వ్యక్తి జీవితంలో ప్రేరణ పాత్ర ఎలాంటిది?

 

వ్యక్తి జీవితంలో ప్రేరణ పాత్ర ఎలాంటిది?

ఒక పదార్థం కాలినప్పుడు వెలుతురు వస్తుంది. ఎంత వెలుతురు వస్తుంది అన్నది పదార్థ లక్షణంపై, పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ప్రకటితమయ్యే వెలుతురు తీవ్రతలాగే మనిషిలోని శక్తి కూడా అంతే. కాబట్టి తరచి చూస్తే ఏ వ్యక్తీ మరొకరి కన్నా ఎక్కువ కాడు. ఎవరూ ఎవరికీ తక్కువ కాదు. ఎక్కువ తక్కువలు వ్యక్తి తన జీవలక్షణం గుర్తించి, తనలో దాగి ఉన్న శక్తిస్వరూపాన్ని గ్రహించి, దాన్ని వ్యక్తపరచటంలో చూపే తపనలోనే ఉంటుంది. అంటే మనిషి గుర్తించడంలోనే, అర్థం చేసుకోవడంలోనే అంతా దాగుంది. 

ఈ సత్యాన్ని గ్రహించారు కాబట్టే మన పూర్వులు 'ఈశావాస్యం ఇదం సర్వం' అని అన్నారు. అంటే ప్రపంచమంతా ఈశ్వరుడే. ప్రతి అణువునా ఈశ్వరుడే. ప్రతి వ్యక్తిలో ఉన్నదీ ఈశ్వరుడే. అంతటా ఉన్న  ఈశ్వరుడిలో ఎక్కువ తక్కువలు ఉండవు. కానీ చాలామంది ఈ ఎక్కువ తక్కువల గురించి మాట్లాడుతుంటారు. తనలో ఉన్న ఈశ్వరుడిని గుర్తించటంలోనే ఉంటుంది అంతా.

హనుమంతుడిలో సముద్రాన్ని లంఘించగల శక్తి ఉంది. కానీ తన శక్తి ఏమిటో తెలియక ఓ మూల కూర్చుని విషాదంలో మునిగిపోయాడు. సముద్రాన్ని దాటలేక వానరులంతా నిరాశకు గురువుతున్నా, హనుమంతుడు ఆ పని సాధించగల శక్తి ఉండి కూడా నిరాశా నిస్పృహలను నింపుకుని అలా కూచుండిపోయాడు. జాంబవంతుడు హనుమంతుడిలోని శక్తిని తెలియజేస్తే కానీ హనుమంతుడు సముద్రాన్ని దాటేందుకు సిద్ధపడలేదు.

ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది.

మరి అందరిలోనూ శక్తి సమానంగా ఉంటే, సముద్రాన్ని అందరూ దాటగలగాలి. ఒక్క హనుమంతుడే ఎందుకు దాటాడు? అని అడగవచ్చు.

దానికి కూడా  సమాధానం ఉంది. శక్తి ఒకటే అయినా అది ప్రకటితమయ్యే తీరు వేరు. అందుకు ముందు వ్యక్తి తనలోని శక్తిని గుర్తించాలి. ఇతర వానరులు ఆ పని చేయలేరు. ఆరంభం నుంచీ హనుమంతుడు శక్తిని ప్రదర్శిస్తూ వచ్చాడు. మరో విషయంవైపు దృష్టి మళ్ళకుండా తన శక్తిని ప్రకటితం చేయటంపైనే దృష్టి పెట్టాడు.

ఎలాగైతే సానబెడితే కానీ వజ్రానికి మెరపు రాదో అలాగే శక్తిని ప్రదర్శిస్తున్న కొద్దీ అది తీవ్రతరం అవుతుంది. నైపుణ్యం పెరుగుతుంది. హనుమంతుడి విషయంలో అదే జరిగింది. అందుకే ఇతరులు వంద, ఎనిమిది వందల యోజనాలే లంఘించగలిగితే, హనుమ సముద్రాన్ని దాటగల శక్తి సాధించాడు.అయితే తన శక్తిని పెంపొందించుకున్నా, దాన్ని ప్రదర్శించేందుకు వ్యక్తికి ప్రేరణ కావాలి. ఆ ప్రేరణ వ్యక్తికి స్వతహాగా మనస్సులో నుంచి వస్తే సమస్య లేదు. లేకపోతే బాహ్యప్రేరణ కావాలి. ఈ బాహ్యప్రేరణ గురువు ద్వారా లభించవచ్చు. తల్లిదండ్రుల ద్వారా లభించవచ్చు. సమాజం నుంచి లభించవచ్చు. బాహ్య ప్రేరణ ఒకచోట ఒకరి దగ్గర నుండి మాత్రమే లభించాలనే నియమం లేదు.

హనుమంతుడికి బాహ్యప్రేరణ అవసరమైంది. హనుమంతుడికే కాదు, మన అందరికీ బాహ్యప్రేరణ అవసరం. ఒక రచయితకు పాఠకుల మెప్పు ప్రేరణనిస్తే, గాయకుడికి శ్రోతల కరతాళధ్వనులు ప్రేరణనిస్తాయి. నటుడికి ప్రేక్షకుల అభిమానం ఊపు నిస్తే, నాయకుడికి ప్రజల సమర్ధన శక్తినిస్తుంది.ఇలా అందరికీ ప్రేరణ అనేది కొత్త శక్తిని నింపుకుని ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది.

                                     ◆నిశ్శబ్ద.