Home » Dasara - Navaratrulu » దేవీ త్రిరాత్ర వ్రతం!!


దేవీ త్రిరాత్ర వ్రతం!!

 

ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ *'దసరా' లేక 'దేవీ నవరాత్రులు'* అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో *చివరి మూడురోజులు దుర్గాష్టమి , మహర్నవమి , విజయదశమి.* విద్యార్ధులు పుస్తకపూజ , శ్రామికులు పనిముట్లపూజ , క్షత్రియులు ఆయుధపూజ చేసి , అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో , పూర్వం రాజులు ఈ శుభముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది.

*దుర్గాష్టమి*

దుర్గాదేవి  లోహుడు  అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని , అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయితి వచ్చింది అని చెప్తారు. ఇక దుర్గ అంటే ? దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. "దుర్గలోని 'దుర్' అంటే దుఃఖం , దుర్భిక్షం , దుర్వ్యసనం , దారిద్ర్యం మొదలైనవి. 'గ' అంటే నశింపచేసేది", అని దైవజ్ఞులు వివరణ చెప్తూ ఉంటారు. ఈమె ఆరాధనవల్ల దుష్టశక్తులు , భూత , ప్రేత , పిశాచ , రక్కసుల బాధలు దరిచేరవు , చేరలేవు. అందువల్లనే మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను , తదుపరి మూడురోజులు లక్ష్మిరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను , చివరి మూడురోజులు సరస్వతిరూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని , ఆక్రమంలో ఈ నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించి తగు ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు. ఈరోజు దుర్గసహస్రనామ పారాయణము , 'దుం' అను బీజాక్షరముతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు

*మహర్నవమి*

మానవకోటిని పునీతులను చేయుటకు భగీరదుడు గంగను భువినుండి దివికి తెచ్చినది ఈనాడే. ఇక ఈ నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈ నవమి తిధిని గూర్చి చెప్పుటలో ఆంతర్యం ఈ తొమ్మిదవ రోజు మంత్ర సిద్ది కలుగును. కావున 'సిద్ధదా' అని నవమికి పేరు. దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలుచేస్తూ ఉంటారు. అలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వసిద్ధుల సర్వాభీష్ట సంసిద్ధి కలుగును. ఇక క్షత్రియులు , కార్మికులు , వాహన యజమానులు , ఇతర కులవృత్తులవారు అందరూ ఆయుధపూజ నిర్వహిస్తారు.

*విజయదశమి*

దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది.  *'శ్రవణా'* నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి *'విజయా'* అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది. ఏపనైనా తిధి , వారము , తారాబలము , గ్రహబలము , ముహూర్తము మున్నగునవి విచారించకుండా , విజయదశమినాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. *'చతుర్వర్గ చింతామణి'* అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే *'విజయం'* అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువాక్యము. 

*'శమీపూజ'* చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే *'జమ్మిచెట్టు'.* అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి , తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది , శమీవృక్ష రుపమున ఉన్న *'అపరాజితా'* దేవి ఆశీస్సులు పొంది , కౌరవులపై విజయము సాధించినారు. 

శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ *'అపరాజితా'* దేవిని పూజించి , రావణుని సహరించి , విజయము పొందినాడు. 

తెలంగాణా ప్రాంతంలో శమీపూజ అనంతరం పాలపిట్ట ను చూచే ఆచారం కూడా ఉన్నది. 

ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని , విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి , శమీవృక్ష శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.

శ్లోకం:-  శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ 
  అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||

కొన్ని ప్రాంతాలలో పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు
అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. అలాగే పెద్దలకు జమ్మిచెట్టు ఆకులు ఇచ్చి పాదాలకు నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకుంటారు. 

◆ వెంకటేష్ పువ్వాడ
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.