అద్భుత ఘట్టం... జగన్నాథ నవకళేబరోత్సవం
అద్భుత ఘట్టం... జగన్నాథ నవకళేబరోత్సవం
పూరి జగన్నాథ రథయాత్ర గురించి, ఈ రథయాత్రకు ఉన్న ప్రాముఖ్యత గురించి, పూరి జగన్నాథ, బలభద్ర, సుభద్రల చెక్క విగ్రహాల గురించి, వాటి మహిమ గురించి చాలామందికి తెలిసిందే. పూరి జగన్నాథ్ రథ యాత్ర అంటే, ఒక్క ఒరిస్సాకి మాత్రమే చెందిన ఉత్సవం కాదు.. దేశంలోని ప్రతి హిందువూ చూసి తీరవలసిన ఒక గొప్ప ఆధ్యాత్మిక సంబరం. ప్రతి ఏటా పూరి జగన్నాథ రథ యాత్రను లక్షల మంది భక్తులు ప్రత్యక్షంగా చూసి తరిస్తారు. ఈ సంవత్సరం జులైలో పూరి జగన్నాథ్ రథ యాత్ర జగబోతోంది. అయితే ఈ ఏడాదికి వున్న ప్రత్యేకత ఏమిటీ అంటే... ఈ సంవత్సరం జరిగే రథయాత్ర జగన్నాథ నవ కళేబరోత్సవం జరిగిన తర్వాత జరిగే రథ యాత్ర. ఈ జగన్నాథ నవ కళేబరోత్సవం నేడు (జూన్ 15, 2015)న జరుగుతోంది. నేటి అర్ధరాత్రి వేళ పూరి జగన్నాథుడి కొత్త చెక్క విగ్రహానికి నవ కళేబరోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇంతకీ నవ కళేబరోత్సవం అంటే ఏమిటి?
నవ కళేబరోత్సవం అంటే...
పూరి జగన్నాథుడితోపాటు బలభద్ర, సుభధ్రల విగ్రహాలు చెక్క విగ్రహాలనే విషయం తెలిసిందే. ఈ విగ్రహాలనకు కొంత కాల వ్యవధి తర్వాత తొలగించి కొత్త విగ్రహాలను తయారు చేసి దేవాలయంలో అమరుస్తారు. ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాలకు కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తారనేది వుండదు.. అధిక ఆషాఢ మాసంలో ఈ వేడుక జరుగుతుంది. అంటే 8, 11, 19 సంవత్సరాలు... ఇలా అధిక ఆషాఢమాసం రావడాన్ని పరిగణనలోకి తీసుకుని నవ కళేబరోత్సవం జరుపుతారు. గత శతాబ్దంలో 1912, 1920, 1931, 1950, 1969, 1977, 1996 సంవత్సరాల్లో నవ కళేబరోత్సవం జరిగింది. ఈ కొత్త శతాబ్దంలో జరుగుతున్న మొట్టమొదటి నవ కళేబరోత్సవం ఇది. జగన్నాథ, బలభద్ర, సుభద్రల కొత్త చెక్క విగ్రహాలను తయారు చేయడంతోపాటు ఆయా విగ్రహాల నాభి భాగంలో ఇంతవరకూ ఎవరూ దర్శించని ‘బ్రహ్మ పదార్ధం’ అనే పదార్థాన్ని ఉంచుతారు. అలా బ్రహ్మ పదార్ధాన్ని విగ్రహంలో ప్రతిష్ఠించడమే నవ కళేబరోత్సవం.
కొత్త విగ్రహాలు ఎందుకు?
జీవులు జీర్ణించిన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని దాల్చక తప్పదనే సత్యాన్ని గుర్తు చేయడానికే పూరిలోని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల జీర్ణించిన విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం అనాదిగా వస్తోందని చెబుతారు. అయితే ఈ కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం అనేది చాలా సుదీర్థమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. ఏ ఏడాది అయితే నవ కళేబరోత్సవం నిర్వహించాల్సి వుందంటే, అంతకు ముందు 65 రోజుల ముందు నుంచే దీనికి సంబంధించిన పనులు మొదలవుతాయి. వంశ పారంపర్యంగా ఈ విధిని నిర్వహిస్తున్న బ్రాహ్మణులు, విశ్వకర్మల బృందం ఎన్నో నియమ నిబంధనలను పాటిస్తూ దేవతా మూర్తుల విగ్రహాలను తయారు చేసే చక్క కోసం అన్వేషణ ప్రారంభిస్తుంది. మూడు విగ్రహాలలో ఒక్కో విగ్రహాన్ని ఒక్కోరకం చెక్కతో తయారు చేయాలి. ఆ చెక్కను సేకరించే చెట్టు కొన్ని లక్షణాలను కలిగి వుండాలి. అలాంటి లక్షణాలున్న వందలాది చెట్లను అన్వేషించి, చివరకు ఒక్కో విగ్రహం తయారీకి ఒక్కోచెట్టును ఎంపిక చేసుకుని, ఆ చెట్టు కనిపించిన ప్రదేశంలోనే విగ్రహాలను చెక్కుతారు.
