కార్తీకమాసంలో తులసికి ఎందుకంత ప్రాధాన్యత!

 

కార్తీకమాసంలో తులసికి ఎందుకంత ప్రాధాన్యత!

 

 

కార్తీకమాసంలోని సూర్యోదయ, సూర్యాస్తమ వేళలలో తులసి ముందర దీపాన్ని ఉంచడం ఆనవాయితీ. కార్తీక మాసాన తులసిలో సాక్షాత్తూ ఆ విష్ణుభగవానుడే ఉంటాడని నమ్మకం. తులసి మొక్క లేని ఇల్లు, తులసిని పూజించనివారు అరుదు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న తులసి గురించి ఎంత చెప్పుకున్నా అసంపూర్ణమే కాబట్టి టూకీగా…

 

 

తులసికి సంబంధించిన గాథలు మన పురాణాలలో చాలానే కనిపిస్తాయి. రాధాదేవికి చెలికత్తెగా, శంఖచూడుడనే రాక్షసునికి భార్యగా… ఇలా రకరకాల సందర్భాలలో తులసి పేరు వినిపిస్తుంది. వృంద అనే పేరుతో ఆమె జలంధరుడు అనే రాక్షసునికి భార్యగా కూడా కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ వృంద క్రమంగా బృంద అయ్యింది. ఆమె వనమే బృందావనం అయ్యింది. ఒకానొక సందర్భంలో తన పట్ల కఠినంగా ప్రవర్తించినందుకు తులసి, విష్ణుమూర్తిని కఠినమైన రాయి(సాలిగ్రామం)గా మారమని శపిస్తుంది.

 

కానీ తులసి పవిత్రతను ఎరిగిన విష్ణుమూర్తి మాత్రం ఆమె ఇచ్చిన శాపానికి నొచ్చుకోలేదు సరికదా, తనకు ఆమె ప్రీతిపాత్రులుగానే ఉంటుందనీ, ఆమెను పూజించినవారికి సకలభాగ్యాలూ కలుగుతాయని వరాన్ని అందించాడు. శ్రీకృష్ణతులాభారం వంటి మరెన్నో ఘట్టాలలో కూడా తులసి ఔన్నత్యం కనిపిస్తుంది. అంతటి ప్రాశస్త్యం ఉన్నది కాబట్టి మరే వృక్షంతోనూ తూచలేనిది అన్న అర్థంలో `తులసి` అన్న పేరు సార్ధకమయ్యింది.

 

శ్రీహరికి ఇష్టమైనది కాబట్టి, తులసీదళాలతో మాలలు చేసి ఆయనకు అలంకరిస్తారు. తులసి ఆకులు వేసిన ద్రవ్యాన్ని తీర్థంగా అందిస్తారు. ఇక హైందర ధర్మాచరణలో, పుట్టిన దగ్గరనుంచీ చనిపోయే దాకా తులసితో అనుబంధం సాగుతూనే ఉంటుంది. ఆఖరికి చనిపోయే మనిషి నోట్లో తులసితీర్థాన్ని పోసి అతని మరణయాతనను ఉపశమింపచేస్తారు. తులసి శాస్ర్తీయ నామం `Ocimum sanctum`(ఆసిమం శాంక్టం). ఆసిమం అనేది దీని కుటుంబ నామం, అయితే శాంక్టం అంటేనే పవిత్రమైనది అని అర్థం. తులసితో భారతీయుల అనుబంధానికి పరిశోధనలు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి. తులసి మొక్క భారతదేశంలోనే ఆవిర్భవించిందని తేలింది. ఇక ఆయుర్వేదంలోని చరకసంహిత మొదలుకుని ప్రతి ఒక్క గ్రంథమై తులసిని రోజువారీ వ్యాధులకు ఔషధిగా సూచించాయి.

 

 

 

ఇంతటి పవిత్రమైన తులసి కార్తీకమాసంలోనే ఆవిర్భవించిందని నమ్మకం. కార్తీక శుద్ధ ద్వాదశినాడు తులసిని విష్ణుమూర్తిగా భావించి ఆయనకు పూజలు చేస్తారు. తులసికి చీడపట్టడం చాలా అరుదుగా గమనించవచ్చు. ఎందుకంటే కీటకాలను తరిమివేసే గుణం సైతం తులసిలో విస్తృతంగా ఉంది. తులసి నుంచి వీచే గాలి సైతం ఔషధభరితంగా ఉంటుందని ఆయుర్వేదం సూచిస్తోంది. అలాంటి తులసి ముందు నిలబడి పూజ చేయడం, గుడిలో పూజారిగారందించే తులసి తీర్థాన్ని సేవించడం, పూజించిన తులసి ఆకులను చెవి వెనుకన ఉంచుకోవడం… వల్ల తులసి పట్ల అవగాహననీ, దాని పట్ల విశ్వాసాన్నీ పెంపొందించడంతో పాటుగా పరోక్షంగా కూడా తులసిని ఔషధంగా స్వీకరించినట్లు అవుతుంది.

 

ఇక కార్తీక మాసంలో దగ్గు, జలుబు లాంటి కఫసంబంధమైన వ్యాధులు తప్పనిసరిగా దాడిచేస్తాయి. కఫాన్ని నివారించడంలో తులసిని మించిన ఔషధి మరోటి లేదు. తులసికి దగ్గరగా ఉన్నా, తులసితో కూడిన మందులను సేవించినా వీటిని ఎదర్కోవచ్చు. తులసి చెట్టులోని ప్రతి భాగానికి ఔషధ గుణాలున్నాయంటారు. అందుకే తులసి ఎండిపోయిన తరువాత కూడా ఆ చెట్టు కొమ్మలతో మాలని చేసి ధరిస్తారు హిందువులు. తులసి మన శరీరంలో ఉన్న అపసవ్యతలన్నీ హరింపచేసి ప్రశాంతతను కలిగిస్తుందనే దిశగా ఇప్పడు పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఆ విషయం మన పెద్దలకు ఎప్పటినుంచో అనుభవమే కదా!

- నిర్జర.