విష్ణు విదియల నోము (Vishnu Vidiyala Nomu)

 

విష్ణు విదియల నోము

(Vishnu Vidiyala Nomu)

 

కథ ఒక రాజు కూతురు, ఒక బ్రాహ్మణుని కూతురూ విష్ణు విదియల నోము పట్టారు. రాకుమారి నోమును ఎంతో భక్తి శ్రద్ధలతో, ఏ లోటూ రానీయకుండా నిర్వర్తించి, తత్ఫలితంగా అష్టయిశ్వర్యాలలో ఓలలాడసాగింది.

బ్రాహ్మణ కుమార్తే తనది విద్వత్కుటుంబమనే అహంతో వ్రతాన్ని నిర్లక్ష్యంగా ఆచరించడం వలన అనూహ్యమైన దరిద్రం తటస్థించింది.

అందువలన ఆమె తన దౌర్భాగ్యానికి చింతించి, సాటివారిలో తలెత్తుకోలేక, సమీప అరణ్యాలకు వెళ్లి శోకిస్తూ వుండపోగా ఒకానొకనాడు లోక సంచారార్థం వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఆమెను పలకరించి, ఓదార్చి "విష్ణు విదియల నోము పట్టి ఉల్లంఘించడం వల్లనే కష్టాలు వచ్చాయి. ఇంటికి వెళ్లి ఆ నోమును భక్తి శ్రద్ధలతో యథావిధిగా నోచుకుంటే కష్టాలు గట్టెక్కి సిరిసంపదలు వస్తాయి" యని చెప్పగా, ఆమె తన తప్పు తెలుసుకుని తిరిగి వచ్చింది. విష్ణు విదియల నోము పట్టి, భక్తితో ఉద్యాపన చేసుకుంది. అది మొదలామె కూడా రాకుమార్తెకు మల్లేనే అగణిత వైభవాలతో ఆనందించింది.

విధానం

శివరాత్రి వెళ్ళగానే వచ్చే ఫాల్గుణ శుద్ధ విదియ మొదలుకుని, మళ్ళాశివరాత్రి వచ్చేదాకా ప్రతీ విదియనాడు పాత్ర: కాలాన్నేస్నానముచరించి అది మొదలు ఆ రోజంతా మౌనవ్రతం పాటించి, శివపార్వతుల్నీ పూజించి పరమాన్నం, పెరుగు, అరటి పళ్ళతో నివేదించి ఆ ప్రసాదాన్ని భుజించాలి. రాత్రి అభోజనంగా వుండి, కటిక నేలమీద పడుకోవాలి. ఇలా ఏడాది చేశాక ఉద్యాపన చేసుకోవాలి.

ఉద్యా పనం

మౌనంగా కిలోంబావు పసుపుకొట్టి, దానిని 113 వెదురు పెట్టెలలో సర్ది ఒక్కొక్క పెట్టేలోనూ ఒక్కొక్క లక్కజోడు, ఒక నల్లపూసల కోవ, ఒక కుంకుమ పొట్లం, క్రొత్త రవికెలగుడ్డ, రెండు అరటి పళ్ళు, దక్షిణ తాంబూలాలు చొప్పున అమర్చాలి. వాటిని లక్ష్మి నారాయణుల పూజలో వుంచి, అనంతరం వాటిలో ఒక పెట్టెను తమ వద్ద వుంచుకుని, తక్కిన 12 పెట్టెలనూ 12 మంది ముత్తయిదువులకు వాయన దానమివ్వాలి.