కొల్హాపూర్ మహలక్ష్మి

 

కొల్హాపూర్ మహలక్ష్మి

దేవీ పురాణం ప్రకారం శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే సకలైశ్వర్యాలతోబాటు కార్యజయం కూడా కలుగుతుంది. శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కొల్హపూర్ లోని మహలక్ష్మి ఆలయాన్ని దర్శిద్దామా? ఈ అమ్మ దర్శనం మాత్రంచేత సకల సౌభాగ్యాలు లభిస్తాయని ప్రతీతి. శ్రావణమాసంలో, దసరా నవరాత్రులకి ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి.

హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవిని పూజించనివారు చాలా అరుదుగా వుంటారేమో. ఇంతమంది అనునిత్యం పూజించే శ్రీమహలక్ష్మికి మన దేశంలో విడిగా వున్న ఆలయాలు తక్కువే. లక్ష్మీదేవికి ప్రత్యేకించి వున్న ఆలయాలలో కొల్హాపూర్ ఆలయం ముఖ్యమయినది. ఈ ఆలయం మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో పంచగంగ నది ఒడ్డున వున్నది. ఇది అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవది. ఇక్కడ అమ్మవారి నయనాలు పడ్డాయంటారు. స్కాంద పురాణం, దేవీ భాగవతాలలోఈ క్షేత్రాన్ని కరవీర నగరమని, దేవిని కరవీర మహలక్ష్మి అని ప్రస్తుతించారు. పరమశివుడికి కాశీ ఎలా అవిముక్త క్షేత్రమో, శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి ఇది అవిముక్త క్షేత్రం. వారీ క్షేత్రాన్ని ఎప్పుడూ విడవకుండా వుంటారు.

ప్రళయకాలంలో శివుడు తన త్రిశూలంతో కాశీ పట్టణాన్ని ఎత్తి రక్షించినట్లు, మహాలక్ష్మి ఈ క్షేత్రాన్ని తన కరములతో ఎత్తి రక్షించింది. అందుకే ఆవిడ కరవీర మహాలక్ష్మి అయింది అంటారు. భృగు మహర్షి చేసిన అవమానాన్ని తట్టుకోలేని మహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచి సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని కొల్హాపూర్‌లో వెలిశారని ఒక కధ. శంకరాచార్యులవారు ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడ శ్రీ చక్రాన్ని స్ధాపించారు. తర్వాత విద్యాశంకర భారతి ఈ క్షేత్ర వైశిష్ట్యాన్ని గుర్తించి ఇక్కడ ఒక మఠం నిర్మించారు. దత్తాత్రేయుడు ప్రతి రోజూ మధ్యాహ్నం ఇక్కడ భిక్ష చేస్తారని ప్రతీతి. దానికి చిహ్నంగా ఇక్కడ ఆయనకి ఉపాలయం వున్నది.

ఆలయ నిర్మాణం: షుమారు 6 వేల సంవత్సరాల క్రితం ఆలయం ఇది. తర్వాత అనేక రాజుల సమయాలలో అభివృధ్ధి చెందిన ఈ   మందిరం విశాల ప్రాంగణంలో హేమాడ్ పంత్ శైలిలో, శిల్పకళానైపుణ్యంతో నిర్మింపబడింది. నాలుగు దిక్కులా ముఖద్వారాలు వున్నాయి. ఆలయం 5 గోపురాలకింద వుంటుంది. మధ్యలో ఒక గోపురం, నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు. తూర్పు గోపురం కింద మహలక్ష్మి, మధ్య కుమార మండపం, పడమర గణపతి, ఉత్తర దక్షిణ గోపురాల కింద మహాకాళి, మహా సరస్వతి కొలువుతీరి వున్నారు. ఉపాలయాలలో వెంకటేశ్వరస్వామి, నవగ్రహాలు, రాధాకృష్ణ, కాలభైరవ, వినాయకుడు, సింహవాహిని, తుల్జాభవాని వగైరా అనేక దేవీ దేవతలున్నారు.

గర్భగుడిలో అమ్మవారి విగ్రహం సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దానిమీద మహాలక్ష్మి  కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. చతుర్భుజి. నాలుగు చేతులలో పండు, గద, డాలు, పానపాత్ర ధరించి వుంటుంది మూడడుగుల ఎత్తున్న మూర్తి, అనేక ఆభరణాలతో సుసజ్జిత. చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుక సింహవాహనము కనబడుతుంది. మూలవిరాట్ పడమటి ముఖంగా వుంటుంది. సంవత్సరానికి 2, 3 సార్లు 3 రోజులపాటు సూర్యాస్తమయ సమయంలో సూర్యుని కిరణాలు పడమటి దిక్కులోగల చిన్న కిటికీగుండా అమ్మవారి ముఖాన్ని తాకుతాయి. ఈ ప్రత్యేక దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. గర్భగుడి గోడపై శ్రీచక్రం వుండటం ఇక్కడ ప్రత్యేకం...

