గాజులు సౌభాగ్యానికి చిహ్నం

 

 

 

గాజులు సౌభాగ్యానికి చిహ్నం

 

 

చిన్నతనం నుండి ఆడపిల్లలు ధరించే అలంకారం గాజులు. చేతికి గలగల లాడే  గాజులు లేకపోతే మొండి చెయ్యి అంటారు. మొండి చేతులు ఏ పనికి ముఖ్యంగా శుభ కార్యాలకి పనికి రావని మన వారి విశ్వాసం. ఇవి ధనవంతులైతే బంగారంతో చేయించుకుంటారు. ఇంకా కావాలనుకుంటే నవ రత్నాలు తాపడం చేయించుకోవచ్చు. కానీ మౌలికంగా గాజు అన్న మాటలోనే ఇవి లోహాలతో కాక గాజుతో చేసేవి అని అర్థం అవుతుంది. వీటినే మన వారు మట్టి గాజులు అంటారు.  ఇవి ఎటువంటి వారైనా కొనుక్కోగల ఖరీదులో ఉంటాయి.  ఏ సంప్రదాయాన్నైనా అందరికి అందుబాటులో ఉండేట్టు చేయటం మన సంస్కృతిలో ఉన్న విశిష్టత.


          ఆడవాళ్ళు గాజులు వేసుకోవటం అనే సంప్రదాయం వెనుక ఆరోగ్య సూత్రం ఉంది.  అర చేతులకి ప్రక్క భాగం, అంటే చిటికెన వేలు వైపు అంచులో మణికట్టుకి కొద్దిగా ఎగువ నుండి మణికట్టుకి బెత్తెడు దిగువ భాగంవరకు, అదే విధంగా బొటన వేలు వైపు మణికట్టు నుండి బెత్తెడు దిగువ భాగం వరకు స్త్రీల జననేంద్రియాలకు సంబంధించిన నాడీ కేంద్రాలుంటాయి. వాటిని సున్నితంగా నొక్కటం వల్ల అవి ప్రచోదితమై గర్భకోశం సవ్యంగా పని చేస్తుంది. ఋతు సంబంధమైన సమస్యలున్న వారు రోజూ కొద్ది సేపు క్రమం తప్పకుండా అ భాగాలపై సున్నితంగా వత్తిడి కలిగిస్తే  కొద్ది  రోజులకి ఋతుక్రమం క్రమబద్ధీకరింప బడుతుంది. ఈమాట చెపితే ముందు నమ్మకం కుదరదు. తరువాత తీరిక, ఓపిక, ఉండవు. అసలు తన ఆరోగ్యం పైన శ్రద్ధ ఉండదు ఆడవారికి. ఒక వేళ తీరిక, ఓపిక, శ్రద్ధ ఉన్నా కూడా కొత్తగా కాపురానికి వెళ్ళిన అమ్మాయిలకి వీలు కలగక పోవచ్చు.

 

 

కోడలు చేతులు నొక్కుకుంటూ కూర్చుంటే అందరు అత్తలు ఊరుకోలేరు కదా!  కనుక చేతికి బిగుతుగా గాజులు వేసుకుంటే, పని చేసి నప్పుడల్లా అవి అటు ఇటు కదలటం వల్ల అప్రయత్నంగా చిరు వత్తిడి కలిగి, నాడులు ప్రచోదనమై జననేంద్రియ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కాలి  చీలమండల వద్ద కూడా వీటికి సంబంధించిన నాడీ కేంద్రాలు న్నాయి. అక్కడ వత్తిడి కలిగించటానికి కాళ్ళకి బరువైన కడియాలు ధరిస్తూ ఉండేవారు కొద్ది కాలం  క్రితం వరకు స్త్రీలు. కడియాలు ధరించటం వల్ల కాళ్ళలో రక్త ప్రసరణ సరిగా జరిగి, అక్కడి రక్త నాళాల గోడలు బిరుసెక్కకుండా ఉంటాయి.
             ఇదే కారణం వల్ల గర్భవతి ఐన స్త్రీకి చేసే వేడుకలలో ప్రధానమైనది గాజులు వేయటం. ఈ అంశానికున్న ప్రాధాన్యం అందరికి తెలియటం కోసం సీమంతపు వేడుకలలో,  పెళ్లికూతురిని చేసేటప్పుడు అమ్మాయికి అందరిచేత గాజులు వేయిస్తారు. పైగా అవి గుత్తంగా ఉండాలని చెపుతారు. అమ్మాయి చేత అందరికి ఇప్పిస్తారు.  వాటి ప్రాధాన్యం అమ్మాయికి తెలియటం కోసం.

 


               గాజులు ముంజేతుల వద్ద ఉండే సున్నిత మైన, కీలకమైన రక్త నాళాలను కప్పి ఉంచి కాపాడుతాయి. భర్త పంచ ప్రాణాలలో ఒక దానిని ఇక్కడే నిక్షిప్తం చేయటం జరుగుతుంది వివాహ సమయంలో. దానిని కూడా ఈ గాజులు రక్షిస్తాయి.
                గాజులు వేసుకోవటం ఒక్క భారతీయులకి, హిందువులకి మాత్రమే పరిమితం కాదు . మహమ్మదీయ వనితలు తప్పని సరిగా చేతి నిండుగా గాజులు వేసుకుంటారు. గాజులు వేసుకోవటానికి మతం అడ్డు కాదు. ఇతర మతాల వారు కూడా గాజులు ధరిస్తూనే ఉంటారు.
              మిలమిలా మెరిసే రంగులతో కాంతులీనుతూ చేతుల అందాన్ని పెంపొందిస్తూ ఉండే గాజులు స్త్రీత్వానికి గుర్తులు. ఆడవారి ఆరోగ్యాన్ని కన్న తల్లి లాగా కాపాడే కంకణాలు స్త్రీలకు వర ప్రసాదాలు .
 

 

....Dr Anantha Lakshmi