కోటగుళ్ళు చూశారా?
కోటగుళ్ళు చూశారా?
వరంగల్ జిల్లాలోని ప్రసిధ్ధ రామప్ప దేవాలయంగురించి చాలామందికి తెలిసే వుంటుంది. దర్శించినవారుకూడా ఎందరో వుంటారు. అయితే వీరిలో ఎందరికి ఆ ఆలయానికి 10 కి.మీ. ల దూరంలో వున్న కోటగళ్ళు గురించి తెలుసు అంటే చాలామందికి తెలియకపోవచ్చు. రామప్పకి అంత సమీపంలో వేరే గుళ్ళుకూడా వున్నాయా అని ఆశ్చర్యపోవచ్చుకూడా. మేము రామప్పగుడికి కనీసం పదిసార్లన్నా వెళ్ళి వుంటాము. మాకు కూడా మొన్న వెళ్ళినప్పుడే తెలిసింది ఈ గుళ్ళు ఇక్కడికి ఇంత దగ్గరలో వున్నాయని.
రామప్ప దేవాలయానికి వెళ్ళే కమానులోకి తిరగకుండా సరాసరి వెళ్తే ఘనాపూర్ చేరుకుంటాం. దీనినే ములుగు ఘనాపూర్ అంటారు. వరంగల్ జిల్లాలోనే ఇంకొక ఘనాపూర్ (స్టేషన్ ఘనాపూర్) హైదరాబాదునుంచి వరంగల్ వెళ్ళే మార్గంలో వున్నది. మేమూ ముందు ఈ గుళ్ళు అక్కడే వున్నయ్యనుకున్నాంగానీ ఈ మధ్య రామప్ప ఆలయం దర్శించినప్పుడు అక్కడ గైడు చెప్పారు..అక్కడికి 10 కి.మీ. ల దూరంలోనే వున్నాయని. అప్పటికే చీకటి పడటంతో నివాసానికి వెళ్ళి మర్నాడు ప్రొద్దున్న వాటికోసమే మళ్ళీ వరంగల్ నుంచి రానూ పోనూ 164 కి.మీ. లు ప్రయాణం చేసి మొత్తానికి వాటిని చూశాము.
చూశారా స్ధానికులుగానీ, ప్రభుత్వంగానీ సరైన శ్రధ్ధ చూపించకపోవటంవల్ల, తగిన ప్రచారం లేకపోవటంవలన ఎంతటి అద్భుత శిల్పకళ మరుగున పడిపోతున్నదో. రామప్ప దేవాలయ కమాను దగ్గర అందరికీ కనిపించేటట్లు ఒక పెద్ద బోర్డు పెడితే ఆసక్తివున్నవారు చూస్తారుగా. మేము వెళ్ళేటప్పుడు కూడా దోవ గురించి అడిగితే అక్కడేమున్నాయి? పడిపోయిన గోడలుతప్ప అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో సమూహ ఆలయాలు, అంటే ఒకే ఆవరణలో వేరు వేరు ఆలయాల నిర్మాణం పూర్వం అంత జరిగినట్లులేదు. ఆందుకే ఈ ఆలయ సమూహం అరుదైనదే.
అద్భుతమైన శిల్పకళా సంపదతో అలరారే ఈ ఆలయాలు ప్రస్తుతం శిధిలావస్తలో వున్నాయి. వీటి చరిత్రలోకి వెళ్తే .. కాకతీయుల పరిపాలనా సమయంలో గణపతిదేవ మహారాజు వీటిని నిర్మించాడంటారు. ఈయన పేరుమీదే ఘనపూర్ కి ఆ పేరు వచ్చిందంటారు. ఈ ఆలయాలతోబాటు ఇక్కడ ఒక పెద్ద చెరువుని కూడా తవ్వించాడు గణపతి దేవుడు. ఇప్పటికీ ఉపయోగకరంగావున్న ఆ చెరువు దర్శనీయమే.
కోటగుళ్ళకి ఆ పేరు రావటానికి బహుశా చుట్టూవున్న కోటగోడలాంటి రాతితో నిర్మించిన ప్రహరీ కారణం కావచ్చు. ఈ ప్రహరీ లోపల అతి విశాలమైన ఆవరణలో మొత్తం 22 గుళ్ళు వున్నాయి. శిల్పంలోనూ, నిర్మాణంలోనూ వేటి శైలి వాటిదే. వీటి మధ్యలో ప్రధాన ఆలయం గణపేశ్వరాలయం. ఇక్కడ ఇప్పటికీ నిత్యపూజలు జరుగుతున్నాయి. ఇది రామప్ప దేవాలయంకన్నా పెద్దది. పక్కనే ఇంకొక శివాలయం .. కాటేశ్వరాలయం అని అక్కడ కనబడ్డ పిల్లాడు చెప్పాడు. ఇది గణపేశ్వరాలయానికి రెప్లికా. దానికన్నా శిధిలావస్తలో వున్నది. గణపేశ్వరాలయంలో వివిధ మండపాలు .. అందులో సభా మండపం తీర్చి దిద్దిన తీరు ప్రశంసనీయం.
