ఆమె నిస్సహాయంగా చూస్తూండిపోయింది. దిగులేసింది. చివరికి అంది......"చూడండి. ఈ విషయం ప్రప్రథమంగా నేను వ్రాస్తే......నాకీ ఉద్యోగం దొరుకుతుంది. లేకపోతే రేపట్నుంచి నాకు ఉద్యోగం వుండదు."
అతడామె వివరాలు కనుక్కున్నాడు......"నేనెలాగూ ప్రాక్టీసు పెట్టాలను కుంటున్నాను. నా దగ్గర రిసెప్షనిస్టుగా చేరుదురుగాన్లెండి."
"అంతేకానీ విషయం ఏమిటో చెప్పనంటారు"
"చెప్పను"
ఆమె మౌనంగా కూర్చుండిపోయింది. ఆమె హర్ట్ అయినట్టు గుర్తించి. ఏం పత్రిక అది?" అడిగాడు.
"మాదీ......" అంటూ అందించింది. అతడు పేజీలు తిప్పుతూంటే 13 - 14 - 15 అని కనపడింది.
"ఈ పేరేదో గమ్మత్తుగా వుందే"
"స్త్రీ సైకిల్ గురించి....."
"ఓ అదా! అయితే మీ ఎడిటర్ గారేనన్నమాట నాకు ఫోన్ చేసి అడిగింది."
"ఏమని అడిగారు?"
అతడు వివరాలన్నీ చెప్పాడు. ఆమెకు అది చాలా ఆసక్తికరంగా అనిపించింది. అయితే అంతకన్నా ముఖ్యమైనది మరొకటి వుంది. ఈ విధంగా అతడితో 'మరికొంత' సేపు సంభాషణ పొడిగించవచ్చు. ఇంటర్వ్యూలో ఎప్పుడూ అది మంచి పద్ధతి. ఎక్కడో ఒకచోట, మనకి కావలసిన విషయం రాబట్టవచ్చు.
"అయితే.....పిల్లలు కలుగని దంపతుల్ని 13.... 14..... 15 తేదీల్లో తన దగ్గరికి రమ్మని డాక్టరు కోరటం తప్పంటారా?" అడిగింది.
"సైంటిఫిక్ గా తప్పు. మామూలు సైకిల్ వున్న స్త్రీలకయితే తప్పు కాకపోవచ్చు. కానీ జాగ్రత్తగా గమనిస్తే, పిల్లలు కలగని చాలామంది స్త్రీల్లో సైకిల్ నార్మల్ గా వుండదు. అటువంటి వాళ్ళని 13.... 14... 15 రోజుల్లో రమ్మనటం దారి ఖర్చులు దండగ."
"సరిగ్గా అండం ఎప్పుడు ఏర్పడుతుంది?"
"అదెవరూ సరిగ్గా చెప్పలేరు. కానీ ఏర్పడిన పదమూడో రోజు మాత్రం బయటకు వెళ్ళిపోవటానికి సిద్ధపడుతుంది....." అంటూ బల్లమీద వున్న ఒక కాగితం తీసుకుని ఛార్ట్ వేసి, "ముప్పై ఆరు రోజుల సైకిల్ వున్న స్త్రీని తీసుకుంటే, వెనుకనుంచి 13 రోజులు లెఖ్ఖ పెట్టాలి. ముందు నుంచి కాదు" అంటూ ఛార్ట్ పూర్తి చేసాడు.
"పైరకం స్త్రీని పరీక్ష చెయ్యటానికి ఉత్తమమయిన దినాలు 22, 23,24 అంతేకానీ 13 , 14, 15 అని పేరు పెట్టింది. రేపు ఒకవేళ ఈ నవల సూపర్ హిట్ అవుతే విమర్శకులు ఈమె మీద విరుచుకుపడతారు రంత్రా న్వేషణ చేస్తారు"
"ప్రహి నవ్వేడు.... "....అప్పుడా రచయిత్రి ఏదో కొత్త థియరీ చెప్పి తనను తాను సమర్థించుకుంటుందిలెండి."
"ఎవరావిడ?"
"లక్ష్మి...... అని"
"ల.....క్ష్మి అన్నపేరు వినగానే అతడి చేతిలో పెన్ను క్రిందపడింది. "లక్ష్మా' అన్నాడు. అతడి స్వరంలో ఉద్వేగాన్ని ఆమె సునిశితమైన దృష్టి పట్టుకుంది. అతడిలో సంచలనాన్ని ఆమె గుర్తించింది.
"ఇతడికి నిశ్చయంగా ఎవరో 'లక్ష్మి' అనే ఆవిడతో పరిచయం వుంది"..... అనుకుంది.
"ఏం వ్రాస్తోంది ఆమె?" అతడి స్వరం కంపించింది. మనిషిలో మార్పొచ్చింది.
