రెడిమేడ్ మొగుడు
----మల్లిక్
"పండూ...."
ఆడ గొంతు పిలుపు!
పండూ అని ఎవరు ఎవర్ని పిలిచారు? ఒక అమ్మ తన కొడుకుని పిలిచిందా?
కాదు....
ఒక అమ్మమ్మ తన మనవడిని పిలిచిందా?
కాదు -కాదు-కానే కాదు!
మరి?
అది ఒక భార్య భర్తని పిలిచిన పిలుపు.
భార్య భర్తని "పండూ "అని పిలిచిందంటే అతగాడిమీద చాలా ముద్దొచ్చేసి పిలిచిందని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. పండూ అతని ముద్దుపేరు కాదు. రాంపండు అతని అసలు పేరు.
"పండూ...."మళ్ళీ పిలుపు.
"వస్తున్నా "హడావిడిగా షర్ట్ గుండీలు పెట్టుకుంటూ డైనింగ్ హాల్లోకి వచ్చాడు రాంపండు.
డైనింగ్ టేబుల్ మీద గిన్నెలన్నీ రెడీగా పెట్టుకుని కూర్చుంది అతని భార్య రాజీ.
"ఏంటీ అలా గావు కేకలు పెడ్తూన్నావు?"
"ఓసారి వాచ్ వంక చూశారా టైమెంతయిందో? అదే నేను వంట చెయ్యడం అయిదు నిమిషాలు ఆలస్యం చేస్తే చిందులేసేస్తారు. మీరు మాత్రం గంటలతరబడి ఆ క్రాపుని దువ్వీ దువ్వీ ఎంతసేపైనా ఆలస్యం చెయ్యొచ్చు "అంది రాజీ.
"ఎంత సేపూ నా క్రాపు మీద పడేడుస్తావేం? నాకు బట్టతల వస్తే అప్పుడు నీకు తిక్క కుదురుతుంది, బట్టతల మొగుడి ప్రక్కన నడవాలంటే నీకే ఇన్సల్ట్."
"నాకెందుకు ఇన్సల్ట్ ? మీకే ఇన్సల్ట్. ఆ బట్టతలతో మీరెంతో పెద్ద వాళ్ళలా నేను మరీ చిన్నదానిలా కనిపిస్తాను. ఏమండీ మీ కూతురా? అని అడుగుతారు ఎవరైనా."
"కాదు....నా మనవరాలు అని సమాధానం.సరేనా?"
"అలాగే చెప్పండిగానీ....భోజనం వడ్డించనా వద్దా?"
"వడ్డించు "అంటూ కుర్చీ లాక్కుని డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు రాంపండు.
కంచంలో రాజీ వడ్డించటం మొదలు పెట్టింది.రాంపండు తినడం మొదలు పెట్టాడు.
"పండూ!"మెల్లిగా పిలిచింది రాజీ.
"ఊ!"తలెత్తకుండా గబగబా తింటూనే ఊకొట్టాడు.
"పండూ!" ఈసారి కాస్త గారంగా పిలిచింది.
"ఊ....ఏంచి చెబ్బు?" నోట్లో ముద్ద వుంచుకునే అడిగాడు.
"ఈ వేళ మీరు ఆఫిసుకు వేళ్ళలా?"కళ్ళు తిప్పుతూ అడిగింది రాజీ.
"వెళ్ళాలనే అనుకుంటున్నా....ఎందుకంటే ఇంకా ఎవడూ నన్ను ఉద్యోగంలోంచి పీకేయ్యలేదు....ఏదీ చారు?"
రాజీ చారు వడ్డిస్తూ అంది.
"అంతేనంటారా?"
"అంతేకదా మరి! కాస్త పచ్చడి వుంటే వేయ్"చారన్నం కలుపుతూ అన్నాడు రాంపండు.
"ఠాప్!"కంచంలో ఇంతెత్తు నుండి పచ్చడి ముద్దేసి కొట్టింది రాజీ.
