పెళ్లైన మహిళలే మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలి

 

 

పెళ్లైన మహిళలే మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలి ?

 

 

స్త్రీకి వివాహంతో వచ్చే అలంకారాలలో ఒకటి మెట్టెలు లేక మట్టెలు . ఒక స్త్రీకి పెళ్లి అయిందా ? లేదా? అని అడగకుండా తెలుసుకోవటానికి పాదాల వంక చూస్తారు మెట్టెలు ఉన్నాయా? లేవా? అని. మంగళ సూత్రం లాగానే మట్టెలకి పెళ్ళికి అవినాభావ సంబంధం. పెళ్లి అయిన వారు తప్పని సరిగా మెట్టెలు ధరించాలంటారు. ఎందుకట ? చేతులలో లాగానే పాదాలలో కూడా శరీరావయవాలన్నింటికి సంబంధించిన నాడీ కేంద్రాలున్నాయి. ప్రతి కాలివేలు మొదలు ఒక్కొక్క కేంద్రం. అరికాలుకి వేలు అతుక్కుని ఉండే భాగం కొంచెం లోతుగా ఉంటుంది. కాలు నేల మీద పెట్టినపుడు అ భాగం నేలకి తగలదు. ఆ భాగంలోనే నాడీ కేంద్రాలుంటాయి.

 

వాటిని సుకుమారంగా వత్తి నట్టైతే నాడులు చురుకుగా పని చేస్తాయి. పాదాలని ఆ విధంగా వత్తుకుంటూ కూర్చోవటం ఎంత మందికి వీలవుతుంది? అయినా చేతులతో కాళ్ళు పట్టుకుని కూర్చోవటం దరిద్రం అంటారు మన వాళ్ళు. కాబట్టి అక్కడ వత్తిడి కలిగే ఏర్పాటు చేస్తే సరిపోతుంది. బరువైన గుండ్రని మెట్టెలు కాలి బొటన వేలి ప్రక్క వేలికి పెట్టుకుంటే అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా వేలి క్రింది భాగం నొక్కబడి వత్తిడికి లోనౌతుంది . కాలి బొటన వేలికి ప్రక్క వేలు క్రింది భాగంలో ఉన్న నాడీ కేంద్రం గర్భాశయానికి సంబంధించింది. ఈ వేలికి పెట్టుకున్న మెట్టెలు కలిగించే వత్తిడి వల్ల గర్భాశయం స్వస్థ స్థితిలో ఉంటుంది. ముఖ్యంగా గర్భవతులైన స్త్రీలు బరువైన మట్టెలు పెట్టుకుంటే గర్భ స్రావం జరగటం వంటివి నివారించ బడుతాయి.

 

అది తన వంశాభివృద్ధికి సంబంధించిన విషయం కనుక పెళ్లి కుమారుడే స్వయంగా పెళ్లి కూతురి కాలు పట్టుకుని వేలికి మెట్టెలు తొడుగుతాడు. ఇది మట్టెలకున్న ప్రాధాన్యం తెలియజేస్తుంది. ఇప్పుడు సరదాకి అన్ని వేళ్ళకి రకరకాలైన డిజైనులలో మట్టేలను పెట్టుకుంటున్నారు. వాటిని పిల్లేళ్ళు మొదలైన పేర్లతో పిలుస్తారు. ఇవి అలంకార ప్రాయాలు మాత్రమే! కాలి రెండవ వేలికి పెట్టుకున్నవి స్త్రీ సంబంధమైన ఆరోగ్య సమస్యలని సరిజేస్తాయి. మెట్టెలని కూడా భారత దేశంలో అందరు స్త్రీలు కుల మతాల కతీతంగా ధరిస్తారు. వాటి ఉపయోగం ఉండాలంటే సన్నగా నాజూకుగా ఉండేవి కాక బరువైన వాటిని ధరించాలి.

...Dr Anantha Lakshmi