వృశ్చిక రాశి
(తొ, నా, నీ, నూ, నే, నో, యా, యీ, యూ)
ఆదాయం : 2, వ్యయం : 14 - రాజపూజ్యం: 5, అవమానం : 2
వీరికి ఈ సంవత్సరము శని చతుర్ధ, పంచమములలో సంచరించుటచే శ్రమకరమయిన కాలము. అనేక సమస్యలు వచ్చును. విశేషించి కళత్రపీడ, ఆస్తిని కోల్పోవుట, శారీరక మానసిక శ్రమ, స్వస్థానహాని, సంతానమునకు ఇబ్బందులు, మర్యాదాభంగకరమయిన విషయములందాసక్తి, స్వజనవిరోధము కలుగును. చైత్ర వైశాఖములందు సప్తమగురువు, కార్తిక మార్గశిరములయందు భాగ్యగురువు అగుటచే అనుకూలముగనుండగలదు. ఆరోగ్యము, రాజదర్శనము, ఇష్టకార్యసిద్ధి, గౌరవమర్యాదలు, కీర్తిప్రతిష్ఠలు కలుగును. మిగిలిన సమయమున అష్టమగురువు అయినందున, చోరాగ్ని శస్త్రబాధలు, అపనిందలు, భయము, గౌరవహాని కలుగును. చైత్ర వైశాఖములయందు పంచమ రాహువు, ఏకాదశ కేతువు అయినందున కొంతలాభము, జయము, ప్రోత్సాహము, సన్మానము, పశులాభము, పుత్రమూలకవ్యధ కలుగును. పిదప చతుర్థరాహువు, దశమకేతువు అయినందున, వృత్తి ఉద్యోగ వ్యాపారాదులయందు చిక్కులు, మాతృవర్గంలో పేచీలు, గృహమందు అశాంతి కలుగవచ్చును. శ్రావణ భాద్రపదములయందు, మాఘ ఫాల్గునములయందు కుజానుకూలతతో భూ గృహ సంపాదనకవకాశము కలదు.
విశాఖ వారికి, సంవత్సరారంభము నుండి వైశాఖ పూర్వార్ధం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్ధం వరకు జన్మతారయందు శని, సంవత్సరారంభము నుండి కార్తిక బహుళం వరకు జన్మతారయందు రాహువు సంచరించుదురు. అనూరాధ వారికి, వైశాఖ బహుళం నుండి బాద్రపద బహుళం వరకు జన్మతారయందు శని సంచరించును. జ్యేష్ఠ వారికి, మార్గశిర శుక్లం నుండి సంవత్సరాంతం వరకు నైధనతారయందు రాహువు సంచరించును. మొత్తము మీద వీరు ఈ సంవత్సరము నవగ్రహ శాంతియొనర్చిన మేలు. సుందరకాండ పారాయణము, ప్రతిమాసము తమ జన్మనక్షత్రమునాడు, మాసశివరాత్రియందు పరమేశ్వర ప్రీతిగ అభిషేకము చేసిన మంచిది.