ముక్తిని ప్రసాదించే స్కందమాతను ఇలా పూజించాలి..

 


ముక్తిని ప్రసాదించే స్కందమాతను ఇలా పూజించాలి..
 

దేవి నవరాత్రులలో అమ్మవారి ఐదవ రూపం స్కందమాత. స్కంద అంటే కార్తికేయుడు. స్కందుడి  తల్లి కాబట్టి ఈ అమ్మను స్కందమాత అని అంటారట. ఈ అమ్మ గురించి పురాణ గ్రంథాలలో చాలా గొప్పగా వర్ణించారు.  ఈ అమ్మను పూజించే వారి మనస్సు ప్రాపంచిక విషయాల మీద నుండి ఆధ్యాత్మికత వైపుకు సాగుతుంది. ఈ అమ్మ సింహం పై స్వారీ చేస్తుంది. నాలుగు చేతులను కలిగిన ఈ అమ్మ ఒడిలో బాల కార్తికేయుడిని కుడిచేతిలో పట్టుకుని ఉంటుంది.  ఇంకొక కుడిచేతిలో తామరపువ్వు ఉంటుంది.  అమ్మవారి ఎగువ ఎడమచేయిలో తామరపువ్వు ఉంటుంది. కింద ఉన్న ఎడమచేయి అభయం ఇస్తున్నట్టుగా ఉంటుంది. సింహానం మీద ఉన్నా ఒక కాలు మడిచి కూర్చుని ఉంటుంది. అందుకే ఈ అమ్మను పద్మాసనా దేవి అని కూడా పిలుస్తారు. ఇదీ ఈ అమ్మ రూపం వర్ణణ.

అమ్మను ఆరాధిస్తే..

 అమ్మవారిని భక్తిపూర్వకంగా ఆరాధిస్తే ఆమె కోరికలను తప్పకుండా నెరవేరుస్తుంది. బాధలను తొలగిస్తుంది. సంతానం కోసం పరితపించేవారు ఈ అమ్మను పూజించడం ఉత్తమం. ఈ అమ్మవారి పూజలో పెళ్లి సామాగ్రి, ఎర్రటి పువ్వులు, అక్షింతలు, కొబ్బరికాయ, ఎర్రటి వస్త్రంలో కట్టి అమ్మవారి ఒడిని నింపాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో సంతోషం వెల్లివిరిస్తుంది. స్కందమాత ముఖ్యంగా ముక్తిమార్గాన్ని చూపుతుంది. ఈ అమ్మను ఆరాధించడం వల్ల జ్ఞానం లభిస్తుంది. ఈ అమ్మ ముఖంలో ప్రేమ, ఆప్యాయత, కరుణ  తన భక్తులను ఎల్లవేళలా కాపాడుతుంది.

పూజ ఎలాగంటే..

 నవరాత్రి శుక్ల పక్షం ఐదవ రోజున ఉదయం స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి, ఆ తర్వాత అమ్మవారిని పూజ ప్రారంభించాలి. గంగాజలంతో అమ్మవారి విగ్రహాన్ని శుద్ధి చేయాలి. అమ్మవారి అలంకారానికి మంగళకరమైన రంగులను ఉపయోగించడం మంచిది.   స్కందమాతను, కార్తికేయుడిని వినయంతో పూజించాలి. పూజలో కుంకుమ, అక్షతలు, పూలు, పండ్లు మొదలైన వాటిని అమ్మకు అర్పించాలి. అమ్మ ముందు గంధం పూసి నెయ్యి దీపం వెలిగించాలి.  తరువాత, పువ్వులు అర్పించి నైవేద్యాన్ని పెట్టాలి. చివరిగా అమ్మవారికి  హారతి ఇవ్వాలి.  ఈ అమ్మకు అరటిపండు అంటే ఇష్టం. అరటిపండు నైవేద్యంగా పెట్టి  దీన్ని బ్రాహ్మణుడికి ఇవ్వాలి. ఇలా చేస్తే తెలివితేటలు పెరుగుతాయి.  ఆ తరువాత 5మంది అమ్మాయిలకు అరటిపండు ప్రసాదం పంచిపెట్టాలి. ఇలా చేస్తే అమ్మవారు సంతోషిస్తుంది. పిల్లల కష్టాలు తొలగిస్తుంది.

                                                 నిశ్శబ్ద.