదేవత ఒడిలోకి జారుకుంటూంది. చేతిలో సిగరెట్టు గ్లాసులో ద్రవం చలిని ఆమడంత దూరం పరుగెత్తిస్తున్నాయి. ఆ రాత్రి చాలా ఆనందంగా గడుపుతున్నాం. డబ్బు సమస్య కాదు కానీ బిల్లు ఇవ్వకుండా ఉండటం కోసం ప్రతీవారూ పంతం పట్టి ఒకరికంటే ఒకరు మంచి కథ చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాము.
"మంచి కథ అంటే మీ ఉద్దేశ్యంలో సస్పెన్స్ థ్రిల్లరే అనుకుంటున్నట్టున్నారు అందుకే ఇటీవలి సాహిత్యపు అడవిలో అనుకరణ వాత పెట్టుకుంటున్న నక్కలా ఒకరికంటే మరొకరు, మరింత సస్పెన్సే ముఖ్యం అయితే డిటెక్టివ్ కథలే చాలు."
"ఉపోద్ఘాతంతో మా మెదళ్ళని ముందే ప్రిపేర్ చెయ్యక, అసలు కథ ప్రారంభించు" అన్నాడు విజ్జూ.
"వస్తున్నా! మనిషికీ, మనిషికీ మధ్య వున్న సంబంధంకన్నా సస్పెన్సు అయినది ఇంకొకటి లేదని నా ఉద్దేశ్యం. దానికితోడు అప్పీలింగ్ టు ది సెన్సెస్ వుండాలి. కొద్దిగా రొమాన్సు కూడా...
రోమాన్స్ అనగానే మిగతా నలుగురూ ఆసక్తిగా ముందుకు వంగారు. వాళ్ళని చూసి "నా కథ పేరు - వరండాకుర్రాడు" అన్నాడు శేషు.
"సూపర్బ్ టైటిల్"
శేషు నవ్వుతూనే "ఇది నా కథే. అయితే ఇందులో నేను విశ్వనాధన్నా వరండా కుర్రాణ్ణా- అన విషయం మాత్రం చెప్పను. కథ చివర్లో కూడా, మీరందరూ మీ కథలు సగంలో ఆపుచేసి అదే గొప్ప సస్పెన్స్ అన్నారు. నేను సస్పెన్స్ ముందు చెప్పేసి ఆ తరువాత కథ చెబుతున్నాను. అదే కథ గొప్పతనం."
*శుభం*
(54 ఎపిసోడ్ నుంచి శేషు చెప్పిన కథ : వరండా కుర్రాడు వస్తుంది)