వరలక్ష్మి వ్రతం - విజ్ఞానదాయకం
వరలక్ష్మి వ్రతం - విజ్ఞానదాయకం
దక్షిణభారతదేశంలో వరలక్ష్మి వ్రతానికి ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. స్త్రీలకు సకలసౌభాగ్యాలను ఒసగే ఈ పూజను చేసుకునేందుకు కులం కానీ, ఆర్థికస్తోమత కానీ అడ్డురావు. పూజకి సంబంధించి కూడా ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తుంటాయి. వాటిలో కొన్ని...
అమ్మవారి రూపం: వరలక్ష్మీపూజ కోసం కొలుచుకునే అమ్మవారి రూపం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారి చేతుల్లో ఆయుధాలు కాదు కదా, అభయముద్రలు ఉంటాయి. `పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే` అని పూజలో వస్తుంది కదా! రెండు చేతులలోనూ పద్మాలతో, అభయ వరద హస్తాలతోనూ అమ్మవారు భాసిస్తారు. వికసించిన పద్మం మానవుని మేథస్సుకి, జాగృదావస్థకీ చిహ్నం. జీవితంలో ఆరోగ్యం, ఐశ్వర్యం మాత్రమే కాదు వాటికి సార్థకతను ఇచ్చే విచక్షణని కూడా అమ్మవారు ప్రసాదిస్తారని దీని అర్థం కావచ్చు.
పౌర్ణమి ముందు శుక్రవారం: వరలక్ష్మి పూజ మనకి ఒక పండుగే! కానీ ఇతర పండుగల్లాగా దీన్ని చేసుకునేందుకు తిథులను గమనించుకోవలసిన అవసరం లేదు. శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తికి జన్మనక్షత్రం. పౌర్ణమినాట ఆ నక్షత్రం ఉండగా వచ్చే మాసమే శ్రావణం. ఇక శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన వారం. అందుకే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు ఈ పూజను నిర్ణయించారు. చంద్రుడు మనఃకారకుడు. పౌర్ణమినాటి చంద్రుడు ఈ లోకాన్ని ప్రకాశవంతం చేయడమే కాదు, మానవుని ఆలోచనాశక్తిని కూడా ఉచ్ఛస్థితిలో ఉంచుతాడని నమ్మకం. కొందరు సాధకులు పౌర్ణమినాడు మరింత శ్రద్ధగా ధ్యానాన్ని ఆచరిస్తారు. అందుకే జగన్మాత అయిన ఆ అమ్మవారిని శ్రద్ధగా కొలుచుకునేందుకు పౌర్ణమి ముందు శ్రుక్రవారాన్ని నిర్ణయించి ఉంటారు. సాయిబాబా మొదటిసారి షిరిడీలో ఒక వేపచెట్టు కింద తపస్సు చేసుకున్నదానికి గుర్తుగా, ఆయన భక్తులు అక్కడ బాబావారి పాదుకలను ప్రతిష్ఠించాలనుకున్నారట. దానికి బాబాగారు అనుమతిని ఇవ్వడమే కాకుండా,శ్రావణ పౌర్ణమినాడు వాటిని ప్రతిష్ఠించమని ఆదేశించారట.
కలశం: అమ్మవారిని కలశరూపంలో పూజించడం శ్రేష్ఠమంటారు. ఇందుకోసం రాగితో చేసిన కలశం మీద త్రిభుజాకారంలో ఉన్న రవికెల గుడ్డను చుడతారు. శక్తిని ప్రసారం చేయడంలో, నీటిని సైతం ఔషధంగా మార్చడంలో రాగికి ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. ఇక దానికి త్రిభుజాకారంలో వస్త్రాన్ని చుట్టడం ద్వారా, ఆ కలశానికి ఒక రూపం ఏర్పడుతుంది. ఒక ప్రదేశంలో ఉన్న శక్తిని ఇనుమడింపచేయాలంటే దాని మీద ఒక త్రిభుజాకారాన్నిఉంచాలని చాలామందినమ్ముతున్నదే కదా! అలా చూస్తే కలశానికి చుట్టిన వస్త్రం దానికి ఒక రూపాన్ని మాత్రమే కాదు పరిపూర్ణతను కూడా అందిస్తుంది. బహుశా అందుకనే హిందువులు పరిపూర్ణతకు కలశాన్ని చిహ్నంగా భావిస్తారు.
ఇక వరలక్ష్మి పూజలోనూ అణువణువునా సంప్రదాయంతోపాటు, శాస్త్రీయత కనిపిస్తుంది. ఉదా|| అమ్మవారికి ఆవునెయ్యితోకానీ, నువ్వులనూనెతో కానీ దీపం వెలిగించమంటారు. ఆవునెయ్యితో వెలిగించే దీపం నుంచి వచ్చే పొగ నేత్రవ్యాధులకీ, శ్వాసకోశవ్యాధులకీ ఉపశమనం కలిగిస్తుందిని ఆయుర్వేదం చెబుతోంది. ఇక నువ్వులనూనెతో వెలిగించే దీపానికి దీర్ఘకాలిక వ్యాధులని సైతం నయం చేసే ఔషధ గుణాలున్నాయిట. ఇలా శ్రద్ధగా, శాస్త్రోక్తంగా పూజను చేసుకుని... వరలక్ష్మివ్రతాన్నిఆచరించి సకలసౌభాగ్యాలూ పొందిన చారుమతి కథను చెప్పుకుని పూజను ముగిస్తారు.
- నిర్జర.