విగ్రహాలు చెక్కడం పెద్ద ప్రక్రియ
విగ్రహాలను చెక్కే దారు (వేప) వృక్షాలను ఎంపిక చేసిన అనంతరం బ్రాహ్మణులు (దైతాధిపతులు), విశ్వకర్మలు ఆయా చెట్ల దగ్గరే తాటాకు కుటీరాలు వేసుకుని విగ్రహాలు చెక్కడానికి ఉపక్రమిస్తారు. ఇక్కడ మొదట మూడు రోజులపాటు యజ్ఞం చేసి విగ్రహాలు చెక్కడం ప్రారంభిస్తారు. బంగారు, వెండి గొడ్డళ్ళను ఆయా చెట్లకు తాకించిన అనంతరం ఇనుప గొడ్డలితో చెట్లను కూల్చి అందులోంచి అవసరమైన కలపను తీసుకుని మిగతా కలపను పాతిపెట్టేస్తారు. ఆ కలపను చింత, పనస, రావి కలపతో తయారు చేసిన బండిలో పూరి వరకు సంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో తరలిస్తారు. పూరి దేవాలయంలోని కైవల్య మందిరానికి కలపను తరలిస్తారు. ఆ తర్వాత పూరి జగన్నాథ రథ యాత్రకు 45 రోజుల ముందు విగ్రహాలను చెక్కడం ప్రారంభిస్తారు. విగ్రహాల తయారీ, రంగులు అద్దడం పూర్తయిన తర్వాత అసలు ప్రక్రియ వుంటుంది. అదే నాలుగు విగ్రహాల నాభి స్థానంలో ‘బ్రహ్మ పదార్ధం’ వుంచడం. ఇది చాలా రహస్యమైన ప్రక్రియ.
ఏమిటీ బ్రహ్మ పదార్థం?
అసలు బ్రహ్మపదార్థం అంటే ఏమిటో, ఎలా వుంటుందో ఇంతవరకూ ఎవరూ చూసిన దాఖలాలు లేవు. ఆనాదిగా ఈ బ్రహ్మ పదార్థాన్ని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాల నాభిలో ఉంచే ప్రక్రియ చాలా రహస్యంగా జరుగుతూ వస్తోంది. కృష్ణుడి పుట్టిన రోజుగా భావించే కృష్ణ చతుర్దశి నాడు ఈ ‘బ్రహ్మ పదార్ధం’ మార్పిడి పాత విగ్రహాల్లోంచి నుంచి కొత్త విగ్రహంల్లోకి జరుగుతుంది. పూరి జగన్నాథుని శ్రీ మందిరంలో ఈ మార్పిడి జరుగుతుంది. ఇది అత్యంత రహస్యం, నియమ నిష్టలతో కూడుకున్నది. ఈ ప్రక్రియ ప్రారంభించడానికి ముందు దేవాలయం మొత్తం శోధించి దేవాలయంలో ఎవరూ లేకుండా చూస్తారు. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల నూతన విగ్రహాలను ప్రస్తుతం పూజలు అందుకుంటున్న పాత విగ్రహాల ముందు వుంచుతారు. ‘బ్రహ్మ పదార్ధం’ మార్చే అవకాశం దక్కే నలుగురు దైతాధిపతుల కళ్ళకు ఏడు పొరలుగా పట్టు వస్త్రాలను కడతారు. గర్భగుడిలో కటిక చీకటిగా వుండేలా చేసి వీరిని గర్భగుడిలోకి ప్రవేశపెడతారు. ఈ సమయంలో పూరి పట్టణం మొత్తం విద్యుత్ తీసేస్తారు. కళ్ళ గంతలతో గర్భగుడిలోకి వెళ్ళిన దైతాధిపతులు ఆ చీకటిలోనే పాత విగ్రహాల నాభి స్థానాల్లో వున్న బ్రహ్మ పదార్ధాన్ని చూసి తీసి, కొత్త విగ్రహాల నాభి స్థానాల్లో వుంచుతారు. అలా కొత్త విగ్రహాల నాభి ప్రాంతంలో బ్రహ్మ పదార్థం చేరగానే దేవతా మూర్తులకు నవకళేబరం ప్రాప్తించినట్టు భావిస్తారు.
రథ యాత్రకు సన్నాహాలు
నవ కళేబరోత్సవం పూర్తికాగానే పాత విగ్రహాలను శాస్త్రోక్తంగా భూస్థాపితం చేసి కర్మకాండలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పూరి జగన్నాథ ఆలయంలో వివిధ ఉత్సవాలు జరుగుతాయి. రథయాత్రకు రెండు రోజుల ముందు కొత్త విగ్రహాల నేత్రోత్సవం జరుగుతుంది. మర్నాడు నవయవ్వన దర్శనం జరపుతారు. ఈ ఏడాది కొత్త విగ్రహాలతో జగన్నాథ రథయాత్ర జులై 18వ తేదీన మొదలవుతుంది. ఈ రథయాత్ర కోసం మూడు కొత్త రథాలను కూడా తయారు చేస్తారు. పూరి రాజు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చి తాళ్ళను లాగడంతో రథ యాత్ర మొదలవుతుంది. జగన్నాథ దేవాలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో వున్న గుడించా ఆలయానికి రథ యాత్ర సాగుతుంది. మూడు కిలోమీటర్ల దూరం రథాలు ప్రయాణించడానికి 12 గంటల సమయం పడుతుంది. గుడించా ఆలయానికి చేరి అక్కడ వారం రోజులపాటు అతిథ్యం స్వీకరించిన అనంతరం విగ్రహాలు మళ్ళీ తిరుగు ప్రయాణం చేసి జగన్నాథ దేవాలయానికి చేరుకుంటాయి. విగ్రహాలను గర్భగుడిలోని రత్న సింహాసనంపై ప్రతిష్ఠించడంతో ఈ ప్రక్రియ మొత్తం ముగుస్తుంది. రత్న సింహాసనం మీద నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు ఎప్పటిలాగే తమ పెద్దపెద్ద కళ్ళతో ప్రపంచాన్ని చల్లగా చూడటం ప్రారంభిస్తారు.
-అంతర్యామి