కృష్ణా తీరాన పుణ్య క్షేత్రాలు - 12
కృష్ణా పుష్కరాల సందర్భంగా....కృష్ణా తీరాన పుణ్య క్షేత్రాలు - 12
విజయవాడ
కృష్ణవేణమ్మ, కనక దుర్గమ్మ పంతాలు వేసుకుని పక్క పక్కనే నివసిస్తున్న వాడ విజయవాడ. కలియుగాంతానికి కృష్ణమ్మ పొంగి దుర్గమ్మ ముక్కెర తాకుతుందిట. యుగాంతాల సంగతి మనకెందుకుగానీ హాయిగా పుష్కరాల గురించీ, పుణ్య క్షేత్రాల గురించీ మాట్లాడుకుందాము.
పుష్కరాల సందర్భంగా విజయవాడలోని కృష్ణా నదిలో స్నానం చేసి భక్తులు దుర్గమ్మని దర్శించి తరిస్తున్నారు. విజయవాడలో కృష్ణానది పక్కనే ఇంద్రకీలాద్రి పై కొలువు తీరిన చల్లని తల్లి కనకదుర్గ గురించి మన వారికే కాదు, పొరుగు రాష్ట్రాల వారికీ చాలా మందికి తెలుసు. ఈ చల్లని తల్లి కరుణ పొందటానికి ఏడాది పొడుగునా లక్షల్లో భక్తులు వస్తుంటారు. దేవతా మూర్తులు కొలువు తీరటానికి కారణాలే అనేకం వుంటే ఇక కధల సంగతి చెప్పాలా? మరి మనం ఆ కధలు తెలుసుకోవాలికదా..
పాండవుల అరణ్యవాసం సంగతి మీకు తెలుసు కదా. వారు దారుకావనంలో వున్నప్పుడు వేద వ్యాసుడు వారిని కలిసి, వారిలో ఒకరిని శివుడిని మెప్పించి పాశుపతాస్త్రం సంపాదించమని సలహా ఇస్తాడు. ధర్మరాజు ఆదేశం మీద అర్జనుడు శివుడికోసం ఘోర తపస్సు చేస్తాడు. అది ఇక్కడ ఇంద్రకీలాద్రి పై చేస్తాడు. అప్పుడు శివుడు అర్జనుణ్ణి పరీక్షించటానికి బోయవాడి వేషంలో రావటం, ఇద్దరూ ఒకే పందిని కొట్టటం, వాదులాడుకోవటం, శివుడు అర్జనుడి శౌర్యాన్ని పరీక్షించిన తర్వాత పాశుపతాన్నిచ్చి ఆశీర్వదించటం, అదేనండీ .. కిరాతార్జునీయం ఇక్కడే జరిగిందంటారు. దానికి గుర్తుగా అర్జనుడు ఇంద్రకీలాద్రిపై విజయేశ్వరస్వామిని ప్రతిష్టించాడంటారు.
కనక దుర్గ దేవాలయం
ఈ అమ్మవారి గురించీ, ఈ దేవాలయం గురించీ కూడా అనేక కధలు ప్రచారంలో వున్నాయి. పూర్వం కీలుడనే రాక్షసుడు కృష్ణా తీరంలో దుర్గాదేవి గురించి ఘోర తపస్సు చేశాడు. సంతోషించి ప్రత్యక్షమైన అమ్మవారిని కీలుడు నువ్వెప్పుడూ నా హృదయ స్ధానంలో వుండేటట్లు వరమియ్యమన్నాడు. భక్తుల కోరిక తీర్చే అమ్మ నువ్వు ఈ కృష్ణా తీరాన పర్వత రూపంలో వుండు, నేను కృత యుగంలో అసుర సంహారం తర్వాత నీ కోరిక తీరుస్తాను అని వరమిచ్చి అతర్ధాన మయింది. కీలుడు అప్పటినుంచీ అక్కడ పర్వత రూపంలో అమ్మ తనపై కొలువు తీరే రోజు గురించి ఎదురు చూశాడు. తర్వాత కాలంలో మహిషాసురుడిని సంహరించిన తర్వాత కీలుడికిచ్చిన వరం ప్రకారం మహిషాసుర మర్దని రూపంలో కీలాద్రిపై వెలసింది. తర్వాత ఈ దేవిని పూజించటానికి ఇంద్రాది దేవతలంతా ఇక్కడికి రావటంవల్ల కీలాద్రి ఇంద్ర కీలాద్రి అయింది. అమ్మవారు బంగారు వర్ణంతో ప్రకాశించటంతో కకనక దుర్గ అనే పేరు పొందింది.
ఇక్కడ అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు వుంటుంది. మంచి పుష్పాలతో, మిరిమిట్లుగొలిపే ఆభరణాలతో చాలా అందంగా అలంకరించబడి వుంటుంది. ఎనిమిది చేతులతో, ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధంతో శోభిల్లుతూ వుంటుంది. అమ్మ వున్న చోట అయ్య వుండాలికదా. దుర్గాదేవి వున్న చోట పరమేశ్వరుడు కూడా వుండాలని బ్రహ్మ దేవుడు శివుడికోసం ఇక్కడ శతాశ్వమేధయాగం చేశాడుట. సంతుష్టుడైన శివుడు ఇక్కడ వెలిశాడు. బ్రహ్మదేవుడు స్వామిని మల్లెపూలతో పూజించటం వలన స్వామికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చింది.
జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి, అమ్మవారి ఆలయంలో శ్రీ చక్రం ప్రతిష్టించి రౌద్ర రూపంలో వున్న అమ్మని శాంతింప చేశారు. అలాగే మల్లికార్జున స్వామి అదృశ్యంగా వుండటం గమనించి పునః ప్రతిష్ట చేశారుట. ఈ ఆలయంలో ఇంకా అనేక ఉపాలయాలు, దేవతా విగ్రహాలు కనువిందు చేస్తూంటాయి.విజయవాడలో ప్రముఖమైన కనకదుర్గాలయమేకాక ఇంకా అనేక పురాత ఆలయాలు, దుర్గ గుడికి సమీపంలోనే వున్నాయి.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)