చాతుర్మాస్యంలో మహావిష్ణువు యోగనిద్రలో ఉంటే సృష్టిని ఎవరు నిర్వహిస్తారు..పురాణాలు ఏమి చెబుతున్నాయి!

 

చాతుర్మాస్యంలో మహావిష్ణువు యోగనిద్రలో ఉంటే సృష్టిని ఎవరు నిర్వహిస్తారు.!

చాతుర్మాస్యం గురించి మాట్లాడినప్పుడు తరచుగా వినిపించే మాట.. మహావిష్ణువు నాలుగు నెలలు యోగనిద్రలో ఉంటారని. అయితే మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటే.. ఆ సమయంలో ఈ సృష్టిని నడిపించేది ఎవరు? ఈ ప్రశ్న చాలామంది భక్తులలో ఉంటుంది.  పురాణాల మీద అవగాహన లేకుండా ఉంటే వారు ఈ ప్రశ్నకు సమాదానం కోసం చాలా వెతుకుతూ ఉంటారు. అయితే దీని గురించి పురాణాలు ఏం చెప్పాయో.. వివరంగా తెలుసుకుంటే..

పరమేశ్వరుడు ..

మహావిష్ణుడు యోగ నిద్రలో ఉండే కాలాన్ని చాతుర్మాస్యంగా పిలుస్తారు. ఈ నాలుగు నెలల కాలంలో సృష్టిని మహావిష్ణువుకు బదులుగా పరమేశ్వరుడు నిర్వహిస్తాడని,  నాలుగు నెలలు సృష్టి కార్యం బాధ్యతలు పరమేశ్వరుడు స్వీకరిస్తాడని చెబుతారు.

దేవశయనీ ఏకాదశి – యోగనిద్ర ప్రారంభం

ఆషాఢ శుక్ల ఏకాదశిని దేవశయనీ ఏకాదశి లేదా హరిశయనీ ఏకాదశి అంటారు.దీన్నే తొలి ఏకాదశి అని కూడా అంటారు.

ఈ రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగనిద్రలోకి ప్రవేశిస్తారని పద్మ పురాణం,  భవిష్య పురాణం, స్కాంద పురాణం.. మొదలైన గ్రంథాలు వివరిస్తాయి. తర్వాత కార్తీక శుక్ల ఏకాదశి రోజున ఆయన మేల్కొంటారు. దీనినే ప్రబోధినీ  ఏకాదశి లేదా దేవోత్థాన ఏకాదశి అంటారు. ఈ మధ్యకాలమే చాతుర్మాస్యంగా పిలవబడుతుంది.

శివుడు సృష్టిని నిర్వహిస్తాడా?

శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రియమైనది. చాతుర్మాస్యంలో మొదటి నెల శ్రావణం.

ఈ నెలలో.. శ్రావణ సోమవారాలు,  రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు,  మహామృత్యుంజయ జపాలు విశేషంగా నిర్వహిస్తారు. దీంతో ఈ కాలంలో శివుని ప్రభావం ఎక్కువగా ఉంటుందని భక్తులలో విశ్వాసం ఏర్పడింది.

 హరి-హర అభేద తత్వం..

పురాణాలు చెబుతున్న ముఖ్యమైన సిద్ధాంతం..

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే।

శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః॥**

 శివుడు, విష్ణువు ఇద్దరూ వేర్వేరు కాదని, ఒకే పరబ్రహ్మ స్వరూపమని పై వాక్యాల అర్థం.

అందువల్ల విష్ణువు యోగనిద్రలో ఉన్నా దైవపాలన ఆగిపోదు.

 శివ పురాణంలోని భావం..

శివ పురాణం ప్రకారం పరమశివుడే పరబ్రహ్మ. అదే విధంగా విష్ణు పురాణం ప్రకారం మహావిష్ణువే పరబ్రహ్మ. ఇది విరుద్ధత కాదు. భక్తి సంప్రదాయంలో ఆయా దేవతలను పరమస్వరూపంగా స్తుతించడం సహజం. అయితే శివ కేశవుల అభేదం గురించి చెబుతూ.. విష్మువు యోగనిద్రలో ఉంటే శివుడు సృష్టి బాధ్యత తీసుకుంటాడని చెబుతారు.

                                 *రూపశ్రీ.