రాపండు ఉలిక్కిపడి అంతలోనే తేరుకుని "నా చిన్నప్పుడు దీపావళికి నేల టపాకాయల్ని ఇలానే పైకెత్తి గాఠిగా కొట్టేవాళ్ళం. అయినా నువ్వు పచ్చడిని అంత అమానుషంగా, నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా ఎత్తి కొట్టింది ఎందుకో?"అన్నాడు.
"అయినా ఇప్పుడు నీకు ఆ విషయం ఎందుకు గుర్తొచ్చిందో...."అని అడుగుతూ చూసిన రాంపండుకి ప్రక్కన రాజీ
కనిపించలేదు.అప్పటికే ఆమె విసవిసా నడుచుకుంటూ పోయి హల్లో సోఫాలో కూలపడింది.
"ఏంటో బాబూ ఈ ఆడవాళ్ళు! మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడతారు. మనం ఏదో అంటే ఇంకేదో అనుకుని విసుగునీ, కోపాన్నీ ప్రదర్శించారు" అనుకున్నాడు రాంపండు.
మరో రెండు నిమిషాల్లో భోజనం ముగించి హాల్లోకి వచ్చాడు. అక్కడ సోఫాలో కూర్చుని రాజీ వారపత్రిక చదువుతూ వుంది.
"నువ్వు వారపత్రికని కాలేజీ స్టూడెంట్ సైన్స్ టెస్టు బుక్ చదివినంత సీరియస్ గా చదువుతున్నావ్"నవ్వుతూ అన్నాడు.
రాజీ సమాధానం చెప్పకుండా, కనీసం ఇతని వైపు చూడనైనా చూడకుండా పత్రిక పేజీలు త్రిప్పసాగింది.
సరాంపండు ఆమె ప్రక్కన కూర్చున్నాడు.
"ఏంటి....?నేల టపాకాయల ఊసు ఎత్తగానే నీ మొహం అంత సీరియస్ గా మారిపోయింది?నీ జీవితంలో మరుపురాని విషాద సంఘటన ఏదైనా నేల టపాకాయలవల్ల జరిగిందా....?చిన్నప్పుడు నేల టపాకాయలు కాలుస్తుడంగా నీ చేయ్యమైనా కాలించా?లేకపోతే ఒకానొక భయంకరమైనా కాళరాత్రి నీ ప్రెండ్స్ నీ చూట్టూ నేల టపాకాయలు కొట్టి పేల్చి నిన్ను భయ బ్రాంతురాలిని చేశారా....?" రాజీ భుజం మీద చెయ్యేసి లాలింపుగా అడిగాడు రాంపండు.
"చాల్లెండి వెధవ కుళ్ళు జోకులూ మీరునూ!"రాంపండు చేతిని తోసేసింది.
"మరెందుకు నేల టపాకాయలు ఊసేత్తగానే...."
"అబ్బా...!ఆ నేల టపాకాయల గురించి మాట్లాడ్డం ఆపేస్తారా లేదా?"పత్రికని ప్రక్కన పడేస్తూ విస్సుగా అంది రాజీ.
"సర్లే....టపాకాయల సంగతి వదిలేయ్....మరి సడెన్ గా హఠాత్తుగా, ఆచానక్ ఎందుకిట్లా అయ్యావ్?"అడిగాడు రాంపండు ఆమె గెడ్డం పట్టుకుని.
రాజీ అందంగా నవ్వింది.
రాంపండు గుండె దడదడ అంది. రాజీ అలా నవ్విందంటే అతని భయం.
"మరేమో..నాకేమో ఆఫిస్కి టై మైందన్నమాట....నేనేమో ఇంక వెళ్ళొస్తానన్నమాట!"సోఫాలోంచి ఇంక లేవభోయాడు రాంపండు
"ఆబ్బ....ఉండు పండూ..."చొక్కా పట్టి లాగి కూర్చోబెట్టింది.
"మరేమో పండూ! అసలు విషయం ఏంటంటే" అతని చొక్కా గుండీ పట్టి తిప్పుతూ దీర్ఘాలు తీసింది.
"ఇప్పుడు చొక్కా గుండీలు తెంపేస్తావా ఏంటీ? నాకసలే ఆఫీసుకు టైమైపోతూ వుంది" ఆమె చేతిని పట్టి ఆపుతూ అన్నాడు పండు.