కుష్మాండదేవిని ఇలా పూజిస్తే కీర్తిప్రతిష్టలు సొంతమవుతాయి..
కుష్మాండదేవిని ఇలా పూజిస్తే కీర్తిప్రతిష్టలు సొంతమవుతాయి..
దేవినవరాత్రులలో నాల్గవ రోజు అమ్మవారు కూష్మాండ రూపంలో దర్శనమిస్తుంది. ఈ అమ్మను పూజించే వారి జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి, అన్ని కోరికలు నెరవేరుతాయి. అమ్మవారి నివాసం సూర్య వ్యవస్థ లోపల ఉందని చెబుతారు. మండిపోయే సూర్య లోకంలో నివసించే సామర్థ్యం, శక్తి కేవలం ఈ అమ్మవారికి మాత్రమే ఉన్నాయని అంటారు.
విశ్వాన్ని సృష్టించినది ఈ అమ్మేనట..
విశ్వం అసలు రూపం, అసలు శక్తి అంతా కుష్మాండదేవినే అంటారు. ఆమెనుండే ఈ విశ్వం పుట్టిందని చెబుతారు. కేవలం ఈ అమ్మ నవ్వు ద్వారానే విశ్వాన్ని పుట్టిస్తుందని, అందుకే ఈమెకు కూష్మాండా దేవి అని పేరు పెట్టారని పురాణాలు చెబుతున్నాయి. విశ్వం లేనప్పుడు, చుట్టూ చీకటి ఉండేది. అప్పుడు ఈ అమ్మవారు తన అహ్లాదకరమైన నవ్వుతో విశ్వాన్ని సృష్టించినట్టు కథనం. ఈ అమ్మవారికి ముందు విశ్వం అనేది లేదట.
అమ్మవారి రూపం ఎలా ఉంటుందంటే..
కుష్మాండదేవి రూపం, ఆమె తేజస్సు సూర్యునితో సమానంగా ఉంటుంది. ఈ అమ్మవారి శక్తి, ప్రభావంతో ఏ ఇతర దేవుడు లేదా దేవతతో పోల్చలేనిది. ఈ అమ్మవారి తేజస్సుతోనే దిక్కులు ప్రకాశిస్తున్నాయట. విశ్వంలోని అన్ని వస్తువులు, జీవులలో ఉన్న కాంతి మొత్తం అమ్మవారి నీడలోనే ఉంటుంది. ఈ అమ్మకు ఎనిమిది భుజాలు ఉంటాయి. అందుకే అష్టభుజాదేవి అని కూడా అంటారు. అమ్మవారి ఏడు చేతులలో వరుసగా కమండలం, విల్లు, బాణం, తామరపువ్వు, మకరందంతో నిండిన కుండ, చక్రము, గదా ఉంటాయి. ఎనిమిదవ చేతిలో అన్ని విజయాలను, సంపదలను ఇచ్చే జపమాల ఉంటుంది.ఈ అమ్మవారు సింహవాహనం మీద దర్శనమిస్తారు.
కూష్మాండ దేవిని ఎలా పూజించాలంటే..
కూష్మాండ దేవి ఆరాధనలో తెల్ల గుమ్మడికాయ సమర్పించడం చాలామంచిది. తమలపాకులు, పండ్లతో తాంబూలం, అక్షింతలతో నమస్కారం చేసుకోవాలి. అమ్మవారికి ఎరుపురంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎరుపు రంగులో ఉన్న మందారం, గులాబీ వంటి పూలను అమ్మకు అలంకరించాలి. దుర్గా చాలీసా, అమ్మవారికి సంబంధించి బీజమంత్రం జపించాలి. నెయ్యి దీపం లేదా కర్పూరంతో అమ్మవారికి హారతి ఇవ్వాలి. పెళ్లికాని అమ్మాయిలు కూష్మాండ దేవిని పూజిస్తే వారికి నచ్చిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలకు అపరిమిత సౌభాగ్యం లభిస్తుంది.
ఫలితాలు ఇవే..
కూష్మాండ దేవి తన భక్తులను వ్యాధులు, దుఃఖం, వినాశనం నుండి విముక్తి చేస్తుంది. కీర్తిని, బలాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కీర్తిని కోరుకునే వ్యక్తులు కూష్మాండ మాతను పూజించాలి. అమ్మవారి అనుగ్రహం వల్ల కీర్తిప్రతిష్ఠలు సాధించడం సాధ్యం.
*నిశ్శబ్ద.