ఈ రోజు పూరీ జగన్నాధుని రధయాత్ర

 

 

ఈ రోజు పూరీ జగన్నాధుని రధయాత్ర

 

  

ప్రయణమార్గము 

ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ కి 64 కి.మీ. ల దూరంలో వున్న పూరీకి రైలు, రోడ్డు రవాణా సదుపాయాలున్నాయి. భువనేశ్వర్, కోణార్క, పూరీ ఈ మూడింటినీ కలిపి గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఒరిస్సాలోని అతి పురాతనమైన ఈ మూడు క్షేత్రాలూ అద్భుత ప్రదేశాలు. భారత దేశంలో మోక్షాన్ని ప్రసాదించే సప్త తీర్ధ స్ధానాలలో పూరీ ఒకటి. జగన్నాధుడు తన సోదరీ సోదరులైన సుభద్ర, బలరాములతో కొలువు తీరిన పుణ్య క్షేత్రమిది. దేశంలో అన్నా చెల్లెళ్ళకు వున్న ఆలయం ఇది ఒక్కటేనేమో.ఈ రోజు పూరీలో జగన్నాధ రధయాత్ర సందర్భంగా ఒరిస్సాలో బంగాళాఖాతం ఒడ్డునవున్న పూరీ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాము.

ఆలయ విశేషాలు

అలయం చుట్టూ కోటగోడని తలపింపచేసే ఎత్తయిన ప్రహరీ గోడ వున్నది. దీనిని మేఘనాధ గోడ అంటారు. దీని ఎత్తు 22 అడుగులు. మందిరానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలున్నాయి. తూర్పువైపు ద్వారం సింహద్వారం. ప్రవేశ మార్గానికి ముందు రెండు వైపుల రెండు పెద్ద రాతి సింహాలుంటాయి. అందుకే దానిని సింహద్వారం అంటారు. ఆలయ ప్రవేశద్వారం ఇదే. ఆలయ పరిక్రమణలో అనేక ఉపాలయాలు కనిపిస్తాయి.  

యజ్ఞ నృసింహాలయం 

ఆలయాల నిర్మాణానికీ కొన్ని పధ్ధతులుంటాయి. ఇక్కడ ముందుగా యజ్ఞ నృసింహుడి పూజలు చేస్తారు. ఒరిస్సా రాజు చోడగంగ దేవుడు ముఖ్య మందిరానికి ప్రతిష్ఠ చేయటానికి ముందుగా ఈ మందిరాన్ని నిర్మించి యజ్ఞ నరసింహుని ప్రతిష్టించినట్లు మందిరంపైవున్న శిలా లేఖనం ద్వారా తెలుస్తున్నది.

విమలాదేవి మందిరం ఇది శక్తి పీఠం. ఈమె ఆది శక్తి రూపం. దక్ష యజ్ఞ సమయంలో ఆహుతి అయిన సతీదేవి కాలి భాగం ఈ స్ధానంలో పడి మహాశక్తి స్వరూపిణి విమలాదేవి ఆవిర్భవించిందిట. జగన్నాధ మందిర నిర్మాణమయ్యి, విగ్రహ ప్రతిష్టాపన లోపల విమలాదేవి ఆ మందిరంయొక్క అధికారిణిగా వుండేదిట. మందిరం పూర్తయిన తర్వాత జగన్నాధుడి మందిర ప్రవేశానికి విమలాదేవి అనుమతి కావలసి వచ్చినది. ఆవిడ ప్రతి దినము జగన్నాధ, బలభద్రులకి ప్రత్యేక నైవేద్యములు సమర్పించిన తర్వాత వాటిని తనకి సమర్పించాలని షరతు పెట్టింది. ఈ షరతు ప్రకారం ప్రతి రోజూ శ్రీ జగన్నాధునికి నివేదించిన నైవేద్యాన్ని తిరిగి విమలాదేవికి సమర్పిస్తారు. ఆ తర్వాతే అది మహా ప్రసాదమవుతుంది. ఈ మందిరం తంత్ర సాధనయొక్క ముఖ్య పీఠాలలో ఒకటి.

నవగ్రహాలయం మిగతాచోట్ల మనం చూసే నవగ్రహాలయాలకీ దీనికీ కొంచెం బేధం వుంటుంది. వాటిలో సూర్యుని స్ధానం ప్రధమంగా, ఆయన పూజ ముందుగా జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రతిష్టించబడిన నవగ్రహాలలో సూర్యని స్ధానము, పూజ కూడా అన్నింటికన్నా చివర.

