ప్రేమ గురించి జిడ్దు కృష్ణమూర్తి ఏమి చెప్పారు?

 

ప్రేమ గురించి జిడ్దు కృష్ణమూర్తి ఏమి చెప్పారు?

ప్రేమ వున్నచోట స్వేచ్ఛ వుండాలి. అవతలి మనిషి నుంచి స్వేచ్ఛ కాదు, తననుంచే తనకు స్వేచ్ఛ అవసరం. ఇలా ఇతరులకు చెందడం, ఇతరులు మన మానసిక పరిస్థితులను పోషించడం, వారిపై నిరంతరం ఆధారపడి వుండడం వీటన్నిటిలోనూ ఎంతో  ఆదుర్దా, భయం, అసూయ, అపరాధ భావం వుంటాయి. భయం వున్నచోట ప్రేమ వుండదు. ఉద్రేక ప్రవృత్తి, రాగయుక్తత వీటికి ప్రేమతో యేమీ ప్రమేయం లేదు. కనుక ప్రేమకు సుఖానికి  కోరికకు ఎలాంటి సంబంధమూ లేదు. ప్రేమ అనేది గతానికి సంబందించిన ఆలోచనలోంచి పుట్టుకువచ్చేది కాదు. ఆలోచన ప్రేమను తయారు చేయలేదు. ప్రేమ ఈర్ష్యాసూయలలో నెగ్గుకు రాలేదు. అవి గతానికి చెందినవి. ప్రేమ ఎప్పుడూ వర్తమానంలోనిదే. ప్రస్తుతంలోనే చురుకుగా వుండేది.

 'నేను ప్రేమిస్తాను', లేక 'ఇదివరకు ప్రేమించాను' అనేది లేనేలేదు. ప్రేమ అంటే ఏమో తెలిస్తే మనం ఇతరులను అనుసరించము. ప్రేమ విధేయతను కనబరచదు. ప్రేమించినప్పుడు గౌరవ మర్యాదలు, అగౌరవ అమర్యాదలూ వుండవు. ఎవరినయినా ప్రేమించడం అంటే ఏమిటో మీకు తెలుసునా? ద్వేషం లేకుండా, అసూయ లేకుండా, కోపం లేకుండా, కోరికలు,  జోక్యం లేకుండా, అవతలి మనిషి ఏం చేస్తున్నాడు అన్న ప్రసక్తే లేకుండా ప్రేమించడం అంటే ఏమో తెలుసా?? 

 ప్రేమ వున్నచోట పోల్చి చూచుకోవడం వుంటుందా?  హృదయం అంతటితోనూ ఎవరినయినా ప్రేమించినప్పుడు,  మొత్తం మనసుతో, శరీరంతో,  సమస్త అస్తిత్వంతో సంపూర్ణంగా ప్రేమించినప్పుడు సరిపోల్చి చూచుకోవడం అనే ప్రసక్తి వుంటుందా?  ఆ ప్రేమకు అంకితం అయిపోయినప్పుడు, మరో ప్రసక్తి వుండదు.

ప్రేమకు బాధ్యత కర్తవ్యము వుంటాయా? బాధ్యత, ఈ మాటలను ఉపయోగిస్తుందా? ఏదో కర్తవ్య పాలనగా చేసే పనులలో ప్రేమ అనేది వుంటుందా? ఉండదు. మనిషి ఇరుక్కుపోయిన కర్తవ్య పాలన అనే చట్రంలో అతను నాశనమయిపోతున్నాడు. మీ విధి, మీకు విధాయకం కనుక ఒక పని చేస్తున్నారు. అంటే ఆ చేస్తున్న పనిపట్ల మీకు ప్రేమ లేదన్నమాట. ప్రేమ వున్నచోట విధి. కర్తవ్యం, నిర్వహణ, బాధ్యత అనేవి వుండవు.

చాలమంది తల్లిదండ్రులు తాము తమ పిల్లలకు బాధ్యులం అనుకుంటారు. ఈ బాధ్యత ఎంతవరకు వెళుతుందంటే, పిల్లలు ఏం చేయాలో ఏం చేయకూడదో ఏమి అవ్వాలో.. ఏమి  అవగూడదో గూడా వాళ్లె నిర్ణయిస్తారు. పిల్లలకు సంఘంలో సురక్షితమైన స్థానం ఏర్పడాలని తల్లిదండ్రుల అపేక్ష బాధ్యత అంటే వాళ్ల దృష్టిలో, ఈ లాంఛన మర్యాదలలో ఇమిడిపోయిన విషయమే. లాంఛన పూర్వక గౌరవ మర్యాదలు వున్నచోట ప్రేమకు స్థానం లేదని అనిపిస్తుంది. అక్కడ క్రమత లేదు. ఏదో మూసలో పోసినట్లు సాంప్రదాయికంగా తయారవాలనే అవసరమే అక్కడ పని చేస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను సంఘంలో ఇముడ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే యుద్ధానికి తలపడుతున్నారనీ,  సంఘర్షణ, క్రౌర్యమూ అక్కడ చోటు చేసుకుంటాయని అనిపిస్తుంది. దీనిని ప్రేమ, అపేక్ష అనగలరా?

నిజంగా పోషణ భారం వహించడం అంటే ఏదో చెట్టును సాకినట్లు, దానికి అవసరం అయిన నీళ్లు పోస్తూ, దాని అవసరాలు గమనిస్తూ - ఎరువులు వేస్తూ. మృదువుగా లలితంగా దానిని ఎదగనివ్వడం. అయితే తల్లిదండ్రులు పిల్లలను సంఘంలో తగిన స్థానాలలో కూర్చటానికి ప్రయత్నిస్తున్నారు అంటే వాళ్లను హతమార్చటానికి  చూస్తున్నారన్నమాట! తల్లిదండ్రులకు నిజంగా పిల్లలపట్ల ప్రేమ వున్నట్లయితే, యుద్ధాలు అనేవే ఉండవు. నిజమైన ప్రేమ అంటే అదే…

                                     ◆నిశ్శబ్ద.