భౌతిక శరీరం కంటే చైతన్యవంతమైనది ఇదే!
భౌతిక శరీరం కంటే చైతన్యవంతమైనది ఇదే!
మనిషి అంటే ఎముకలు, రక్తం, మాంసం, కండరాల సంయోగం తప్ప మరేమీ కాదా? వీటన్నిటినీ నియంత్రిస్తూ వీటికన్నా వేరైన ప్రధాన తత్త్వం ఏదైనా మన శరీరంలో ఉందా? ఈ చైతన్య తత్త్వానికి మన శరీరం కేవలం ఒక ఆచ్ఛాదన మాత్రమేనా?
మనం ప్రాణమున్న మనిషికీ, ప్రాణంలేని శవానికీ మధ్యనున్న తేడాను సులభంగానే కని పెట్టగలిగినా బ్రతకడం జీవించి ఉండడం. గురించి మన కున్న అవగాహన లోతైనదీ కాదు, పరిపూర్ణమైనది కూడా కాదు. మనం 'జీవించి ఉంది' అని అనేది కేవలం భౌతిక పదార్థాల సంయోగం కాదు. జీవించి ఉన్న ఒక జీవి అది మొక్క అయినా, జంతువైనా, మానవుడైనా, ఏదైనా సరే జీవించి ఉన్నంతకాలం గాలి, పోషకపదార్థాలను పౌష్టికత్వాన్ని పరిసరాలనుంచి గ్రహించి, ఏది అవసరమో దాన్ని తీసుకొని, అవసరం లేనిదాన్ని విసర్జిస్తూ జీవించగలుగుతుంది.
అత్యంత క్లిష్టమైన శారీరక చర్యలు ఎంతో సమన్వయంగా, ప్రత్యేకమైన ప్రయోజనంతోనూ జరుగుతాయి. శ్వాసక్రియ, హృదయస్పందన, రక్తప్రసరణ, ఆ రస గ్రంథులు చర్యలు, జీర్ణక్రియ, పోషణ, విసర్జన, కొత్త కణజాలాల నిర్మాణం, శరీర ఉష్ణోగ్రతను నిలిపి ఉంచడం ఇవన్నీ ఎంతో క్రమబద్ధంగానూ, అవసరానికి తగినట్టుగానూ కొనసాగుతాయి. ఇంతకు ముందు జీవం ఉండి, ఇప్పుడు చనిపోయిన శరీరంలో కొరవడినది. ఆత్మ ప్రకాశం విద్యుత్తు ఆగినప్పుడు పంకా ఎలా ఆగిపోతుందో అలాంటిదే ఇది. అటువంటప్పుడు అలా కొరవడిన తత్త్వం యొక్క స్వభావం ఏమిటి? మనలో ఎంతవరకూ ఆ శక్తి పనిచేస్తూ ఉంటుందో అంతవరకూ శరీరంలోని కోట్లాది కణాలు తమ విధులను చక్కగానూ, సమర్థవంతంగానూ నిర్వర్తిస్తూ ఉంటాయి. ఆ తత్త్వం లేకుండా పోయినప్పుడు, శరీరవిధులు ఆగిపోయి, శరీరం కుళ్ళిపోవడం మొదలవుతుంది.
మనిషి జీవించి ఉన్నప్పుడు ఈ విధులన్నీ నిరంతరాయంగా, పరిపూర్ణంగా సాగిపోతాయి. జీవించి ఉన్న మనిషికి నిరంతరం కొనసాగుతున్న ఈ క్రియల గురించి తెలుస్తుంది. పూర్వం జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకోగలడు, తాను కోరినదాన్ని ఎంచుకోగలడు, భవిష్యత్తు కూడా కొంతవరకు స్పష్టా స్పష్టంగా తెలుసుకోగలుగుతాడు. అతడికి తన మరణం గురించి ముందుగానే తెలుస్తుంది. ఆ విధంగా మరణం అనేది చైతన్యవంతమైన తత్త్వం, భౌతికమైన శరీరంలోను మనస్సులోను చైతన్యం కలిగించకపోవడమేనని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే శరీరమూ, మనస్సూ ఈ తత్త్వం వలన ప్రతిస్పందిస్తాయో అప్పుడు మనం ఆ జీవి సజీవంగా ఉన్నట్లు గుర్తిస్తాము. చైతన్యవంతమైన తత్త్వం భౌతికశరీరం కంటే వేరైనదని స్పష్టంగా తెలుస్తున్నా శాస్త్రజ్ఞులు ఇంతవరకూ వేరైన ఆ సజీవమైన తత్త్వం ఏమిటో తెలుసుకోలేకపోయారు. ఎముకలు, రక్తం, మాంసం, కండరాలతో ఏర్పడిన ఈ భౌతికమైన స్థూల శరీరం కన్నా వేరైన ఒక సూక్ష్మ శరీరం ఉన్నదని మన ప్రాచీన ఋషులు తెలుసుకున్నారు.
◆నిశ్శబ్ద.