విశ్వరూపం అంటే ఏమిటి??

 

విశ్వరూపం అంటే ఏమిటి??


కురుక్షత్ర సంగ్రామంలో యుద్ధం చెయ్యడానికి భయపడిపోతున్నాడు అర్జునుడు. యుద్ధ క్షేత్రంలో నావాళ్ళు ఎందరో ఉన్నారని, వాళ్ళందరితో నా చేతిలో ఎంతమంది చచ్చిపోతారో అని బాధపడుతున్నాడు. నేను యుద్ధం చెయ్యను సన్యాసం తీసుకుని అడవులకు వెళ్ళిపోయి ముక్కుమూసుకుని తపస్సు చేసుకుంటాను అని కృష్ణుడితో చెప్పాడు. అప్పుడే కృష్ణుడు భగవద్గీత బోధించడం మొదలుపెడతాడు. ఉపనిషత్తులలోనూ, వ్యక్తిత్వంలోనూ, జీవితంలోనూ మనిషి ఎలా ఉండాలో, మనిషి గుణాలు ఎలా ఉండాలి. ఈ జీవితంలో మనిషి సాదించవలసింది ఏంటో?? అసలు మనిషి బాధ్యత ఏమిటో అన్నీ వివరంగా చెబుతాడు.


 ఈ విధంగా కృష్ణుడు చెప్పగా అర్జునుడు కళ్లు తెరిచాడు. చుట్టు చూచాడు. ఎదురుగా అపారమైన కౌరవ సేనలు, భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణులు తమవైపు యుద్ధానికి వచ్చిన అపారమైన సైన్యాలు, కోలాహలం కనపడింది. కృష్ణుడు చిరునవ్వుతో చేతిలో గుర్రాలను తోలే చర్నాకోలతో, తనదైన సౌమ్యరూపంతో, తన ఎదురుగా నిలబడి ఉండటం చూచాడు అర్జునుడు. అమ్మయ్య అందరూ ప్రస్తుతానికి బతికే ఉన్నారు. ఎవరూ చావలేదు అని పరవశించిపోయాడు అర్జునుడు. సౌమ్యమైన తన పూర్వరూపంతో అర్జునుడి ఎదురుగా నిలబడ్డ కృష్ణుడు అర్జునుని బుజం తట్టి భయంలేదని ఓదార్చాడు.


ఇక్కడ ఒక విషయంమనం గమనించాలి. కృష్ణుడు ఎప్పుడూ ఒకే రూపంతో ఉన్నాడు. కేవలం అర్జునుడు తన మనోనేత్రంతో ఈ అనంతమైన విశ్వం యొక్క రూపాన్ని దర్శించాడు. మరలా కళ్లు తెరవగానే కృష్ణుడు మామూలుగానే కనపడ్డాడు. అంతే గానీ మన సినిమాలలో చూపించినట్టు ఆకాశం అంత ఎత్తు ఉన్న కృష్ణుడు మామూలుగా ఆరడుగుల ఎత్తుకు దిగిపోయాడు అని కాదు. కృష్ణుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ అర్జునుడి మనోదృష్టిభేదం మాత్రమే విశ్వరూప సందర్శనము రూపం. కేవలం మనం కూడా ఈ విశ్వరూపాన్ని సందర్శించవచ్చు కాకపోతే ఉన్నది ఉన్నట్టు, నిజాన్ని నిజంగానూ అంగీకరించగలగాలి. ఒక విషయాన్ని, ఒక వస్తువును, ఒక నిజాన్ని దాని పూర్తి స్వరూపంతో ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడే అది ఎంత శక్తిమంతమైనదో, దాని ప్రత్యేకత ఏమిటో తెలుస్తుంది. 


ఒక చిన్న పరమాణువు. అది ఎంతో చిన్నది. అలాంటి పరమాణువుల కలయిక అణువు అవుతుంది. అణువుల కలయిక పదార్థం అవుతుంది. కాబట్టి పదార్థం ఏర్పడటానికి పరమాణువే మూలం. అలాగే మనిషి కూడా. ఒక చిన్న కణంగా మొదలై ఆరడుగుల భౌతిక శరీరంగా మార్పు చెందుతుంది. కణం లేకుంటే మనిషి ఎక్కడ రూపుదిద్దుకుంటాడు మరి. 

అలా నిజాన్ని గ్రహించడమే విశ్వరూపమని అర్థం. అత్యంత సహజమైన మరణాన్ని(అంటే మరణలలో రకాలు ఉంటాయని ఘోరమైన మరణాలకు భయపడాలని కాదు.  చావు అనేది ఎవరికైనా సహజమైనదేనని తెలుసుకోవడం) చూచి భయపడకూడదు. పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం అని భావించాలి. సుఖ దు:ఖాలు వస్తూపోతూ ఉంటాయి పొంగిపోవడం, కుంగి పోవడం చేయకూడదు అని భావించాలి. అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అందరినీ సమానంగా చూడాలి, విరోధము, ద్వేషము పనికిరాదు అని అనుకోవాలి. వల్లమాలిన కోరికలు మనలను అధ:పాతాళానికి నెడతాయి కాబట్టి కోరికలను అదుపులో పెట్టుకోవాలి. అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈషణ త్రయం అంటే భార్య, సంతానము, ధనము వీటిమీద మమకారం పరిమితంగా ఉండాలి కానీ అవే జీవితంగా బతకకూడదు. అంటే మనుషుల మధ్య బంధాలు అనేవి అసలు ఉండకూడదు అని చెప్పడం లేదు. ప్రేమ అనురాగం ఆప్యాయత ఇవి ఇతరుల మీద చూపించాలి. అయితే ఎక్కువ ప్రేమ పెంచుకోకూడదు. నిజనికి మనుషుల దుఃఖానికి కారణం అతిగా ప్రేమలు పెంచుకోవడం, అతిగా ఆశించడం. ముందుగానే ఫలితాలను నిర్ణయించేసుకోవడం. కాబట్టి ఎలాంటి ప్రత్యేక ఆసక్తి లేకుండా వీటిని అన్నిటినీ ఉన్నవి ఉన్నట్టుగా దర్శించడమే విశ్వరూపం. కానీ, ఇవన్నీ మనకు ఇష్టం ఉండవు. వీటిని మన మనసు అంగీకరించదు. అందుకని మనకు విశ్వరూపం కనిపించదు.


అందుకే మనిషి ఎప్పుడైతే అనవసర ప్రేమలు, ఆసక్తులు వదిలేసి నిశ్చలంగా, ఉన్న దాన్ని ఉన్నట్టు చూస్తూ వాస్తవికంగా బతకాగలుగుతాడో అప్పుడు స్పష్టత కలుగుతుంది జీవితం మీద. అదే విశ్వరూపం.


                                 ◆వెంకటేష్ పువ్వాడ.