రామప్ప దేవాలయంలోలాగానే ఇక్కడకూడా సాలభంజికలు, గజకేసరి విగ్రహాలుండేవి. అసలు ఎన్ని వుండేవో తెలియదుకానీ ప్రస్తుతం మిగిలివున్న రెండు సాలభంజికలు రామప్ప దేవాలయంలోని శిల్పాలకన్నా అద్భుతంగా చెక్కబడ్డాయి. అలాగే గజకేసరిలో సగం మనిషి, సగం సింహం రూపం ఏనుగుమీద స్వారీ చేస్తున్నట్లు, గుఱ్ఱంతల - సింహం నడుముతో ఏనుగుమీద స్వారీ చేస్తున్నట్లు కూడా వున్నాయి. రామప్పలో గజకేసరి శిల్పంలో మనిషి వుండడు. ముఖ్యాలయానికి దక్షిణంగా అనేక స్తంబాలు కలిగిన మండపం వున్నది. దీనిలోపల కప్పుకి పద్మాలు చెక్కబడివున్నాయి. చుట్టూవున్న 19 చిన్న ఆలయాలన్నీ గర్భ గృహం, అంతరాలయం కలిగివున్నాయి.
సందర్శకులు ఎక్కువగా రానందున పూజారిగానీ, గైడుగానీ ఎప్పుడూ అందుబాటులో వుండరు. మమ్మల్ని చూసి ఒక 15 ఏళ్ల అబ్బాయి వచ్చాడు. అప్పటికే శివాలయంలో పూజ జరిగింది. పుష్పాలతో శివలింగం, పానువట్టం చక్కగా అలంకరించబడివున్నది. ఆ అబ్బాయే చొక్కా విప్పి దేవుడికి హారతి ఇచ్చాడు. గైడుకి కూడా ఫోన్ చేశాడు మా ఫోన్తో. కానీ కలవలేదు.
ప్రకృతి భీభత్సాలకి, శతృవుల దాడులకు, మానవుల వికృత చేష్టలకి అనేక విగ్రహాలు ధ్వంసమయి, ఆలయాలు చాలామటుకు శిధిలమయిన తర్వాతకూడా ఈ గుళ్ళు పర్యాటకులకి కనువిందు చేస్తున్నాయంటే, అవి సరిగ్గా వున్ననాటి వైభవం వూహించుకోవచ్చు. ఇంత అపురూప కళాఖండాలని రక్షించుకుని, ఆలయాలను పునర్నిర్మిస్తే ఎంతటి అద్భుత కళాసంపద మనదవుతుందో!!
ఆ అబ్బాయి ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ గుళ్ళ పునరుధ్ధరణకి 4 కోట్ల రూపాయలు పైన మంజూరయినాయి. ఆర్కియాలజీ డిపార్టుమెంటువారి ఆధ్వర్యంలో జీర్ణోధ్ధరణ జరుగుతున్నది. చుట్టూ ప్రహరీ గోడ కొంత మరమ్మత్తు చేశారని చూపించాడు. ప్రవేశద్వారం వద్ద కుడివైపు గుంతలు తవ్వుతున్నారు.
ఇలాంటి అద్భుత ఆలయాల పోషణలో, ప్రచారంలో, పరిరక్షణలో, స్ధానికులు ఎక్కువ శ్రధ్ధ చూపిస్తే ఎన్నో కళా నిలయాలను మనం కాపాడుకోవచ్చు.
ఘనపూర్ వరంగల్ కి 82 కి.మీ. ల దూరంలోవుంది. వరంగల్ నుంచి వెళ్ళేవారు యన్.హెచ్. 202 లో ములుగు రోడ్డులో వెళ్ళాలి. ములుగుదాటి 5 కి.మీ. వెళ్ళిన తర్వాత ఎడంవైపు తిరిగి 12 కి.మీ. వెళ్తే కోటగుళ్ళు చేరుకోవచ్చు. రామప్ప దేవాలయం దర్శించినవారు, దాని కమాను ముందునుంచి సరాసరి వెళ్తే 10 కి.మీ. ల దూరంలో వున్నది. కరీంనగర్ నుంచి 110 కి.మీ. లు. కరీంనగర్ – వరంగల్ స్టేట్ హైవేలో హుజూరాబాదుదాకా వచ్చాక ఎడమవైపు పరకాల వెళ్ళే రోడ్డులోకి తిరగాలి. భూపాలపల్లి – పరకాల రోడ్డులో గాంధీనగర్ (పరకాలనుంచి 20 కి.మీ. లు) వెళ్ళాక కుడివైపు తిరిగి 9 కి.మీ.లు వెళ్తే కోటగుళ్లు చేరుకోవచ్చు.
మార్గమంతా సుందర ప్రకృతి దృశ్యాలమధ్య పొడవైన తాటి చెట్లు స్వాగతం చెబుతున్నట్లు కనువిందు చేస్తూవుంటాయి..
... పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)