శివుడు కైలాసం వదిలి శ్రీశైలానికి ఎందుకు చేరాడు?
శివుడు కైలాసం వదిలి శ్రీశైలానికి ఎందుకు చేరాడు?
పరామ శివుడు వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శ్రీశైల క్షేత్రం ప్రముఖమైనది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.
పూర్వకాలంలో పార్వతీ పరమేశ్వరులు తమ కుమారులకు వివాహం చేద్దాము అనుకున్నారు. అయితే వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ కూడా, ఎవరికి వారు తమకే ముందుగా వివాహం జరగాలి అని పట్టుబట్టారు. ఎన్ని విధాలుగా చెప్పినా లాభం లేకపోయింది. ఎవరూ పట్టు వదలలేదు. దాంతో కుమారులిద్దరినీ పిలిచి, "మీలో ముందుగా ఎవరైతే భూ ప్రదక్షిణ చేసి వస్తారో, వారికి ముందుగా వివాహం జరుగుతుంది" అన్నారు.
ఆ మాటలు వినగానే కుమారస్వామి నెమలి వాహనం మీద బయలుదేరి వేగంగా వెళ్ళిపోయాడు. కాని వినాయకుడు భారీ శరీరముతో కదలలేక తన తెలివితేటలతో ఆలోచించి జననీజనకులకు మూడుసార్లు ప్రదక్షిణ చేసి నమస్కరించి, "తండ్రీ! జననీ జనకులకు ముమ్మారు ప్రదక్షిణ చేస్తే, భూ ప్రదక్షిణ చేసిన ఫలితము వస్తుంది అని శాస్త్రం చెబుతున్నది. నేను ఆ పని చేశాను అన్నాడు. అతని బుద్ధికుశలతకు సంతోషించి పార్వతీ పరమేశ్వరులు వినాయకుడికి సిద్ధి, బుద్ధిలతో వివాహం జరిపించారు.
శ్రీ కుమారస్వామి తిరిగి వచ్చేటప్పటికీ వినాయకుడి వివాహం జరిగిపోయింది. తనకు అన్యాయం జరిగిందని అలక పూనాడు కుమారస్వామి..
దాంతో కైలాసం వదలి శ్రీశైలం చేరాడు. తల్లితండ్రులు నారదుడితో కుమారుణ్ణి రమ్మని వర్తమానం పంపారు. కుమారస్వామి వినలేదు. కుమారుణ్ణి వదలలేక పార్వతీదేవే అక్కడికి వచ్చింది. ఆమె వెనుక పరమేశ్వరుడు కూడా వచ్చాడు. కుమారుడు మాత్రం.. అక్కడి నుంచి రానన్నాడు. చేసేది ఏమీ లేక, కుమారుణ్ణి తీసుకుపోయే మార్గం తెలియక, పార్వతీ పరమేశ్వరులు శ్రీశైలం మీదనే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఈ విధంగా పరమేశ్వరుడు శ్రీశైలానికి విచ్చేశాడు.
పూర్వకాలంలో 'చంద్రగుప్తుడు' అనే రాజు ఉండేవాడు. అతడు చాలా ధర్మపరుడు, నీతిపరుడు. ఈశ్వరుని అనుగ్రహం వల్ల అతడికి ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు 'చంద్రావతి'. బాలిక పుట్టగానే రాజు యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధం చాలా సంవత్సరాలు జరిగింది. ఎలాగైతేనేం చివరకు శత్రు రాజులు పలాయనం చిత్తగించారు. చంద్రగుప్తుని విజయలక్ష్మి వరించింది.
ఇంటికి తిరిగి వచ్చాడు రాజు. ఇల్లు చేరి చేరగానే ఆ యింట్లో తిరుగుతున్న పదహారు సంవత్సరాల పిల్ల కనిపించింది. ఆమె చూడటానికి చాలా అందంగా ఉంది. రాజు మనసు నిలువలేదు.. వెళ్లి ఆమెను పట్టుకున్నాడు. విదిలించుకుని పారిపోయింది ఆ బాలిక. వెంటపడ్డాడు రాజు. ఇంతలో భార్య వచ్చి చూసింది. ఘోరం జరిగిపోతున్నది. తన కన్న కుమార్తె వెంట పడుతున్నాడు తండ్రి. భర్తను వారించటానికి ప్రయత్నించింది. లాభం లేకపోయింది. బాలిక మందిరం చివర భాగానికి వెళ్ళి, ప్రక్కనే ప్రవహిస్తున్న కృష్ణానదిలో దూకాలని ప్రయత్నించింది. నది రెండు పాయలుగా చీలిపోయింది. వెనుక నుంచి రాజు. తరుముకు వస్తున్నాడు. చేసేది లేక రాజును 'ఆ నదిలో పచ్చల బండవై పడి ఉండు' అని శపించింది. మరుక్షణంలో రాజు పచ్చని బండరాయిగా మారి కృష్ణానదిలో పడ్డాడు. అందుచేతనే శ్రీశైలంలోని కృష్ణవీరు పచ్చగా ఉంటుంది.
రాకుమారి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆ పర్వత శిఖరం మీద వెలసిన శివలింగాన్ని నిత్యమూ అర్చించటం మొదలు పెట్టింది. ఇతర ఆలోచనలు ఏమీ లేవు. ఎప్పుడూ ఈశ్వరుని నామస్మరణమే. ప్రతి నిత్యము ఆ దేవుని సుగంధ పరిమళాలు వెదజల్లే మల్లెపూలతో భగవంతుని ఆరాధించేది. ఈ రకంగా మల్లెపూలతో ఆరాధించబడ్డాడు కాబట్టి స్వామి "మల్లిఖార్జునుడు" అని పిలవబడ్డాడు. శ్రీశైలము దివ్యక్షేత్రము, కైలాసములో ఉండేకన్న, శ్రీశైలములో ఉండటము శ్రేయస్కరమని సాక్షాత్తు శివుడే చెప్పాడు.
శ్రీశైలానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది. మల్లికార్జునుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకడు అయితే అతని భార్య భ్రమరాంబ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఇలాంటివి దేశం మొత్తం మీద మూడే ఉన్నాయి. అవి :
శ్రీశైలము : భ్రమరాంబ, మల్లిఖార్జునుడు.
కాశి : విశాలాక్ష్మి, విశ్వనాథుడు
ఉజ్జయిని : మహాకాళి, మహాకాళేశ్వరుడు
వీటన్నింటిలోకి శ్రీశైలము ముఖ్యమైనది.
◆నిశ్శబ్ద.