శారీరక తమస్సు అంటే ఏమిటి?
శారీరక తమస్సు అంటే ఏమిటి?
దేవ, ద్విజ, గురు, ప్రాజ్ఞ పూజనం. అంటే దేవతలను, పెద్దలను, బ్రాహ్మణులను, గురువులను, పండితులను పూజించడం శారీరక తపస్సు, పెద్దలను పూజిస్తే ఆదరిస్తే గౌరవిస్తే మనలను మనం గౌరవించుకున్నట్టే. గురువులను, పండితులను పూజిస్తే వారు మనకు చక్కని మార్గాన్ని చూపుతారు. దేవతలు, పెద్దలు, గురువులు, ఆశీర్వాదములు ఉంటే జీవితం సాఫీగా గడిచిపోతుంది. వారిలో ఉన్న అహంకారము, గర్వము నశించిపోతాయి. కోపం తగ్గిపోతుంది. భగవంతుని చేరుకోవాలనుకొనే వారికి ఈ శారీరక తపస్సు ఎంతో ముఖ్యం.
ఇక్కడ ద్విజుడు అనే పదాన్ని ప్రస్తావించారు కదా ద్విజ అంటే రెండో జన్మ. ప్రతివాడూ పుట్టగానే ఏ వర్ణానికి చెందడు. 7,9,11, ఏట(సంవత్సరాల వయసు) ఉపనయనం చేసుకుంటే వాడు ద్విజుడు అవుతాడు. ద్విజులు అంటే కేవలం బ్రాహ్మణులే కాదు ఉపనయనం యజ్ఞోపవీతధారణ జరిగిన ఎవరైనా ద్విజులే. ఉపనయనం ఒక సంస్కారం తంతు కాదు. ఈనాడు ఉపనయనం పెళ్లికి ముందు ఒక తంతు లాగా జరిపిస్తున్నారు. అది కేవలం ఫార్మాలిటీ అవుతుందే తప్ప ఉపనయం వల్ల చేకూరాల్సిన ప్రయోజనం ఏమంత్రం లభించదు.
తరువాతది శౌచమ్ అంటే కేవలం శరీర శుభ్రతే కాదు మనస్సు కూడా నిర్మలంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రత అనగానే శరీరాన్ని నీళ్లతో రుద్ది రుద్ది స్నానం చేయడం, ఇంటిని మెరిసేలా ఉంచుకోవడం అని అర్థం చేసుకుంటే పొరపడినట్లే. శుభ్రత అంటే అంతర్గతంగా ఎలాంటి చెడుభావనలు, మలినమైన ఆలోచనలు మనసులోకి రానీయకుండా ఉండటం. ఎదుటి వారి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం, ఎదుటి మనుషుల చెడును కోరుకోవడం, ఎప్పుడూ ఈర్ష్య, అసూయతో రగిలిపోతూ ఉండటం. ఇవేవీ మనసులో ఉండకూడదు.
తరువాతది ఆర్జవమ్ అంటే మంచి ప్రవర్తన. కపటం, కుటిలత్వము పనికిరాదు. కపటపు ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు దూరంగా నెట్టేయాలి. దీనినే పాజిటివ్ తింకింగ్ అంటారు. ఎప్పుడూ మంచిగా ఆలోచించాలి. మంచి గా ప్రవర్తించాలి. పాజిటివ్ తింకింగ్ ఉన్నప్పుడే మనిషి అన్ని పరిస్థితులను డీల్ చేయగలిగే మనస్తత్వాన్ని డవలప్ చేసుకోగలుగుతారు.
తరువాతది బ్రహ్మచర్యం. ఈ పదానికి మనకు ఒక రూఢి అర్థం ఉంది. పెళ్లికాని వాడు బ్రహ్మచారి. వాడు ఎంతమందితో తిరిగినా వాడిని బ్రహ్మచారి అంటారు. పెళ్లి అయిపోతే ఇక వాడు బ్రహ్మచారి కాదు, సంసారి అని అంటారు. అంటే ఇక్కడ రిలేషన్ ఏర్పడితే ఇక బ్రహ్మచర్యం పోయింది అనే ఒకానొక అభిప్రాయం అందరిలో ఏర్పడిపోయింది అది తప్పుభావన. బ్రహ్మయందు అంటే ఆత్మయందు చరించేవాడు. ఆత్మజ్ఞానముకలవాడు బ్రహ్మచారి. మరొక అర్థం చెప్పుకోవాలంటే గురువు దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు పాటించేది బ్రహ్మచర్యము. పెళ్ళైన వాడు కూడా బ్రహ్మచర్య నిష్టను పాటించవచ్చు. కేవలం తాను శాస్త్రోక్తంగా వివాహమాడిన భార్యను తప్ప పరాయి స్త్రీని కన్నెత్తికూడా చూడని వ్యక్తిని కూడా నిత్యబ్రహ్మచారి అనవచ్చు. కాబట్టి కపట బ్రహ్మచర్యం కాకుండా నిజమైన బ్రహ్మచర్యమును పాటించాలి.
తరువాతది ఆఖరుది అహింస. అంటే సాటి మానవులను, ప్రాణులను హింసించకపోవడం. అహింస అంటే శారీరక హింసయే కాదు మానసిక హింసకూడా హింస కిందికే వస్తుంది. మనసుకు కష్టం కలిగించే మాటలు మాట్లాడడం కూడా హింస కిందికే వస్తుంది. కాబట్టి ఎదుటి వారి శరీరానికి కానీ, మనస్సుకు కానీ హింస కలిగించకుండా ప్రవర్తించడం అహింస. ఈ లక్షణాలు ఉంటే దానిని శారీరక తపస్సు అంటారు.
◆వెంకటేష్ పువ్వాడ.