సూర్య చంద్ర మందిర్ కొణార్క్ లోని సూర్య దేవాలయం శిధిలమవుతున్న సందర్భంలో అక్కడి ఆది సూర్యుని విగ్రహాన్ని ఇక్కడ స్ధాపించారంటారు. ఇక్కడ వివాహానికి నిశ్చితార్ధాలు జరుగుతాయి. ఇవేకాక పతిత పావనుడు, విశ్వనాధుడు, శ్రీ రాముడు, సత్యన్నారాయణస్వామి, గణేశ్, సర్వ మంగణ మొదలగునవి. క్షేత్ర పాలకుడు భైరవుడు, శ్రీ మహాలక్ష్మీ ఆలయాలు కూడా వున్నాయి.

స్ధల పురాణం

 

పూరీ క్షేత్రానికి అందరికీ తెలిసిన పేరు పూరీ అయినా ఇంకా అనేక పేర్లున్నాయి. జగన్నాధ ధామము, శంఖ క్షేత్రము, పురుషోత్తమ క్షేత్రము, శ్రీ క్షేత్రము, ఉడ్డియాన పీఠము, ఉచ్చిష్ట క్షేత్రము, కుశస్ధలి మొదలయినవి. బ్రహ్మ పురాణం, నారద పురాణం, పద్మ మరియు స్కంద పురాణాలలో ఈ క్షేత్రం గురించి పేర్కొనబడింది. స్కాంద, బ్రహ్మ పురాణాల ప్రకారం మాళవ రాజైన ఇంద్రద్యుమ్నుడు మహా విష్ణువుకి ఆలయం నిర్మించి పూజించాలనుకున్నాడు. ఆలయంలో ప్రతిష్టించటానికి శ్రీ మహావిష్ణువుయొక్క అత్యంత సుందరమైన విగ్రహం కోసం తన మనుషులని అన్న చోట్లకీ పంపాడు. ఇంద్రద్యుమ్నుడి పనుపున వెళ్ళిన విద్యాపతి నీలగిరిపై శబర రాజు విశ్వవసు జగన్నాధుని నీల మాధవుడు అనే పేరుతో కొలుస్తున్నాడని తెలుసుకుంటాడు. శబర రాజు విశ్వవసుకి ఈ నీల మాధవుడు దొరకాటినికి కూడా ఒక కధ వున్నది. శ్రీ కృష్ణ నిర్యాణానంతరం పాండవులు శ్రీ కృష్ణుని శరీరాన్ని పూరీలోని ఆలయం వున్న ప్రదేశంలో ఖననం చేస్తారు. శ్రీ కృష్ణుని అవయవాలన్నీ శిధిలమైనా, ఆయన గుండె మాత్రం శిధిలం కాదు. ఇది ఒక జ్యోతిలాగా సముద్రంపై తేలియాడుతుండగా శబర రాజు విశ్వవసు దానిని సేకరిస్తాడు. అదే నీలమాధవుని అపురూప విగ్రహం. అప్పటినుంచీ ఆయన దానిని పూజిస్తూ వుండేవాడు.విశ్వవసు గూడేనికు చేరిన విద్యాపతి విశ్వవసు కూతురుని ప్రేమించి పెళ్ళిచేసుకుంటాడు. వారి నమ్మకాన్ని సంపాదించి, నీల మాధవుని ఉనికి తెలుసుకుని తమ రాజైన ఇంద్రద్యుమ్నుణ్ణి తీసుకు వస్తాడు. కానీ వారు వచ్చేసరికి ఆ విగ్రహం మాయమవుతుంది.

