మన భోజనం- వన భోజనం
మన భోజనం- వన భోజనం
కార్తీక మాసంలో ప్రతి ఇల్లూ ఓ గుడిగా, ప్రతి గుడీ ఓ పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. ఇక ఏడాదిలో ఎప్పుడు కుదిరినా కుదరకున్నా బంధువులను, ఆప్తమిత్రులను కలిసి వారితో సమయం గడిపేందుకు వనభోజనాలు గొప్ప సందర్భాలు. కార్తీక పురాణంలో వనభోజనాల ప్రసక్తి ప్రముఖంగా కనిపిస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఉన్న వనంలో, విష్ణుమూర్తిని అర్చించి వనభోజనం చేసినవారి సకల పాపాలూ తొలగిపోతాయన్నది పురాణంలోని మాట. ఈ సంప్రదాయాన్ని తరచి చూస్తే వనభోజనానికి ఎందుకంత ప్రాధాన్యతో అర్థమవుతుంది.
వృక్షారాధన: విగ్రహారాధన ఏర్పడక ముందు, మన పూర్వీకులు ప్రకృతినే పూజించేవారు. వారి దృష్టిలో తమకు ఆహారాన్నీ, నీడనూ, నారబట్టలనూ అందించే వృక్షాలు గొప్ప దేవతలు. సంస్కృతి ముందుకు సాగినా భారతీయులు ఆనాటి మూలాలను మర్చిపోలేదు. మనిషి ఎంతగా ఎదిగినా ప్రకృతికి లోబడక తప్పదని వారికి తెలుసు. అందుకే వృక్షాలను కూడా దేవతార్చనలో భాగం చేశారు. ఫలం, పుష్పం, పత్రం లేకుండా మన పూజలు సంపూర్ణం కావు. వినాయక చవితి, క్షీరాబ్ది ద్వాదశి వంటి సందర్భాలలో అయితే వృక్షాలదే ప్రధాన పాత్ర. అలాంటి వృక్షాలలో ప్రధానమైన ఉసిరికి కార్తీక మాసంలో వీలైనంత ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ మాసంలో ఉసిరి చెట్టును సాక్షాత్తూ విష్ణుమూర్తిగా భావించి పూజించాలన్నది పెద్దల మాట.
మన పెద్దల Excursion!
నలుగురూ కలిసి ఓచోటకి వెళ్లి సరదాగా గడపాలంటే, ఇప్పడంత కష్టం కాకపోవచ్చు. అయితే రవాణా సదుపాయాలు కానీ, జీవణ ప్రమాణాలు కానీ గొప్పగా లేని రోజుల్లో అదో జీవితకాలపు అనుభవం! కార్తీక మాసం రాగానే అందరికీ అనువైన ఓ మంచి రోజు చూసుకుని దగ్గరలోని వనంలో కలుసుకునేవారు. ఎదుటివారి బాగోగులను పరామర్శించి, ఉసిరి చెట్టు కింద విష్ణుమూర్తిని పూజించేవారు. కార్తీక పురాణ పఠనం, శివకేశవుల నామస్మరణతో సత్కాలక్షేపం చేసేవారు. వెంట తెచ్చుకున్న పదార్థాలను పంచుకుని భోజనాలను ముగించేవారు. మగవారు లోకాభిరామాయణం చెప్పుకుంటే, ఆడవారు సంసార బాధలను పంచుకునేవారు. వీటితో సంబంధం లేని పిల్లలు తమదైన ప్రపంచంలో ఆటపాటలతో మునిగిపోయేవారు.
వనంలోనే ఎందుకు!: కార్తీక మాసపు రోజుల్లో ఉష్ణోగ్రతలు బయట గడిపేందుకు అనువుగా ఉంటాయి. వర్షాలు అప్పటికి తగ్గుముఖం పట్టి ఉంటాయి కాబట్టి కీటకాల బెడద కూడా అంతగా ఉండదు. ఇక చెట్లన్నీ కూడా కళకళలాడుతూ పచ్చగా ఉంటాయి. అలాంటి ఆరుబయల్లో అందరూ కలిసి వంటలు వండుకోవడానికైనా, ఔషధభరితమైన ఉసిరి వంటి చెట్ల గాలిని పీల్చుకోవడానికైనా వనభోజనాలు సరైన సందర్భాలు. ఎక్కడపడితే అక్కడ వనభోజనాలు అంత ఆరోగ్యకరం కాదు కాబట్టి ఉసిరి చెట్టు ఉన్న వనం ముఖ్యం అన్నారు పెద్దలు. వినోదం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం, సామాజికం… ఇలా ఏ కోణంలోంచి చూసినా వనభోజనాలకు సాటి మరో సందర్భం కానరాదు!
- నిర్జర.