అతడినే గమనిస్తూ, "చిత్రమేమిటంటే ఆమె సీరియల్ లో హీరో పేరు ప్రహసిత్" అంది. అంతే. అతడు చప్పున లేచి ఆమె భుజం పట్టుకుని, "ఆమె.....ఆమె అడ్రస్ నాక్కావాలి" అన్నాడు. అనటం కాదు. దాదాపు అరిచాడు. ఒక మనిషి అంత ఉద్వేగం చెందటాన్ని చూడటం ఆమె కదే ప్రథమం! భారతదేశానికి చెందిన ప్రముఖ ఆటగాడు, ఒక లేడి జర్నలిస్టు భుజం పట్టుకుని ఆవేశం చెందటం.....!
.....ఆమె ఆలోచనలకి క్షణాల్లో రూపకల్పన జరిగింది.
"తప్పకుండా ఆమె అడ్రస్ ఇస్తాను" అని ఆగి, ".......మీరెందుకు టెన్నీస్ నుంచి విరమించుకుంటున్నారో చెప్తే" అంది.
అక్కడ శ్మశాన నిశ్శబ్దం.
అతడు ఆలోచించుకోవటానికి సమయమివ్వకుండా మధూహ అంది. "మీకు వేరే విధంగా ఆ అడ్రసు దొరికే అవకాశం లేదు. కేవలం మా పత్రిక వల్లే తెలియాలి. కానీ మీరు మాకు సాయపడని పక్షంలో మేము మీకెందుకు సాయం చేయాలి?"
"బెదిరిస్తున్నారా?"
"కాదు. అర్థం చేసుకొమ్మని ప్రాధేయపడుతున్నాను. మీ ఆటమానెయ్యటానికి కారణం నిజంగా వ్యక్తిగతమై, అది ప్రచురించటం ద్వారా మీకు హాని కలుగుతుంది అనుకుంటే మేము మాత్రం ఎందుకు ప్రచురిస్తాం? మీరే ఆలోచించండి."
"ప్రహసిత్ కొంచెంసేపు మవునంగా వుండి, చివరికి అన్నాడు ".......నేనొక అమ్మాయిని ప్రేమించాను" అన్నాడు.
మధూహ అదిరిపడి, "ఆ కారణం వల్ల ఆట మానుకొన్నారా?" అంది.
"అవును"
"ప్రేమకోసం గోడల్ని దూకిన వారినీ, ఉరికంబం ఎక్కిన వారినీ చూసేంగానీ, ఆటమానుకున్న వారిని చూడలేదే" అంది స్వగతంగా. అతడు పట్టించుకోలేదు.
"ఆ అమ్మాయి పేరు లక్ష్మి" అన్నాడు "......అంత మాత్రమే నాకు తెలుసు. ఒకటి రెండుసార్లు నాతో ఫోన్ లో మాట్లాడింది. ఆమెని ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పాను. ఇష్టమో, అయిష్టమో చెప్పకుండా ఫోన్ పెట్టేసింది."
"మీరంటే ఇష్టపడని అమ్మాయిలు కూడా వుంటారా?" చప్పున అనేసి, అతడు ఏమనుకుంటాడో అన్నట్టు చూసింది. అతడు ఈ లోకంలో లేనట్టే చెప్పుకుపోతున్నాడు. ఆ క్షణం అతను చిన్నపిల్లాడిలా వున్నాడు.
"అప్పుడు ఆ అమ్మాయితో చెప్పాను. నువ్వు మళ్లీ ఫోన్ చేయకపోతే నేను ఆడటం మానేస్తానని".....
"ఆమెని ఎన్నిసార్లు చూసారు?"
"ఒకే ఒకసారి"
మధుహ నవ్వు ఆపుకుంది. "ఒక్కసారి కలిసి, ఆమె మిమ్మల్ని ప్రేమించకపోతే దేశం తరపున ఆడటం మానేస్తానన్నారా?" అంది.
"అవును"
"ఒకరకంగా ఇది ఆమెని బ్లాక్ మెయిల్ చేయటం కాదా?"
"నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను అడటం మానేస్తానంటే అది బ్లాక్ మెయిల్, నేనలా అనలేదు. నేనంటే ఇష్టమో కాదో చెప్పేవరకూ ఆడనన్నాను"
"ఒకవేళ ఆ అమ్మాయి ఇష్టం లేదంటే?"
"అప్పుడు కూడా ఆడను. కానీ అందులో ఇక ఆ అమ్మాయి ప్రసక్తి ఏమీ లేదు. కేవలం నా అశక్తత వల్ల ఆడనంటే."
మధూహ ఆశ్చర్యంగా, "అశక్తత ఏమిటి?" అంది.
"ఒకమ్మాయిని ప్రేమించిన మనిషి ఆమె లేకుండా కూడా మామూలుగా ఎలా వుండగలడు? జీవచ్ఛవంలా బ్రతుకుతాడంతే".
"మీరు ఆ అమ్మాయిని కేవలం ఒకసారి చూసానన్నారు కదూ."
"అవును"
"ఒకసారి చూసి జీవచ్ఛవం అయిపోతారా?"
ప్రహసిత్ చాలాసేపు ఆమెవైపు సూటిగా చూసాడు. ఆమె ఇబ్బంది పడింది. అంతలో అతనడిగాడు. "....మీరెవరినైనా ప్రేమించారా?"
