రెండు తలల నంది కొలువైన ఏకైక క్షేత్రం!
రెండు తలల నంది కొలువైన ఏకైక క్షేత్రం!
హిందూ మతంలో ప్రతి దేవుడికి ఒక వాహనం ఉంటుంది. అలా పరమేశ్వరుడికి ఉన్న వాహనమే నంది. ప్రతి శివాలయంలో శివలింగానికి ఎదురుగా నంది కొలువై ఉంటుంది. భక్తులు తమ కోర్కెలను నంది చెవిలో చెబితే.. నందీశ్వరుడు వెళ్లి పరమేశ్వరుడికి విన్నవిస్తాడట. అలా నంది నుండి విన్న కోర్కెలనే పరమేశ్వరుడు తీరుస్తాడని కూడా అంటారు. సాధారణంగా ఏ ఆలయంలో అయినా శివలింగానికి ఎదురుగా ఉండే నంది పరిమాణంలో, ఎత్తులో తేడాలు ఉంటాయి. కానీ రెండు తలల నంది ఉంటుందని చాలా మందికి తెలియదు. అసలు ఈ రెండు తలల నంది ఎక్కడ కొలువై ఉంది? ఈ నందికి రెండు తలలు ఉండటం వెనుక కారణం ఏమిటి? వివరంగా తెలుసుకుంటే..
అమరనాథ్ యాత్ర.. ద్విముఖి నందీశ్వర ఆలయం..
పురాణ కథనాలు, హిందూ నమ్మకాల ప్రకారం.. పరమేశ్వరుడు, పార్వతీ దేవికి అమర రహస్యం గురించి వివరించిన ప్రదేశాన్నే అమరనాథ్ గుహగా పరిగణిస్తున్నారని, పరమేశ్వరుడు ఈ గుహలో మంచు లింగం రూపంలో కొలువై ఉంటాడని చెబుతారు. అయితే పరమేశ్వరుడు అమర రహస్యాన్ని పార్వతీ దేవికి చెప్పే ముందు.. ఆయన వాహనమైన నందిని పహల్గామ్ లో వదిలిపెట్టారట. ఈ ఆలయం దర్శనం చేసుకోకుండా అమరనాథ్ యాత్ర కూడా అసంపూర్ణం అని చెబుతారు.
ద్విముఖ నందీశ్వర ఆలయం..
ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాల పురాతనమైనదని, ఇక్కడ ప్రతిష్ఠించిన రెండు తలల నంది విగ్రహం కొన్ని వందల సంవత్సరాల క్రితం భూమి నుండి ఉద్భవించిందని చెబుతారు, ఆ తర్వాత ఇక్కడ ప్రతిష్ఠించబడిందని చెబుతారు. ఈ ఆలయం ముందు గౌరీ కుండ్ అనే చెరువు ఉందట. ఈ చెరువులోని నీటిని తాగితే అనేక వ్యాధులు నయమవుతాయని చెబుతారు.
ఈ ప్రదేశం చాలా పవిత్రమైనదట, అలాగే చాలా అందంగా కూడా ఉంటుందట. . ఇక్కడికి చేరుకున్న భక్తులు తమ దుఃఖాలన్నింటినీ మరచిపోయి శాంతిని, ఆనందాన్ని పొందుతారట. శివుడు అమర రహస్యాన్ని పార్వతీ దేవికి చెప్పేముందు తన నందిని విడిచిపెట్టిన ఆలయం ఇదేనని భక్తులు చెబుతారు. అందువల్ల, ప్రపంచంలో రెండు తలల నంది దర్శనమిచ్చే ఏకైక ఆలయం ఇదే.
దేశవ్యాప్తంగా అమర్నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులు, అమరేశ్వర స్వామిని సందర్శించిన తర్వాత తప్పకుండా నందిని కూడా సందర్శిస్తారట. ఈ ఆలయాన్ని జమ్మూ కాశ్మీర్ ఆర్కైవ్స్, ఆర్కియాలజీ మరియు మ్యూజియమ్స్ విభాగం నిర్వహిస్తోందట. ఇది 1977 నాటి పురాతన స్మారక చిహ్నాలు , పరిరక్షణ చట్టం, మరియు 2010 సవరణ చట్టం ప్రకారం రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత సంరక్షిత స్మారక చిహ్నంగా పరిగణించబడుతోంది.
*రూపశ్రీ.