హోమం కోసం ఎలాంటి చెక్కను ఎంచుకోవాలి.. నియమాలేంటంటే!
హోమం కోసం ఎలాంటి చెక్కను ఎంచుకోవాలి.. నియమాలేంటంటే!
హిందూమతంలో హోమానికి చాలా పవిత్రత ఉంది. ఇది చాలా శక్తివంతమైన ప్రక్రియ. సాధారణంగా హోమం చేయాలని అనుకునేవారు హవన సామగ్రి , మంత్రాలపై దృష్టి సారిస్తుండగా, శాస్త్రాలు మాత్రం హోమానికి ఉపయోగించే "సమిధ" అని పిలువబడే కలపకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను ఇస్తాయి. హోమం లోకి ఎలాంటి చెక్కను ఉపయోగించాలి? ఏ చెక్కను ఉపయోగిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అనే విషయాలు చాలామందికి తెలియవు. హోమంలో అగ్ని హోత్రానికి మామిడి చెక్క వాడటం సరైనదేనా? హోమం కోసం ఎలాంటి చెక్కను ఎంచుకోవాలి? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
మామిడి చెక్క..
హోమంలో అగ్నిహోత్రానికి మామిడి చెక్క ఉత్తమమైన పదార్థం అని తరచుగా నమ్ముతారు. అయితే హిందూమత గ్రంథాలు మామిడి చెక్కను ఉత్తమమైన పదార్థంగా ప్రత్యేకంగా సిఫార్సు చేయవట. వివిధ ప్రయోజనాలు, దేవతలు , గ్రహాల కోసం వివిధ రకాల సమిధలు లేదా అగ్నిహోత్రాలు ఉపయోగించాలని హిందూమత గ్రంథాలు చెబుతాయి. కేవలం మామిడి చెక్కను కాల్చడం వల్ల పర్యావరణానికి తప్పనిసరిగా ప్రయోజనం చేకూరదని, దానికి బదులుగా హవన సామగ్రి , ఔషధ పదార్థాలతో కలిపినప్పుడు దాని ప్రభావం మెరుగుపడుతుందని చెబుతున్నారు.
పరాశర మహర్షి రచించిన బృహత్ పరాశర హోర శాస్త్రం గ్రహ శాంతి అధ్యాయంలో.. 84 వ అధ్యాయం , 21వ శ్లోకంలో దీని గురించి స్పష్టంగా వ్రాయబడిందట.
శ్లోకం..
సారః పలాశః ఖదీర్స్త్వాపమార్గస్తు పిప్పలః ।
ఉదుమ్బరః శమీ దూర్వా కుశాశ్చ సమిధ్ క్రమాత్ |
భావం..
నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి హవనం చేస్తున్నప్పుడు ప్రతి గ్రహానికి వేర్వేరు సమిధలను (కట్టెలను) ఉపయోగిస్తారు. సూర్యుడు, చంద్రునికి మోదుగ చెట్టు కట్టెలు, కుజుడికి ఖదీర చెట్టు, బుధుడికి చిత్రమూలం, గురుడికి రావిచెట్టు, శుక్రుడికి ఔదుంబుర వృక్షం లేదా మేడి వృక్షం, శనికి శమీ వృక్షం లేదా జమ్మి వృక్షం, రాహువుకు గరిక, కేతువుకు కుశ గడ్డి మొదలైన వాటితో హవనం చేయాల్సి ఉంటుంది.
పరిహారం కోసం కూడా..
పైన చెప్పుకున్న వివిధ రకాల మొక్కలు వృక్షాల చెక్కను హవనంలో ఉపయోగించడం వల్ల వివిధ రకాల ఫలితాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా రోగ నివారణకు కూడా ఇవి ఎంతో సహాయపడతాయి. వీటిలో మర్రివృక్షం చెక్కలను ఉపయోగించినప్పుడు వ్యాధులు నయం కావడం, మోదుగ చెట్టు చెక్కలను ఉపయోగిస్తే పనిలో విజయం లేదా పురోగతి లభిస్తుంది.
రావి చెట్టు చెక్కలతో హవనం చేసినప్పుడు సంతాన సమస్యలు తొలగుతాయని, కుటుంబ అభివృద్ది జరుగుతుందని చెబుతారు. మేడి వృక్షం చెక్కను హోమంలో అర్పిస్తే సంపద, శ్రేయస్సు లభిస్తాయని చెబుతారు. ఇక పాపాలు నాశనం కావాలంటే హోమంలో శమీ చెట్టు చెక్కను సమర్పించాలి. దీర్ఘాయువు కోసం గరికను హోమంలో సమర్పిస్తారు. అన్ని కోరికలు నెరవేరాలంటే కుశ గడ్డిని హోమంలో ఉపయోగించడం ఎంతో ఉత్తమమని చెబుతారు.
ఋతువుల ప్రకారం..
హిందూ ఆచార సంప్రదాయాలు రుతువుల ప్రకారం కలపను ఎంచుకోవాలని కూడా పేర్కొంటాయి. వసంతకాలంలో జమ్మి వృక్షం కలప , వేసవిలో రావి కలప, వర్షాకాలంలో మోదుగ లేదా మారేడు కలప, శరదృతువులో మామిడి లేదా జువ్వి చెట్టు కలప, శీతాకాలంలో ఖదీర చెట్టు కలప, శీతాకాలంలో మేడి వృక్షం లేదా మర్రి కలపను ఉపయోగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
హోమం కోసం కట్టెలను ఎంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుళ్ళిన, తడిగా ఉన్న, చిమ్మటలు పట్టిన, లేదా పురుగులు పట్టిన కట్టెలను ఉపయోగించకూడదు. అంతేకాకుండా స్మశానాలలో పెరిగే చెట్ల నుండి వచ్చే కట్టెలను గానీ, పక్షులు గూళ్ళు కట్టుకున్న కొమ్మల నుండి వచ్చే కట్టెలను గానీ వాడకూడదు. అడవులలో , నదీ తీరాలలో పెరిగే చెట్ల కట్టెలు హోమానికి ఎంతో అనువైనవిగా భావిస్తారు.
*రూపశ్రీ.