Read more!

కాలచక్ర వివరణ ఇచ్చిన శ్రీకృష్ణుడు!!

 

కాలచక్ర వివరణ ఇచ్చిన శ్రీకృష్ణుడు!!

బ్రహ్మ అంటే సృష్టికర్త అని ఆయనకు కావు పుట్టుకలు ఉండవని వాళ్ళు అశాశ్వతమైన వాళ్ళని అనుకుంటూ వుంటారు చాలామంది. అయితే ఈ సృష్టి అనేది కాలం మీద నడుస్తూ ఉన్నప్పుడు కాలానికి లోబడి ఉన్న ప్రతీదానికి ఒక ముగింపు అనేది ఉంటుందని అది ఎవరికైనా వర్తిస్తుందని చెబుతాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. 


సహస్రయుగపర్యన్తమహర్యద్భహ్మణో విదుః॥ రాత్రింయుగసహస్రాన్తాం తం హెరాత్రవిదో జనాః॥


వేయి యుగములు గడిస్తే బ్రహ్మ కు ఒక పగలు, అలాగే వేయి యుగములు గడిస్తే బ్రహ్మకు ఒక రాత్రి. ఈ విధంగా కాలపరిమాణమును ఎవరు తెలుసుకుంటారో, వారు ఈ రాత్రి గురించి బాగా తెలుసుకోగలరు.


బ్రహ్మలోకం కూడా శాశ్వతం కాదు అని చెప్పిన కృష్ణుడు బ్రహ్మకు కూడా మన మాదిరే రాత్రి పగలు ఉన్నాయి అని తెలియజేసాడు. అంటే బ్రహ్మలోకంలో కూడా కాలము ప్రవర్తిస్తూ ఉంటుంది. కాలమునకు లోబడినది ఏదీ శాశ్వతము కాదు అని అంతరార్థము. దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకుంటే....


ఈ బ్రహ్మలోకంలో అంటే సత్య లోకంలో బ్రహ్మగారు ఉంటారు. బ్రహ్మగారికి వేయి యుగములు గడిస్తే ఒక పగలు అవుతుంది. మరలా వేయి యుగములు గడిస్తే ఒక రాత్రి అవుతుంది. ఈ విధంగా రెండు వేల యుగములు కలిస్తే బ్రహ్మగారికి ఒక రోజు, బ్రహ్మ కాలమానము ఇది అని తెలుసుకోవాలి. ఇక్కడ ఒక వివరణ. మనకు నాలుగు యుగములు ఉన్నాయి. అవి కృత యుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలి యుగము. ఇవి వరుసగా 17,28,000 సంవత్సరములు, 12,96,000 సంవత్సరములు, 8,64,000 సంవత్సరములు, 4,32,000 సంవత్సరములు. (యుగమునకు యుగమునకు మధ్య సంధి కాలముతో కలిపి). మొత్తము 42,20,000 సంవత్సరములు. దీనిని ఒక మహాయుగము అంటారు. ఇటువంటి మహాయుగములు వేయి అయితే బ్రహ్మకు ఒకపగలు అని, వేయి అయితే రాత్రి అనీ, అటువంటి రోజులు 360 అయితే బ్రహ్మ గారికి ఒక సంవత్సరము అనీ, ఇటువంటి సంవత్సరములు నూరు అయితే బ్రహ్మగారి ఆయుర్దాయము అనీ భాగవతములో ఉంది. కాని ఇక్కడ వేయియుగములు మాత్రమే అని ఉంది.


ఏది ఏమయినా బ్రహ్మ దేవుడు, బ్రహ్మలోకము కూడా శాశ్వతము కాదు, బ్రహ్మగారి ఆయుర్దాయము కూడా సంవత్సరముల లెక్కకు లోబడి ఉంది అని తెలుసుకుంటే చాలు. కాబట్టి బ్రహ్మకు కూడా ఆది అంతము ఉన్నాయి అని తెలుస్తూ ఉంది. బ్రహ్మలోకము కూడా కాలమునకు లోబడి ఉంటుంది. బ్రహ్మలోకమే కాలమునకు లోబడి ఉన్నప్పుడు మిగిలిన లోకముల గురించి చెప్పాల్సిన పని లేదు. అన్నీ కాలమునకు లోబడి ఉంటాయి. కాలమునకు లోబడి ఉన్న ప్రతిదీ పుట్టుక చావు కలిగి ఉంటాయి. పుట్టుక చావు ఉన్నవి శాశ్వతములు కావు. కాబట్టి బ్రహ్మలోకము కూడా శాశ్వతము కాదు.


ఇలా మనిషికే కాదు ఆ బ్రహ్మదేవుడికి కూడా కాలచక్రం ఉందని, ఆ కాలచక్రాన్ని ఇలా అందరికీ వివరించాడు శ్రీకృష్ణుడు.


                                   ◆వెంకటేష్ పువ్వాడ.