గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా!

 

 గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా!

రోజంతా ఏమి చేస్తున్నా, దైవాన్ని ఆశ్రయించి చేయాలి. అన్ని పనులూ ఆయనవే అనే భావంతో చేస్తే ఫలితం లభిస్తుంది. చేసే పనినే సేవగా పరిగణిస్తే ఆ దేవుడి అనుగ్రహానికి  అనుకూలమవుతుంది.

ఇందుకు ఉదాహరణగా  కింది కథ నిలుస్తుంది..

దక్షిణ భారతదేశంలో ఒక పంచముడు, శివుడికి డమరుకాలు తయారు చేసేవాడు. ఎంతోకాలంగా తన ఇష్టదైవమైన శివుణ్ణి స్మరిస్తూ తన పనిని తను చేసుకుంటూ ఉండేవాడు.  అయినప్పటికీ అతడికి శివదర్శనం కాలేదు. అందుకు అతడు చాలా ఆవేదన చెందేవాడు. ఒకరోజు శివాలయానికి వెళ్ళాడు. అతడు పంచముడు కావడం వల్ల పూజారి ఆలయం లోనికి అనుమతించలేదు. అందువల్ల అతడు ఆలయ ప్రధాన ద్వారం వద్ద నిలబడి శివుణ్ణి ప్రార్థించాడు. అలా ద్వారం ఎదుట నిలబడివున్న పంచముణ్ణి చూసి పూజారి అతణ్ణి దుడ్డుకఱ్ఱతో కొట్టాడు. అప్పుడు అతడు స్పృహ తప్పి పడిపోయాడు.

అతడు అలా స్పృహ కోల్పోగానే దేవాలయ ప్రధాన ద్వారం మూసుకొనిపోయింది. ఎంత మంది ప్రయత్నించినా ఆ ద్వారాన్ని తెరవలేకపోయారు. అప్పుడు "మీరు నా భక్తుణ్ణి కొట్టి స్పృహ తప్పేలా చేశారు. అందుకే ద్వారం మూతబడింది. అతడిని ఇక్కడకు తీసుకొని రండి” అని శివుని గంభీర వాణి వినిపించింది.

పూజారులు ఆ భక్తుణ్ణి ఆలయం దగ్గరకు తీసుకు వచ్చారు. వెంటనే ద్వారాలు వాటంతట అవే తెరుచుకున్నాయి. డమరుకాలు తయారుచేసే ఆ భక్తుడు నటరాజస్వామిని దర్శించాడు. తరువాత ప్రాణాలు విడిచి ఆయనలో ఐక్యమయ్యాడు.

కాబట్టి, భగవద్దర్శనానికి కావలసింది మనది ఏ కులమో, ఏ పని చేస్తున్నామో అన్నది ముఖ్యం కాదు. ఉన్నత కులానికి చెందినవాడైనా, నిమ్నజాతికి చెందిన వాడైనా భగవంతునిపై మనస్సు లగ్నం చేసి తన కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడే భగవద్దర్శనానికి అర్హుడు.

మనం చేస్తున్న పని ఏ భావంతో చేస్తున్నామన్నది ముఖ్యం. పూజ కోసం పూలు తెంపుతాం, భగవంతుని కోసం దండలు కడతాం, జపం చేస్తాం. ఇవన్నీ యాంత్రికంగా చేయడం వల్ల మనకు నిజమైన ఆనందం లభించదు. భగవంతుడు కూడా మెచ్చడు. ఎవరి పనిని వారు చేస్తూ భగవంతుణ్ణి "తండ్రీ! ఎలాంటి జన్మ ప్రసాదించినా సరే, నీ పాదారవిందాల పట్ల  భక్తివిశ్వాసాలు కలిగి ఉండేలా చేయి" అని నిత్యం ప్రార్థించాలి. అలా ప్రార్ధన చేస్తూ మన స్వధర్మాన్ని నిర్వర్తిస్తేనే ఆ భగవంతుని అనుగ్రహం కూడా లభిస్తుంది.


                                         *నిశ్శబ్ద.