మన లక్ష్మీదేవి - ఇండోనేషియాలో దేవిశ్రీ

 

మన లక్ష్మీదేవి - ఇండోనేషియాలో దేవిశ్రీ

 

మన దేశంలో లక్ష్మీదేవికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆరోగ్యం దగ్గర నుంచి ఐశ్వర్యం దాకా అన్నీ ఆ లక్ష్మీదేవి కటాక్షమే అని మనవారు నమ్ముతారు. హిందూమత ప్రభావంతో ఇతర దేశాలలో కూడా లక్ష్మీదేవిని పోలిన దేవతను పూజించడం కనిపిస్తుంది. నేపాల్‌, టిబెట్‌లలో వసుంధర పేరుతో లక్ష్మీదేవిని కొలుచుకుంటే... ఇండోనేషియాలో దేవిశ్రీ పేరుతో ఆమెను ఆరాధిస్తారు. 


ఆ దేవిశ్రీ గురించి మరికొన్ని విశేషాలు...
ఇప్పుడంటే సంపదని బంగారంగాను, డబ్బుగాను గుర్తిస్తున్నారు. కానీ ఒకప్పుడు సంపద అంటే ధాన్యమే! ధాన్యం సమృద్ధిగా పండితేనే, రాజ్యాలు సుభిక్షంగా ఉండేవి. అదనంగా ఉన్న ధాన్యాన్ని ఎగుమతి చేసి సంపదలు పొందేవి. అలా నిండైన ధాన్యపురాశులతో రాజ్యం తులతూగాలంటే, అమ్మవారి అనుగ్రహం ఉండాలని నమ్మేవారు ఇండోనేషియా ప్రజలు. ఆ అమ్మవారి పేరే దేవిశ్రీ.


దేవిశ్రీ ఆవిర్భావం వెనుక రెండు కథలు ప్రముఖంగా వినిపిస్తాయి. మొదటి కథ ప్రకారం - ఒకప్పుడు ఈ భూమ్మిద చెరుకుపంట మాత్రమే ఉండేదట. దాంతో ప్రజల ఆకలి తీరేదే కాదు. ఈ సమస్యకు పరిష్కారం చూపమంటూ జనం ఆ విష్ణుమూర్తిని వేడుకున్నారు. అంతట విష్ణుమూర్తి, భూదేవిని వివాహం చేసుకున్నాడు. విష్ణువు స్థితికారకుడు, భూదేవి సాఫల్యానికి సూచన. ఈ ఇరువురి వివాహంతో ధాన్యం ఉద్భవించిందని నమ్మకం.
రెండో గాథ ప్రకారం లక్ష్మీదేవి ఒక నాగదేవత కన్నీటి నుంచి ఉద్భవించింది.


ఆమెను అంతా అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. యవ్వనంలోకి అడుగుపెట్టిన ఆమెను చూసి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే మోహించాడు. కానీ దేవతలకు విష్ణుమూర్తి ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. అందుకని ఆమెకు విషాన్ని ఇచ్చారు. అయినా కూడా ఆ తల్లి ఈ లోకానికి వరాలనే ఒసగాలని అనుకొంది. ఆమె దేహం నుంచి రకరకాల ఫలపుష్పాలు ఉన్న మొక్కలు ఉద్భవించాయి. వాటితో పాటుగా ధాన్యపు మొక్కలు కూడా ఉద్భవించాయి. అలా ఈ లోకంలోని ఆకలిని తీర్చేందుకు లక్ష్మీదేవి ఇప్పటికీ ధాన్యం రూపంలో ఉందని భావిస్తారు.


ఇండోనేషియా ముస్లింలు అధికంగా ఉండే దేశం. కానీ ఇప్పటికీ అక్కడ ఈ దేవిశ్రీ ఆరాధన విస్తృతంగా కనిపిస్తుంది. పొలాలలో ఆమెకు చిన్నపాటి గుడిలాంటి నిర్మాణాలను ఏర్పాటుచేసుకుంటారు. ఈ గుడిలో అమ్మవారి ప్రతిమను తయారుచేసి, ఆమె చేతులో ధాన్యం కోసే కొడవలిని ఉంచుతారు. పొలం గట్ల మీద కూడా కొబ్బరి ఆకులతో దేవిశ్రీని రూపొందించి ఆరాధిస్తుంటారు. ఆమెను పూజించిన తర్వాత కానీ కోతలను కానీ, నాట్లను కానీ మొదలుపెట్టరు. ఆమె ఆశీస్సులు లభించాలని పాటలు పాడుతూ తమ పొలం పనులను సాగిస్తారు.


ఇండోనేషియా వాసుల దేవిశ్రీ మన లక్ష్మీదేవే అని నమ్మడానికి చాలా కారణాలే కనిపిస్తాయి. లక్ష్మీదేవిలాగే ఈమెకు కూడా శుక్రవారాలు ప్రీతికరం అని అక్కడి ప్రజల నమ్మకం. పైగా ఆమె ఆకుపచ్చ, పసుపు లేదా తెలుపు బట్టలు ఇష్టం అని విశ్వసిస్తారు. చెప్పుకొంటూ పోతే వారి దేవిశ్రీనే మన లక్ష్మీదేవి అనడంలో ఏ సందేహం లేదు. అయినా పేర్లు వేరు కావచ్చు కానీ అమ్మ ఎవరికైనా అమ్మే కదా!

- నిర్జర.