అసలైన భక్తి నిర్వచనమిదే!
అసలైన భక్తి నిర్వచనమిదే!
ప్రపంచంలో అన్ని రకాల మతాలలో కూడా భక్తి అనేది ఒక ముఖ్య అంశం. అయితే భక్తిని వారు ఎలా బయటకు వ్యక్తం చేస్తారు అనేది కూడా కాస్త ఆసక్తికరమైన అంశమే. అంతెందుకు హిందువులలోనే ఒక్కో భక్తుడు ఒకో విధంగా తన భక్తిని చూపిస్తూ ఉంటాడు. ఒకరు ఉపవాసం ఉంటారు, ఒకరు పూజలు చేస్తారు, ఒకరు ఏమీ చేయకుండా మనసులో దేవుడుంటే చాలని ఆధ్యాత్మిక ప్రపంచంలో మునిగిపోతాడు. ఇంకొకరు ఇతరులకు సహాయం చేస్తే దేవుడి విషయంలో భక్తి కలిగినట్టే అనుకుంటారు. అయితే మరికొందరు ఉంటారు వాళ్ళు చేసే తప్పులు చేసేసి దేవుడు ముందు కూర్చుని కాపాడు, కాపాడు నువ్వు నన్ను కాపాడితే నీకు అది ఇస్తా అది ఇస్తా అంటాడు.
ఇంకొందరు దేవుడు ఎక్కడో కొండల్లోనో, దూర ప్రాంతాలలోనో ఉన్నాడని అంత దూరం వెళ్లి అక్కడ వీడియోలు చేసుకుంటూ దేవుడిని తప్ప అన్నిటినీ చూస్తాడు. ఇలాంటివి జరుగుతున్న ఈ కాలంలో భక్తి అంటే ఏమిటి?? అనేది ఒక పెద్ద ప్రశ్న గానే ఉంటుంది. ఇంకా ముఖ్యంగా చిన్నపిల్లలు, ప్రశ్నించే మనస్తత్వం ఉన్నవారికి దేవుడు, భక్తి అనేవి చాలా పెద్ద ప్రశ్నలుగా అనిపిస్తాయి. తాము చేసేది నిజమైన భక్తి అనుకునే వాళ్ళు ఇచ్చే సమాధానాలు ఏవీ నప్పక, వాటితో సమాధానపడలేక ఒకానొక గందరగోళంలో పడటం లేదా, కొందరు మాటల గారడితో చెప్పిన వాటిని విని భక్తి గురించి ఒక అభిప్రాయానికి వచ్చి దేవుడు, భక్తి అనే విషయాలను పనికిమాలినవాటిగా భావించడం చేస్తారు.
భక్తి అంటే ఏమిటి? అది ఎన్ని రకాలు? భక్తిని ఏ విధంగా ఆచరించాలి? భక్తి కలిగి ఉంటే ఏం ఫలితం లభిస్తుంది? భక్తి అంటే మనం ఆచరించే భక్తి కాదు, అది వేరే ఉంటుంది. భక్తి అంటే ఒక వస్తువు కాదు. ఏదో ఒక సాధన కాదు. వేదములలో, ఉపనిషత్తులలో చెప్పబడిన సమస్త విషయముల యొక్క సంకలనమే భక్తి. భక్తి అంటే సకల ఆధ్యాత్మిక సాధనల యొక్క సమగ్ర స్వరూపము. ఉపనిషత్తులలో చెప్పబడిన కర్మ, ఉపాసన, జ్ఞానముల యొక్క సమాహార స్వరూపమే భక్తి. దానినే భక్తి అని అంటారు.
వివరంగా చెప్పాలంటే......
ధర్మంగా, న్యాయంగా, ఇతరులను కష్టపెట్టకుండా, ఇతరుల మనసు నొప్పించకుండా ధనం, ఆస్తి, మనకు కావలసిన వస్తువులను సంపాదించుకోవడం. మనలో కలిగే సంకల్పాలను, కోరికలను ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా తీర్చుకోవడం. ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది. ఇతరులకు అపకారం చేస్తే పాపం వస్తుంది అనే భావన కలిగి ఉండటం. పరమాత్మను ఏదో ఒక రూపంలో గానీ, ఏ రూపం లేకుండా గానీ శ్రద్ధతో ఉపాసించడం. మనసును ఎల్లప్పుడూ నిశ్చలంగా, నిర్మలంగా ఉంచుకోవడం. అటుంటి నిర్మలమైన, నిశ్చలమైన మనసును, ఏ పని చేస్తున్నా పరమాత్మయందు నిలిపి ఉంచడం. మనం చేసే పనులను అన్నిటినీ నిష్కామంగా, నేను చేస్తున్నాను అనే కర్తృత్వభావన లేకుండా చేయడం, ఆ పనులు చేసినందువలన లభించే ఫలితాలను అన్నిటినీ పరమాత్మకు అర్పించడం. ఆ ఫలితాలను భగవంతుని ప్రసాదంగా స్వీకరించడం. ఈ భావనలను అన్నీ కలిపితే దీనినే భక్తి అని అంటారు.
ఈ భక్తిని అందరూ ఆచరించవచ్చు. ఇందులో ఆడ, మగ, కర్మయోగులు, జ్ఞానయోగులు అందరూ అర్హులే. ఈ భక్తికి మొదటి మెట్టు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఇతరుల మనస్సుకు, శరీరానికి కష్టం కలుగకుండా, కర్మలు చేయడం, తద్వారా కోరికలు తీర్చుకోవడం. మనం చేసే ప్రతి పనికీ ఏదో ఒక ఫలితం కలుగుతుంది. ఆ ఫలితాన్ని పరమాత్మకు అర్పించడం. దానిని పరమాత్మ ప్రసాదంగా స్వీకరించడం. అంటే నిరంతరం ప్రాపంచిక విషయాలలో మునిగితేలేవాడిని కూడా భక్తి మార్గం వైపుకు తీసుకెళ్లడమే తొలిమెట్టు.
ఇది భక్తి, దాని నిర్వచనం, దానిలో ఉన్న ఆంతర్యం!
◆వెంకటేష్ పువ్వాడ.