ఇలా చేస్తే సర్వమానవ సౌబ్రాతృత్వము సాధ్యమే!

 

ఇలా చేస్తే సర్వమానవ సౌబ్రాతృత్వము  సాధ్యమే!

అక్రోధము అంటే కోపం లేకుండా ఉండటం. కోపం చాలా చెడ్డ లక్షణం. కోపం అనేది ఆసురీ సంపద, అంటే రాక్షస గుణం అని. కోపం లేకపోవడం దైవీ సంపద. అన్ని అనర్ధాలకు మూలం కోపం. కోపావేశంలో ఏం చేస్తాడో వాడికే తెలియదు. క్రోధాత్ భవతి సమ్మోహః అనే విషయం తెలిసిందే. కోపం వలన కలిగే అనర్ధాలు గీతలో చక్కగా చెప్పారు. ఈ కోపము రజోగుణ ప్రధానము. కోపం వస్తే ఒళ్లు మరిచిపోతాము. కోపావేశంలో ఏం చేస్తున్నామో తెలియదు. రాక్షసుల్లా మారిపోతారు. చేయకూడని పనులు చేస్తారు. కాబట్టి కోపం లేకపోవడం దైవీసంపద అని అన్నారు. కాని కోపం అనేది ప్రతివాడికీ సహజ లక్షణం కాబట్టి దానిని సాధ్యమైనంతవరకు నియంత్రించుకోవాలి. కోపావేశాన్ని తగ్గించుకోవాలి. విచక్షణాజ్ఞానాన్ని ఉపయోగించాలి. వచ్చిన కోపాన్ని తెలివిగా ఉపయోగించుకోగలగాలి. కోపం మన అధీనంలో ఉండాలి కానీ, కోపానికి మనం వశులం కాకూడదు. ఇది సాధ్యం కావాలంటే ఒకటే మార్గము. ధ్యానము, సత్సాంగత్యము. వీటి వలన కోపం చాలావరకు నియంత్రింపబడుతుంది.

త్యాగము :- దీనినే సన్యాసము, వైరాగ్యము అని కూడా అంటారు. త్యాగములలో కల్లా కర్మఫలమును త్యాగం చేయడం ఉత్తమం. ప్రాపంచిక విషయములలో, విషయవాంఛల మీద ఆసక్తిని త్యాగం చేయడం, దుర్గుణములను త్యాగం చేయడం, ఇవే అసలైన త్యాగాలు. బాహ్యంగా చూస్తే పరోపకార బుద్ధిని కలిగి ఉండటం.

శాంతి:-  అంటే ఎల్లప్పుడూ శాంతంగా, సుఖంగా ఉండటం. మనస్సును నిర్మలంగా, ఎటువంటి కల్లోలం లేకుండా ఉంచుకోవడం. మనలో కలిగే వివిధ భావాలను నియంత్రించుకోవడం. దీని వలన శాంతి కలుగుతుంది. మనం సహజంగా ఆనంద స్వరూపులం. శాంతస్వరూపులం. కాని మన జీవితాలలోకి దుఃఖాలను, అశాంతిని తెచ్చిపెట్టుకుంటున్నాము. అంటే ఆసురీ సంపదలను ఆహ్వానిస్తున్నాము. అనేక సంకల్పాలతో, కోరికలతో మనసును అల్లకల్లోలం చేసుకుంటున్నాము. చేయవలసిన పనులు చేయకపోవడం, చేయకూడని పనులు చేయడం వలన మనలో ఉన్న శాంతిని పోగొట్టుకుంటున్నాము. అశాంతిని ఆహ్వానిస్తున్నాము. అలా కాకుండా మనసును ఆత్మయందు లగ్నం చేస్తే శాంతి దానంతట అదే కలుగుతుంది.

అపైశునమ్ అంటే ఇతరులను విమర్శించడం, ఇతరులలో ఉన్న లోపాలను ఎత్తి చూపడం. ఎదుటి వారి మనసును నిరంతరం బాధపెట్టడం. ఒక వేలు ఇతరులవైపు చూపితే తక్కిన వేళ్లు మన వైపు చూస్తున్నాయి అని తెలుసుకోవాలి. అనవసరంగా తెలిసీ తెలియకుండా ఇతరులను దూషించడం, విమర్శించడం, నిందించడం ఆసురీలక్షణము. ఎదుటి వారిలోని మంచి గుణములను మాత్రమే చూడాలి. దుర్గుణములను వారికే విడిచిపెట్టాలి. అంతే కానీ విమర్శించకూడదు. ఆత్మస్తుతి, పరనింద రెండింటినీ వదిలిపెట్టాలి.

దయాభూతేషు అంటే సాటి మానవుల ఎడల, సాటి ప్రాణుల ఎడల దయ, జాలి, కరుణ కలిగి ఉండాలి. "నితాంత అపార భూత దయయును తాపస మందార నాకు దయసేయగదే” అనిపోతన గారు భాగవతంలో రాసారు. అందరిలో పరమాత్మను చూడగలిగిన నాడు ఎవరూ ఎవరికీ అపకారం చేయరు. సర్వమానవ సౌభ్రాత్తత్వము వర్ధిల్లుతుంది.

◆ వెంకటేష్ పువ్వాడ.