కలత చెందిన ఇంద్రద్యుమ్నుడికి ఆకాశవాణి సముద్రంలో కొట్టుకువచ్చే దారువుతో విగ్రహం తయారు చేయించమని చెబుతుంది. ఆ ఆదేశం ప్రకారం ఇంద్రద్యుమ్నుడు సముద్రంలో కొట్టుకువచ్చిన అతి పెద్ద దుంగను తెప్పిస్తాడు. కానీ దానికి భగవంతుని రూపం ఇచ్చే శిల్పి కనబడడు. ఒక రోజు దేవ శిల్పి విశ్వకర్మ ముసలివాని రూపంలో వచ్చి తాను ఒక్కడినే విగ్రహం చేయగలనని అయితే విగ్రహం తయారయ్యేదాకా తాను తలుపులు మూసుకుని వుంటాననీ, ఎవరూ మధ్యలో తలుపులు తెరవకూడదని చెబుతాడు. రాజు అంగీకరిస్తాడు. విగ్రహం తయారీ మొదలవుతుంది. శిల్పి పెట్టిన గడువుదాకా ఆగలేని రాజు, రాణి మధ్యలో తలుపులు తెరుస్తారు. అక్కడ శిల్పి వుండడు కానీ సగం చెక్కబడిన విగ్రహాలుంటాయి. చింతిస్తున్న రాజుకి వాటినే ప్రతిష్టించి, పూజించమని అశరీరవాణి ఆదేశిస్తుంది. రాజు అలాగే చేస్తాడు. అప్పటినుంచీ ఆ అసంపూర్ణ విగ్రహాలు పూజలందుకుంటున్నాయి.

నవ కళేబరము

జగన్నాధుని ఆలయంలో ముఖ్య విగ్రహాలు దారు నిర్మితాలు. అందుకని వాటిని మారుస్తూ వుంటారు. దానికి చాలా నియమాలున్నాయి. అధిక ఆషాఢమాసంవచ్చిన సంవత్సరంలో దైవజ్ఞలు శ్రీ జగన్నాధ శరీర పరివర్తనకోసే బాసేలీ దేవి ఆజ్ఞకోసం ప్రార్ధిస్తారు. నూతన విగ్రహాలు నిర్మాణానికి కావలసిన వేప చెట్టు ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవటానికి మంగళమాయీని ప్రార్ధిస్తారు. కలలో దేవి ఆదేశం లభిస్తుంది. అప్పుడు దైవజ్ఞులు మూడు దళాలుగా ఆ చెట్లు వెతకటానికి వెళ్తారు. ఆ చెట్లకి కొన్ని ప్రత్యేకతలు వుంటాయి. బలభద్రుని విగ్రహానికి తెల్లని కఱ్ఱ కావాలి. దానిపై శంఖ చిహ్నం కనిపిస్తుంది. ఆ చెట్టుకు ఐదు శాఖలుంటాయి. జగన్నాధుని విగ్రహం తయారు చేసే కఱ్ఱమీద చక్రం చిహ్నం వుంటుంది. ఆ చెట్టుకు 7 శాఖలుంటాయి. ఆ చెట్లని వెదికి కనుగొన్న తర్వాత వాటికి పూజలు చేసి, ముందు బంగారు గొడ్డలితోనూ, తర్వాత వెండి గొడ్డలితోనూ చెట్ల వేళ్ళుపై కొట్టి తర్వాత ఇనుప గొడ్డలితో వాటిని నరికి ఉరేగింపుగా తీసుకువస్తారు. వీటి దర్శనానికి భక్తులు అత్యధిక సంఖ్యలో వస్తారు.

ఆలయానికి ఉత్తరద్వారంగుండా కలపను కోవెల వైకుంఠముదాకా తీసుకువచ్చి అక్కడ కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. కృష్ణ చతుర్దశి రోజున నవ కళేబరం యొక్క అతి ముఖ్యమైన విధి .. ఘట పరివర్తనం .. జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమం అతి రహస్యంగా జరుగుతుంది. అర్ధరాత్రి తర్వాత ప్రాచీన విగ్రహంనుండి నవీన విగ్రహంలోకి బ్రహ్మ ప్రతిష్ట జరుగుతుంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ వుండరు. తర్వాత పాత విగ్రహాలను కోవెల వైకుంఠంలో సమాధి చేస్తారు. ఆషాఢ కృష్ణ చతుర్దశినుండి, శుక్ల నవమి వరకు నూతన విగ్రహాలకు రంగులు వేస్తా. తర్వాత అమావాస్య రోజునుంచి భగవంతుడు భక్తులకు దర్శనమిస్తాడు. దీనిని యౌవన దర్శనమంటారు. ఆ రోజున నూతన విగ్రహాల దర్శనార్ధం అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ సంవత్సరం అధిక ఆషాఢమాసంలో ఈ ఉత్సవం జరిగింది.  