మొదట ఒక్క మహాలక్ష్మినే ప్రతిష్టించారు. తర్వాత 11వ శతాబ్దంలో గండరాదిత్య హయాంలో మరమ్మత్తులు, ప్రదక్షిణబాట, మహాకాళీ, మహాసరస్వతి ప్రతిష్ట జరిగాయి. మూలవిరాట్ కి మహాకాళికి మధ్య మహలక్ష్మి యంత్రం స్ధాపించబడింది. దీనిపైన గాజుపలక వుండటంతో భక్తులు దర్శించుకోవటానికి వీలుగా వుంటుంది. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని 'అంబాబాయి' అని పిలుస్తారు.

పూజలు, ఉత్సవాలు: అమ్మవారికి రోజూ అయిదు సార్లు అర్చన జరుగుతుంది .ఉదయం అయిదు గంటలకు శ్రీ మహా లక్ష్మీ దేవికి సుప్రభాత సేవ చేస్తారు. కాకడ  హారతి ఇస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మధ్యాహ్నం, సాయంత్రాలలో పూజ, శేజ్ హారతి జరుపుతారు. అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులపుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు. ప్రతి శుక్రవారం సాయంత్రాలలో, పౌర్ణమి నాడు, అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు

విశేషాలు: మహారాష్ట్రలో వడాపావ్, పావ్ మిశాల్ ప్రసిధ్ధిచెందిన వంటకాలు. అక్కడవుండగా వాటి రుచి చూడండి. ఆలయ ప్రాగణంలో వున్న షాపుల్లో మహారాష్ట్రియన్ స్టైల్ లోని ఆర్టిఫిషియల్ నగలు చూడండి. బయట షాపుల్లో వెండివస్తువుల్లో మంచి డిజైన్లు దొరుకుతాయంటారు. కొల్హాపూర్ చెప్పులకి ప్రసిధ్ధి. కొల్హాపూర్ గురించి ఇంకో విశేషం ఏమిటంటే దేశంలో మొట్టమొదటి చలన చిత్రం రాజా హరిశ్చంద్ర ఇక్కడే తయారైంది.

వాతావరణం: ఇక్కడి వాతావరణం సాధారణంగా చల్లగానే వుంటుంది. శీతాకాలం మరింత ఆహ్లాదంగా వుంటుంది. ఈ నగరాన్ని వానాకాలంలో తప్ప,  ఎప్పుడైనా సందర్శించవచ్చు.

దర్శనీయ స్ధలాలు: మహారాజ భవనం సుమారు రెండు వందల గదులతో మూడు అంతస్థులతో విశాలమైన మైదానం మధ్యలో ఉంటుంది. ఆనాటి రాజుల ఆయుధాలు, రాజరికపు సామగ్రి మొదలైనవి ఇందులో పొందుపరిచారు.దత్తాత్రేయుడి రెండవ అవతారం నృసింహ సరస్వతి ఇక్కడికి 60 కి.మీ. ల దూరంలో వున్న కృష్ణ, పంచగంగల సంగమ క్షేత్రమయిన నర్సోబావాడిలో కొన్ని సంవత్సారాలు నివసించి తపస్సు చేసుకున్నారు. అక్కడ వారి పాదుకల మందిరం వున్నది. సమీపంలో వున్న పన్హాలా కొండలపై శివాజీ కోట, జ్యోతిబా మందిరం ప్రసిధ్ధి చెందినవి. దీనికి కొల్హాపూర్ నుంచి ఆటోలో కూడా వెళ్ళిరావచ్చు. దోవలో పంచగంగ నదిని చూడవచ్చు.

రవాణా సౌకర్యం: హైదరాబాదునుంచి 540 కిలోమీటర్ల దూరంలో వున్న కొల్హాపూర్ కి బస్సు, రైలు రవాణా సౌకర్యాలు వున్నాయి.

వసతి సౌకర్యం: కొల్హాపూర్ పెద్ద వూరు. వసతి, భోజన సదుపాయాలకి ఇబ్బంది లేదు.

- పి.యస్.యమ్. లక్ష్మి 

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)