మహిళల సౌభాగ్యం కలకాలం వర్థిల్లేందుకు అరుదైన వ్రతాలు ?
మహిళల సౌభాగ్యం కలకాలం వర్థిల్లేందుకు
అరుదైన వ్రతాలు ?
అన్నకూట వ్రతం : ఇది గోవర్థనపర్వతాన్ని పూజిస్తూ చేసే వ్రతం. ఆవుపేడతో గోవర్థన పర్వతాన్ని తయారుచేసుకుని, దానిపై చెట్టుకొమ్మలను పెట్టి, దాన్ని పూజామందిరంలోగాని, పూజ చేసేచోట ఏర్పాటు చేసిన మండపంలోగానీ ప్రతిష్ఠించి పూజించాలి. శ్రీకృష్ణభగవానుని పూజించాలి. అన్నాన్ని నైవేద్యంగా పర్వతానికి ఎదురుగా రాశిగా పోసి సమర్పించాలి. అలాగే, శ్రీకృష్ణుడిని, గోవులను కూడా పూజించాలి. ఈ విధంగా చేయడంవల్ల శ్రీకృష్ణ పరమాత్మ కరుణాకటాక్షాలు సిద్ధిస్తాయి.
శాకసప్తమీ వ్రతం : ఇది శ్రీమహాలక్ష్మీదేవి ప్రీత్యర్థం ఆచరించే వ్రతం. ఈ రోజు పూజామందిరంలోగానీ, పూజ చేసుకోవాలని అనుకున్న చోట ఏర్పాటుచేసుకున్న మంటపంలోగానీ, శ్రీలక్ష్మీదేవి విగ్రహాన్నిగానీ, చిత్రపటాన్నిగానీ ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారిని షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించాలి. పూజా కార్యక్రమంలో బిల్వపత్రాలు, తామరపూలతో పాటు కాయగూరలను ఉపయోగించాలి. పచ్చి కూరగాయలను నైవేద్యంగా సమర్పించడంతో పాటు, వాటిని ఆహారంగా స్వీకరించాలి. తిరిగి సాయంత్రం పూజించి, ముత్తైదువులను ఆహ్వానించి పేరంటాలు నిర్వహించి తాంబూలాలను ఇచ్చుకోవాలి. ఈ విధంగా వ్రతం చేయడంవల్ల జీవితంలో సంపదలకు, ఆహారానికి లోటు ఉండదు.
క్షీరాబ్ధి వ్రతం : కార్తీకమాసంలో శుక్లపక్ష ఏకాదశినాడు ఏకాదశీ వ్రతం ఆచరించిగానీ, శ్రీమహావిష్ణువును పూజించి, ఉపవాసం ఉండాలి. ద్వాదశినాడు తులసికోట దగ్గర శ్రీమహావిష్ణువును ప్రతిష్ఠించి పూజించాలి. తులసిచెట్టు దగ్గర ఉసిరిక కొమ్మను ఉంచి పూజించాలి. ఈ విధంగా ఎవరైతే వ్రతం చేస్తారో, వారికీ ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని స్వయంగా బ్రహ్మదేవుడు పేర్కొన్నట్టు పురాణకథనం. ఈ వ్రతాన్ని ఉదయంగానీ, పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రంగానీ చేయవచ్చు. ఈ వ్రతాన్నే చిలుకుద్వాదశి అని అంటారు.
