శ్రీరామ నవమి పూజ ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు..!
శ్రీరామ నవమి పూజ ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు..!
శ్రీరామ నవమి రోజు భారతదేశం యావత్తు పండగ వాతావరణం చోటు చేసుకుంటుంది. సాధారణంగా శ్రీరామ నవమి అంటే శ్రీరాముడి జన్మదినం అని అందరికీ తెలిసిందే. అయితే శ్రీరామ నవమి కేవలం శ్రీరాముడి జన్మదినం మాత్రమే కాదు.. సీతారాముల కళ్యాణం జరిగిన రోజు.. అలాగే ఆ రామయ్య రాజుగా పట్టాభిషేకం అయిన రోజు కూడా. శ్రీరామ నవమి రోజు రామాలయంలో పూజలు, సీతారాముల కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం చాలా వైభవంగా జరుగుతాయి. అయితే ఇంట్లో శ్రీరామ నవమి పూజను చేసుకునే విధానం చాలా మందికి సరిగా తెలియదు. దాని గురించి తెలుసుకుంటే..
శ్రీరాముడి జననం..
శ్రీరామ నవమి అంటే శ్రీరాముడి జన్మదినం. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు.
శ్రీరామ నవమి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత ఒక రాగి చెంబు తీసుకుని ఆ చెంబు నిండా నీరు తీసుకోవాలి. ఈ రాగి చెంబు నీటితో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. శ్రీరామ నవమి రోజు సమర్పించే అర్ఘ్యం ఎంతో మంచి ఫలితాలు ఇస్తుంది. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి సూర్య నమస్కారం చేయాలి. ఇలా చేసిన తరువాత ఇంట్లో పూజ మందిరాన్ని అలంకరించుకోవాలి.
శ్రీరామ నవమి రోజు ఉదయాన్నే పూజ మందిరాన్ని శుభ్రపరిచి, అలంకరించి.. పూజ మందిరంలో కలశం ప్రతిష్టించాలి. అలాగే ఇంట్లో శ్రీరామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకోవాలి. ఈ ఫొటోకు గంధం, కుంకుమ, పువ్వులు అలంకరించాలి. చామంతులు, ఎర్ర గులాబీలను పూజలో ఉంచితే మంచిది.
శ్రీరాముడికి ముత్యాలు అంటే చాలా ఇష్టం. వీలైతే ముత్యాల దండతో రాముల వారి ఫొటోకు అలంకరించాలి. తరువాత 11 తమలపాకులు తీసుకుని గంధంతో శ్రీరామ అని రాయాలి. ఆ రాసిన తమలపాకులను శ్రీరాముడి పాదాల ముందు ఉంచాలి.
శ్రీరామ నవమి రోజు ఆవు నెయ్యితో దీపం వెలిగించడం చాలా శ్రేష్టం. ఆవు నెయ్యి దీపం వెలిగించి వడపప్పు, పానకం, పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేసిన తరువాత శ్రీరామ అనే నామాన్ని 108 సార్లు జపం చేయాలి. ఇది చెప్పలేనంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. జపం తరువాత హారతి ఇవ్వాలి. తరువాత ఇంటిల్లిపాది శ్రీరామ ప్రసాదాన్ని స్వీకరించాలి.
శ్రీరామ నవమి రోజు సీతారాముల కళ్యాణం వీక్షిస్తే కుటుంబ సమస్యలు అన్నీ తొలగిపోతాయని అంటారు. అందుకే ఎక్కడైనా సరే సీతారాముల కళ్యాణాన్ని కుటుంబంతో సహా వీక్షించాలి. ఒక వేళ దగ్గరలో ఎక్కడా సీతారాముల కళ్యాణం జరగకపోతే.. కనీసం టీవీలో అయినా ప్రముఖ క్షేత్రాలలో జరిగే సీతారాముల కళ్యాణం లైవ్ లో వీక్షించవచ్చు.
*రూపశ్రీ.