   రధయాత్ర 

భారత దేశంలోనేకాక విదేశాలలోకూడా చాలా ప్రఖ్యాతి చెందినది పూరీ జగన్నాధుని రధయాత్ర. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుధ్ధ విదియనాడు ప్రారంభమయ్యే ఈ యాత్ర జగన్నాధుని ఆలయానికి 3 కి.మీ. ల దూరంలో వున్న గుండిచా మందిరందాకా సాగుతుంది. భారీ రధాలలో బలరాముడు, సుభద్ర, జగన్నాధుని విగ్రహాలను ఊరేగిస్తూ తీసుకు వెళ్తారు. భక్తులు ఈ రధం తాళ్ళని లాగటానికి పోటీ పడతారు. ఆ సమయంలో పూరీ వీధులలో ఇసక వేస్తే రాలనంత జనం వుంటారు. ఈ రధ యాత్ర కోసమే ఆలయం ముందు వీధి అతి విశాలంగా వుంచారు.

ఈ రధాలలో ముందుగా బలభద్రుని రధం, తర్వాత సుభద్రది, చివరికి జగన్నాధుని రధాలు సాగుతాయి. ఈ రధాలు వరుసగా 45 అడుగులు, 44 అడుగులు, 43 అడుగులు ఎత్తు వుంటాయి. అలాగే రధాలకు 16, 14, 12 చక్రాలుంటాయి. రధయాత్రసాగే ముందు రాజు బంగారు చీపురుతో రధాలను శుభ్రం చేసి, ఆ దేవతలని యాత్రకి బయలుదేరమని ప్రార్ధించటం ఆనవాయితీ. భగవంతుని ముందు రాజు, పేద తేడాలేదని నిరూపిస్తుంది ఈ ఆచారం. ఒరిస్సా రాజ వంశీకులు ఈ సేవను అత్యంత గౌరవప్రదమైనదిగా భావిస్తారు.రధాలు ఈ మూడు కిలోమీటర్ల దూరం దాటి గొండిచా ఆలయం చేరేసరికి సాయంకాలం అవుతుంది. లక్షలాది మంది భక్తులు  లాగుతుంటే, మధ్య మధ్యలో రధ చక్రాలు కదలనని మొరాయిస్తాయి. అపుడు వేలకొద్ది కొబ్బరి కాయలు కొడతారు. భక్తులంతా ఏక కంఠంతో చేసే భగవన్నామంతో భూమి దద్దరిల్లి పోతుందేమో అని అనిపిస్తుంది విగ్రహాలని ఏడు రోజులు గొండిచా ఆలయంలో వుంచి పూజలు, ఉత్సవాలు చేశాక ఏడవ రోజు తిరిగి జగన్నాధ ఆలయం చేరుకుంటారు.

ఈ యాత్రని బహుదా యాత్ర అంటారు. ఈ రధ యాత్రలో భారత దేశంనుంచేకాక విదేశాలనుంచి కూడా అనేక మంది భక్తులు పాల్గొంటారు. జగన్నాధుని ఆలయాలు వున్న ప్రతి చోట ఈ యాత్రలు చేస్తుంటారు.తన దగ్గరకు రాలేని భక్తులకి దర్శనమివ్వటానికి భగవంతుడే స్వయంగా బయటకు వస్తాడు. కులమత భేదాలు లేకుండా అందరూ ఇందులో పాల్గొనడం విశేషం. జగత్తుకే నాధుడైన ఆ జగన్నాధుడు తానే కదలి వచ్చే ఈ అద్భుత యాత్రని చూడటానికి లక్షలాది మంది భక్తులు వస్తారు.  

ప్రసాదాలు:జగన్నాదుడికి 54 రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. ప్రసాదంగా వండే అన్నాదులను కుండలో మాత్రమే వండుతారు. ఏడు కుండలను ఒకదానిమీద ఒకటి పెట్టి అన్నం, పెసర పప్పుతో తయారు చేసి దేవునికి నివేదన చేస్తారు. విచిత్రమేమిటంటే ఏడు కుండలోని అన్నం ఒకే సారి ఒకే విధంగా వుడుకుతుంది, లక్షమందికి ఒకేసారి అన్నదానం ఇక్కడ జరుగుతుంది. లక్షమందికి ఒకే సారి వంట చేయగల వంటశాల ఇక్కడ వుంది. ఇది ఇక్కడి మరో ప్రత్యేకత.  

 

- పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)