భక్తేశ్వర వ్రతం : పూర్వం మధుర ప్రాంత పాలకుడు చంద్రపాండ్యుడు చాలాకాలం సంతానం కలగక, శివపూజలు చేయగా శివుడు ప్రత్యక్షమై "అతిమేధావి అయిన అల్పాయుష్షుగల కుమారుడు కావాలా? లేక సంపూర్ణ ఆయుష్కురాలే కానీ విధవరాలు అయ్యే కూతురు కావాలా? కోరుకో'' అని పలికాడు. అందుకు చంద్రపాండ్యుడు కుమారుడినే కోరుకున్నాడు. కుమారుడు కలిగాడు. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు. పదహారు సంవత్సరాల వయస్సువాడు అవుతూనే అలకాపురి రాకుమార్తెనిచ్చి వివాహం జరిపించారు. భర్త అల్పాయుష్షును గురించి తెలుసుకున్న రాకుమార్తె భర్తను సంపూర్ణ ఆయుష్కుడిని చేయగలిగిన వాడు లయకారుడైన శివుడే అని భావించి, శివుడిని పూజిస్తూ కార్తీక పూర్ణిమరోజు "భక్తేశ్వర వ్రతం'' ఆచరించి, శివుడితో భర్త ప్రాణాలు కాపాడి తనకు సౌభాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంది. చివరకు మృత్యుసమయం ఆసన్నమై యమభటులు రాగా, శివుడు ప్రత్యక్షమై యమభాతులను తరిమి రాకుమారుడి ప్రాణాలు కాపాడి సంపూర్ణ ఆయుష్మంతుడిని చేసినట్టు పురాణ కథనం. కార్తీకపూర్ణిమ రోజు పగలంతా ఉపవాసం ఉండి, ప్రదోషసమయంలో శివుడిని పూజించి నైవేద్యాలను సమర్పించాలి. ఈ విధంగా భక్తేశ్వర వ్రతాన్ని ఆచరించడంవల్ల వైధవ్యబాధలు ఉండవు. ఐదవతనం కలకాలం వర్థిల్లుతుంది.
కరకచతుర్థీ వ్రతం : తొలి పూజలందుకునే వినాయకుడిని ఉద్దేశించి మహిళలు చేయాల్సిన వ్రతం. ఈ రోజు వినాయకుడిని షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి, వివిధ పిండివంటలను పది పళ్ళేలలో ఉంచి నైవేద్యం సమర్పించి, పదిమంది ముత్తైదువులకు వాటిని వాయనంగా ఇవ్వాలి. చంద్రోదయం అయ్యేంత వరకూ ఉపవాసం ఉండి, చంద్రుడికి ఆర్త్ఘ్యం ఇచ్చి భోజనం చేయాలి. ఈ విదంగా వ్రతాన్ని పన్నెండు లేదా పదహారు సంవత్సరాలు ఆచరించి ఉద్యాపన చేయాలి. ఇది మహిళలకు సౌభాగ్యం ప్రసాదించే వ్రతం.
పితామహాకృచ్ఛ వ్రతం : ఐదురోజులు ఆచరించాల్సిన ఈ వ్రతంలో ఐదురోజులూ ఇష్టదేవతలను పూజిస్తూ సప్తమిరోజు నీళ్ళు, అష్టమిరోజు పాలు, నవమిరోజు పెరుగు, దశమిరోజు నెయ్యి సేవించి,
ఏకాదశిరోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించాలి. మళ్ళీ ద్వాదశినాడు కూడా శ్రీమహావిష్ణువును పూజించి వ్రతాన్ని ముగించాలి.
దీపదాన వ్రతం : దీన్ని కార్తీకమాసంలోని సోమవారాల్లో లేదా పౌర్ణమి రోజు లేదంటే కర్తీకమాసంతో మరేరోజు అయినా ఆచరించవచ్చు. పైడి పత్తితో స్వయంగా అత్తులను తయారు చేసుకుని, వరి లేదా గోధుమపిండితోగానీ ప్రమిదను చేసుకుని అందులో ఆవునెయ్యితో దీపాన్ని వెలిగించి, దానికి నమస్కరించి శివాలయంలోగానీ, నదీతీరంలోగానీ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దానమిచ్చే సమయంలో "కీటా: పతంగాః మశాకాశ్చవృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః
దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః
భవన్తి నిత్యం శ్వపచా హాయ్ విప్రాః''
అనే శ్లోకాన్ని పఠించాలి. ఈ విధంగా చేయడంవల్ల అజ్ఞానం తొలగిపోయి విజ్ఞానం వికసిస్తుంది. అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయి.