"నీకు లెక్కలేకపోయినా అందరికి లెక్కవుంటుంది ఓ పెళ్లికాని యువతితో నీ చనువు ఎవరూ హర్షించరు ఎవరో తెలియని ఓ అనాధని వెంట బెట్టుకు వచ్చావు. సరే పనికి కుదిర్చావు, పని చేస్తూంది.... బాగుంది, అంతేకాక ఆమె స్థానంలో ఆమెని వుంచకుండా యింటి యిల్లాలుని మించిన చనువు, స్థానం ఇవ్వడంలో నలుగురూ ఎలా మాట్లాడుతారో ఊహించలేవా? ఈ అమ్మాయి వచ్చాక ఇంట్లో వచ్చిన మార్పులు గ్రహిస్తున్నాను. ఏనాటినుంచో మన ఆశ్రయంలో వున్న నౌకర్లని వెళ్ళగొట్టావు నేను కలుగజేసుకోలేదు. ఈ అమ్మాయి ఇల్లంతా ఓ యిల్లాలులా చక్కదిద్దుతూంది. సరే మంచేగదా చేస్తుంది అని నేను పట్టించుకోలేదు. కాని ఆమెతో నీ చనువుని హర్షించలేని ఆమె స్థానంలో ఆమెని వుంచమని చెప్పడానికే పిలిపించాను ఆమె హద్దుల్లో ఆమెని వుంచు. అది ఆమెకీ మనకీ మంచిది గంభీరంగా అంది జమీందారిణి. రంగారావు ఆవేశం బలవంతాన అణచుకున్నాడు. ఒక్క క్షణం ఆలోచించి ఏదో నిశ్చయం చేసుకున్న వాడిలా తల పంకించాడు.
"సరే, ఆమె స్థానంలో ఆమెని ఉంచుతాను. నలుగురూ ఏమనుకునే అవకాశం ఇవ్వను." అన్నాడు స్థిరంగా రంగారావు. జమీందారిణి అర్ధంకానట్టు చూసింది. రంగారావు తల్లివంక చూసి "శ్యామలని నేను వివాహం చేసుకుని మా ఇంట్లో ఎవరూ నోరెత్తలేని స్థానం ఇస్తాను. అప్పుడింక మీకు అభ్యంతరం ఉండదు గదా" గంభీరంగా అన్నారు. జమీందారిణి తెల్లబోయింది. "ఏం మాట్లాడుతున్నావో తెలుసా? నీ వెవరో, శ్యామల ఎవరో గుర్తుండే మాట్లాడుతున్నావా?" కాసేపటికి అనగలిగింది కోపం పట్టలేక-" ఎక్కడ పుట్టిందో -ఎవరికి పుట్టిందో తెలియకుండా అనాధగా పెరిగిన ఆమెని జమీందారిణి చేస్తావా?"
"హు! జమీందారిణి జమీందారీలు యింకా ఉన్నాయా మనకి!" రంగారావు అదోలా నవ్వారు. "జమీందారీ లేకపోయినా మన వంశం-పరువు ప్రతిష్టలు మిగిలే వున్నాయి. మన తాహతు ఎలాంటిదో కూడా గుర్తులేకుండా పోయారు నీకు?" కటువుగా అంది. రంగారావు విరక్తిగా" ఇన్నాళ్ళూ వివాహం చేసుకోమని విసిగించారు. తీరా నేను చేసుకుంటానంటే అభ్యంతరం చెపుతున్నారు?" అన్నారు.
"అవును వివాహం చేసుకోమన్నాను. అయినింటి మన వంశ మర్యాదలకి సరిపోయే అమ్మాయిని చేసుకోమని అర్ధంగాని- యిలా ఓ అనాధని --అనామికని చేసుకోమని గాదు" తీవ్రంగా అంది ఆవిడ. "అమ్మా మీకు నా వయసు నలభై సంవత్సరాలని- నా వయస్సు చూసి ఏ గొప్పవాళ్ళు తమ ముద్దు బిడ్డని రెండో వివాహానికి యివరన్నది గుర్తులేదా. జమీందారిణి ఒక్క క్షణం సంశయంలో పడింది డబ్బులేని పిల్ల అయిన సదంశ, సచ్చరిత్ర కల్గిన పిల్లలు కావాలంటే దొరక్కపోరు. నిమిషాల మీద కుదర్చగలను ఎంత రెండో పెళ్ళి అయినా మన హోదా చూసి పిల్లనిచ్చేందుకు అనేకులు తయారుగా వుంటారు".
"కాని నేను తయారుగా లేను. నేను వివాహం చేసుకోవాలని మీరనుకుంటే శ్యామలనే చేసుకుంటాను-లేదంటే యిలాగే వుంటాను. బాగా ఆలోచించి రేపు జవాబివ్వండి రంగారావు తన నిశ్చయం తెలియజేసి మరేం మాట్లాడడానికి అవకాశం యివ్వలేదు. జమీందారిణి మొఖం అరుణిమదాల్చింది. "పరువు ప్రతిష్టలకోసం ప్రాణం పెట్టే నీవే యిలా మాట్లాడడం నేసహించని విషయం. పరువు ప్రతిష్టల కోసం అందరికి అన్నీ చెప్పి నీవిలా మారిపోతావని నే ననుకోలేదు ఇదంతా ఆ శ్యామల వల్లే గదా" ఆవిడ నిష్టూరంగా కటువుగా అంది.
"పరువు ప్రతిష్టలకు భంగం కల్గే పనులు నేనేం చెయ్యలేదని నా నమ్మకం. మీకూ ఆ నమ్మకం వుంటే యీ వివాహం జరుగుతుంది ఆలోచించి చెప్పండి." రంగారావు విసురుగా వెళ్ళిపోయాడు. ఆ రాత్రి జమీందారిణికి జబ్బు తిరగ పెట్టింది. మాటపూర్తిగా పడిపోయింది. కుడివైపంథా పక్షవాతంతో పూర్తిగా చచ్చుపడిపోయింది. తరువాత నెల రోజులలో రంగారవు శ్యామలని వివాహం చెసుకున్నాడు. ఏ ఆర్భాటం లేకుండా రిజిష్టర్ మేరేజ్ చేసుకున్నారు. ఆ వివాహం ఆయన బంధుమిత్ర వర్గాలలో సంచలనాన్నే కల్గించింది.
జమీందారిణి ఆఖరికి తన సమ్మతి తెలియ చెప్పక తప్పలేదు. ఎంత ఆలోచించినా అంతకుమించి మరో మార్గం కనపడలేదు. కొడుకు పంతం, పట్టుదల తెల్సిన ఆవిడ ఆమెదించక తప్పలేదు. శ్యామల వచ్చాక కొడుకిలో ఎంత మార్పు వచ్చింది చూశాక - కాదంటే తిరిగి అతను ఏ విధంగా మునుపటిలా తయారవుతాడో ఊహించి- చూస్తూ చూస్తూ కొడుకు జీవితం పాడావుతూంటే సహించలేనని, తమ వంశం నిరంశం అవడం సహించక ఆవిడ మనసు సరిపెట్టుకుని అంగీకరించాల్సి వచ్చింది.
రంగారావు శ్యామలకి తమ అభిప్రాయాన్ని చెప్పగానే శ్యామల ముందు తెల్లపోయింది. ఆశ్చర్యంతో మాటరాలేదు. తరువాత ఆమె కృతజ్ఞతతో, ఆనందంతో ఆయన పాదాలు పట్టుకుంది, తనలాంటి దానిపట్ల ఆయన అభిమానానికి ఆమె పూర్తిగా చలించిపోయింది. అంత అదృష్టం తనకి పడుతుందని అనుకోలేదు. నమ్మలేను అంటూ పదే పదే కళ్ళు తుడుచుకుంది. "ఇది అదృష్టమని భావిస్తున్నావా శ్యామలా, నా వయసు వాడితో రెండో వివాహం చేసుకొనే వాడితో పెళ్ళి అదృష్టం అనుకుంటున్నావా?" అన్నారాయన అభిమానంగా.
"యింత గొప్పింటి కోడలిని అవడం మీ సహచర్యం పొందడం మీ నీడన విశ్రాంతిగా జీవితం వెళ్ళిపోవడంకంటే నాలాంటి అభాగ్యురాలు కొరుకునే అదృష్టం ఇంకేముంటుంది ఎక్కడ పుట్టానో, ఎలా పెరిగానో తెలియని నికృష్ట జీవితం గడిపిన నాకు ఇది నాకు అదృష్టం కాదంటారా- కాదని మీరన్నా నేను అనుకోను- అనుకోలేను. మీలాంటి భర్తను పొందగలగడం పూర్వజన్మ సుకృతం- మీ జుట్టు నేరవచ్చు- కాని మీ మనసుకి ముసలితనం రాలేదని నాకు తెలుసు-కేవలం వయసు ఒక్కటే కాదు వివాహానికి కావల్సింది- మనసు ముఖ్యం అది మీరిస్తూన్నారు. నాకింకేం కావాలి కాని ఇందుకు మీ అమ్మగారు సమ్మతించదు- మీ బంధువర్గం ఒప్పకోరు. అందరి మనసులు ఈ నిర్భాగ్యురాలి కోసం నొప్పించవద్దు. మీరింత నీడ యిచ్చారు అది నాకు చాలు" అంటూ వారించ బోయింది.
"ఎవరో ఏదో అంటారని, అనుకుంటాడని యీ రత్నాన్ని జారవిడవను శ్యామలా! చీకటైపోయిన నా బ్రతుకులో వెలుగునింపావు చేతులారా ఈ వెలుగుకి దూరమై చీకట్లో తడుములాడుతూ ఇంకా బతికే ఓపికలేదు శ్యామలా! మిగతా విషయాలు నీకనవసరం. నీ అంగీకారం ఒక్కటిస్తే చాలు నాకు" అన్నాడు రంగారావు.
శ్యామల ఇంకేం అంటుంది? ఏం అనగలదు? రంగారావు శ్యామలల వివాహం జరిగి నెల రోజులు కాకముందే జమీందారిణి రెండు రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు శ్యామల ఆ ఇంటికి - జమీకి - రంగారావు కి అందరికి రాణి! రంగారావు ఏడాది తరువాత చాలా నిశ్చింతగా, ప్రశాంతంగా, ఆనందంగా శ్యామల సహచర్యంలో రోజులు గడుపుతున్నారు. నిజానికి ఆయన మొదటి భార్య బతికి వున్నప్పుడు కూడా ఆయనిలా లేడు. కారణం రమాదేవి జమీందారు బిడ్డ- జమీందారు కుటుంబాలలో అలవాట్లు ఆ హోదాలప్రకారం.