విష్ణు క్రాంత నోము (Vishnu Kranta Nomu)
విష్ణు క్రాంత నోము
(Vishnu Kranta Nomu)
కథ
ఒక బ్రాహ్మణ ఇల్లాలికి నలుగురు తమ్ముళ్ళు. వారి పెళ్ళి సమయానికి, ఆమె భర్తకు ఏదో వ్యాధి ముసిరి, ప్రాణం మీదకు వస్తూండటం వలన, ఆమె పెద్ద తమ్ముళ్ళు ముగ్గురు పెళ్ళికి వెళ్ళనే లేదు.
ఇప్పుడు కడగొట్టు తమ్ముడి పెళ్లి కానుంది. ఎప్పటిలాగే ఆమె భర్తకు తీవ్రమైన వ్యాధి కలిగింది.
అయినా సరే, ఆమె "ఈ తమ్ముడి పెళ్లికైనా వెళ్లి తీరా" లని ఆశతో రోగిష్టి భర్తను చాపలో చుట్టి - ఇంట్లో ఒక మూల పడేసి తలుపులన్నీ బిగించి, తాళం వేసి, తమ్ముడి పెళ్ళికి బయల్దేరింది. దారిపొడుగునా భర్తనూ తిట్టుకుంటూనే వెళ్ళింది. వెళ్ళే దారిలో ఒక చెరువుగట్టున చెట్టు నుంచి రాలిపడివున్న విష్ణుక్రాంత పుష్పాలని తొక్కుకుంటూ వెళ్ళింది. అప్పుడా పూలు పకపక నవ్వి "కట్టుకున్న మగడు బ్రతికుండగానే శవంలా మూటగట్టి వేసిన దానికి నోము పూల మహిమెలా తెలుస్తుంది'' అని చెప్పి, ప్రక్కనే చెరువులో ఉన్న చెంగలువలతో "చూశారటే చెంగలువలారా" అన్నాయి.
“వెళ్ళనీ వెళ్ళనీ చూద్దాం" అంటూ వెకిలిగా నవ్వాయి చెంగలువలు. విష్ణు క్రాంత పుష్పాలూ, చెట్టూ కూడా శృతి కలిపాయి.
ఆ మాటలు తన చెవికి వినిపించినప్పటికీ, తమ్ముడి పెళ్లి ఆరాటంలో ఆగకుండా వెళ్ళిపోయిందామె. తీరా యీ మహాతల్లి పెళ్ళి పందిరిలో కాలు పెట్టిందే ఆలస్యంగా పెళ్లివారిలో ఏదో గొడవలు రేగి పీటల మీద పెళ్లి ఆగిపోయింది.
“ఈవిడ రాకపోతేనే బాగుంది. అన్నీ పెళ్ళిళ్ళూ సక్రమంగా జరిగాయి. అడుగు పెట్టిందో లేదో పెళ్లి చెడిపోయింది'' అని,అంతా నానారకాల మాటలూ అన్నారు.
ఏడుపు ముఖంతో ఇంటికి మళ్ళిన ఆ విప్ర గృహిణి మార్గ మధ్యంలో చెరువు దగ్గరకు రాగానే ఇందాకటి మాటలు గుర్తు వచ్చి, వాటికి అర్ధం ఏమిటని అడిగింది. అందుకా విష్ణుక్రాంత నవ్వి "చెప్పినప్పుడు వినకుండా పోయి ఇప్పుడెందుకడుగుతావులే" అని తిరస్కరించగా ఆమె మరీ మరీ బ్రతిమాలింది.
దాంతో జాలిపడి, విష్ణుక్రాంత ఇలా అంది "అమ్మాయీ! తప్పంతా నీ మీదుంచుకుని నీ మొగుడ్ని తిట్టి మరో యింత పాపం మూట కట్టుకుంటున్నావు. గతంలోని విష్ణుక్రాంత నోము పట్టి ఉల్లంఘన చేసినందువల్లనే నీ భర్తకు ఆరోగ్యలోపం, నువ్వు పెళ్ళికి వెళ్ళలేకపోవడం, ఇప్పుడు వెళ్ళినా అవమానాల పాలవడమూ జరిగాయి. ఇప్పుడైనా ఇంటికి వెళ్లి మళ్ళా ఆ నోము పట్టి ఉద్యాపన చేసుకుంటే అన్నీ చక్కబడుతాయి ” అని విష్ణు క్రాంత చెప్పింది. అది విని, ఆమె ఇంటికి వెళ్లి ఆ నోము నోచుకోగా, భక్తి అనారోగ్యం తొలిగిపోయింది. తమ్ముడికి మరో మంచి సంబంధం కుదిరింది. ఈసారి ఆ పెళ్ళికి భార్యభర్తలిద్దరూ కలిసి వెళ్లి బంధువులందరితో ఆనందంగా గడిపారు.
విధానం
ప్రతిరోజూ విష్ణుక్రాంతకు నమస్కరించి, పూలు తెచ్చి విష్ణువును పూజించి, కథ చెప్పుకుని అక్షతలు వేసుకోవాలి.
ఉద్యాపనం
ఏడాది తర్వాత 13 జతల నేతిగారెలను విష్ణుక్రాంతకు నివేదించి, మరో 13 జతల నేతిగారెలను దక్షిణ తాంబూలాలతో ముత్తయిదువుకు వాయన దానమివ్వాలి.