మధూహ సమాధానం చెప్పలేదు. రాజు గురించి చెప్పటం ఇష్టంలేకపోయింది. అయినా ప్రహసిత్ ఆ ప్రశ్న ఎందుకు అడిగాడో తెలియలేదు.
"చెప్పండి. మీరెవరినైనా ప్రేమించారా? కనీసం ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా?"
"......."
"చెప్పరు" అతడు వ్యంగంగా ఇరిటేటింగ్ గా అన్నాడు. "మీరే కాదు. చాలామంది చెప్పరు. అదేదో సామాజిక విలువలకి వ్యతిరేకమైనదిగా, నైతిక నిషిద్ధమైన కార్యక్రమంగా భావిస్తారు. చెప్పటానికి సిగ్గుపడతారు. భయపడతారు. గిల్టీగా ఫీలవుతారు. కానీ నా దృష్టిలో అలా కాదు. ప్రేమంటే గుడికి వెళ్ళిన పవిత్రతతో సమానం. "ప్రొద్దునే గుడికి వెళ్ళాను. మనసెంత ప్రశాంతంగా వుందో...." అని చెప్పినట్టే.... "ప్రేమించానుః ఎంత పిచ్చిగా, ఆనందంగా, విషాదంగా, ఆహ్లాదంగా, దిగులుగా వుందో"...... అని చెప్పుకోగలగాలి. అదేమీ సిగ్గుపడాల్సిన నీచ కార్యక్రమం కాదే. అలా చెప్పుకోలేకపోతున్నారంటే మీకే ఏదో గిల్టీ ఫీలింగ్ వుండటమో, సమాజం పట్ల భయమో వున్నదన్నమాట. అలాంటి స్థితిలో వుండి ప్రేమించినందుకు మిమ్మల్ని చూసి 'ప్రేమ' సిగ్గుపడుతుంది...."
"కానీ ఇంతకాలం మీరు కూడా దీన్ని దాచిపెట్టారు."
"ఆమె అభిప్రాయం తెలియక, ఆమె పేరు బయటకు రావటం ఇష్టంలేక దాచిపెట్టాను. ఆమె గానీ ఒప్పుకున్న పక్షంలో ఈఫిల్ టవర్ ఎక్కి చేసుకుంటాను"
"ఆమెను ఒక్కసారి చూడగానే ప్రపంచాన్ని ఎదిరించి మీదాన్ని చేసుకోవాలన్నంత కోరిక కలిగిందా?"
ఆమె ప్రశ్నలో వ్యంగ్యం అతడికి అర్థమైంది. "కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అనుకుంటున్నారు కదూ....నా గురించి."
ఆమె మాట్లాడలేదు.
"ప్రేమావేశంలో మనిషి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తాడనీ, ప్రతీవాడూ తన ప్రేమంత గొప్పది. మరొకటి లేదని అనుకుంటాడనీ నవ్వుకుంటున్నారు కదూ."
నిజానికి ఆమె అలాగే అనుకుంటోంది. కానీ పైకి చెప్తే మర్యాదగా వుండదని వూరుకుంది. అంతలో అతను లోపల్నుంచి రెండు చేతుల్నిండా రెండు కట్టలు వుత్తరాలు తెచ్చి విసురుగా ఆమె ముందు పోసాడు. అందమైన గ్రీటింగ్ కార్డులు, ఐ లవ్యూలు, పేజీల కట్టల వుత్తరాలు..... వాటిని చింపేస్తూ అతనన్నాడు "ఆమెరికా నుంచీ ఆస్ట్రేలియా వరకూ ఆడాన్నేను. బ్యాచిలర్ని......ప్రేమ నాకు కొత్తకాదు. కొన్ని వేళ మంది నన్ను ప్రేమించామన్నారు. అసలిలా ఈ వుత్తరాల్ని దాచుకోవటం కూడా నా అహమని సిగ్గుపడే స్థితిలో ప్రస్థుతం వున్నాన్నేను. ప్రపంచపు అత్యంత సౌందర్యరాసులైన అమ్మాయిలూ, కోటీశ్వరుల కూతుళ్ళూ నేను ఆడే మ్యాచ్ ల కొచ్చేవారు. ఇదంతా నేను గర్వంగా చెప్పుకోవటంలేదు మధూహగారూ. అందర్ని చూసినా చలించని మనసు ఒక అమ్మాయిని చూస్తే చలించిందని చెప్పటం నా అభిప్రాయం. ఎవరో ఒకమ్మాయి కాస్త నవ్వేయగానే ప్రేమలో పడేటంత కొత్తపిచ్చి కాదని చెప్పాలని నా వుద్దేశ్యం. ఇంతకాలం నేనెవరికోసం ఎదురుచూస్తున్నానో, ఆస్త్రీ దొరికిందన్న భావం. దీన్ని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారో, నవ్వుకుంటారో మీ ఇష్టం. కావాలంటే మరో పదిసంవత్సరాల తరువాత అడగండి.....ఆ అమ్మాయి పట్ల న ప్రేమని ఇదేవిధంగా వెల్లడిస్తాను. ఈ పదిసంవత్సరాల్లో తిరిగి మేము ఒక్కసారి కూడా కలుసుకోలేకపోయినా సరే....."