Read more!

దసరాలో ఆసక్తికరమైన ఆచారాలు

 

 

 

దసరాలో ఆసక్తికరమైన ఆచారాలు

 


భారతీయ పండుగల సమయంలో దేవీ దేవతలను ఆరాధించుకోవడం ఒక ఎత్తైతే... ప్రాచీన సంప్రదాయాలని ఆచరించడం మరో ఎత్తు. వినాయక చవితినినాడు పత్రి పూజ, సంక్రాంతి నాడు పశువుల పూజ, దీపావళినాడు బాణాసంచా పేలుడు... ఇలా ప్రతి పండుగతోనూ మనకి తెలియకుండానే ఆచారాలను అప్రతిహతంగా కొనసాగిస్తూ వస్తున్నాము. ఇక నవరాత్రుల సందర్భంలో అయితే చెప్పనే అక్కర్లేదు. రావణదహనం, ఆయుధపూజ వంటి ఆచారాలతో పాటుగా దేశంలోని నలుమూలలా పలు సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. వాటిలో కొన్ని ఆసక్తికరమైనవి ఇవిగో...

 

 

ఘటస్థాపన

దక్షిణభారతంలో నవరాత్రులు తొమ్మిదిరోజులూ అమ్మవారిని కలశరూపంలో ఆరాధించే సంప్రదాయం ఉంది. కానీ ఉత్తరభారతంలో ఈ ఆచారం మరికాస్త విభిన్నంగా కనిపిస్తుంది. ఘటస్థాపన పేరుతో సాగే ఈ క్రతువులో కుండలో మట్టి పోసి దాని మీద బార్లీ గింజలను చల్లుతారు. తొమ్మిదిరోజుల పాటు ఆ ఘటాన్ని అమ్మవారిగా భావించి పూజిస్తారు. ఇక నవరాత్రులు ముగిసిన తరువాత ఆ బార్లీ మొలకలను ప్రసాదంగా పంచుతారు. ఈ క్రతువుకు రెండు కారణాలు కనిపిస్తాయి.  ఒకటి- వ్యవసాయాన్ని శాసించే ప్రకృతికి ప్రతీకగా అమ్మవారిని భావించడం, రెండు- సంతాన సాఫల్యానికి అమ్మవారి అనుగ్రహం అవసరం అన్న నమ్మకం. మన నాగరికతలో మొట్టమొదటిగా తెలిసిన పంటల్లో బార్లీ ఒకటి. దీనినే సంస్కృతంలో యవలు అంటారు. వేదాలలో సైతం ఈ యవల ప్రస్తావన కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆచారం వేదకాలం నుంచి సాగుతోందనడంలో ఎలాంటి అనుమానమూ లేదు. ఇప్పుడు బార్లీ వాడకం తగ్గిపోయింది కాబట్టి దాని స్థానంలో నవధాన్యాలతో కూడా ఘటస్థాపన చేస్తున్నారు.

 

 

గర్బ నృత్యం

గుజరాత్‌లో నవరాత్రుల సందర్భంగా గర్బ నృత్యం చేయడం సర్వసాధారణం. అమ్మవారి మూర్తిని లేదా ఆమెకు ప్రతీకగా దీపాన్ని ఉంచి ఆమె చుట్టూ నాట్యం చేస్తారు. ఈ పండుగ తొమ్మిది రోజుల్లోనూ గుజరాత్‌ మారుమూలలా ఉన్న గ్రామాల్లో ఈ నృత్యం సాగుతుంది. రాత్రివేళకి తమ పనులన్నీ ముగించుకున్న మహిళలంతా ఒక చోటకి చేరి ఈ నాట్యాన్ని సాగిస్తారు. లయబద్ధంగా డోలు వాయిద్యం వినిపిస్తుండగా చప్పట్లు చరుస్తూ, అమ్మవారి గురించిన పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. గర్బ అనే పేరు గర్భం నుంచి వచ్చింది. అమ్మవారిని మనకు జీవాన్నిచ్చే తల్లిగా, ఈ జీవితచక్రాన్ని ముందుకు నడిపించే శక్తిగా భావించి ఈ పేరుని అందించి ఉంటారు. ప్రకృతి లేనిదే మానవజాతి మనుగడ సాధ్యం కాదు కదా! అలా ఆ తల్లి మనల్ని ‘కడుపులో ఉంచుకొని’ కాపాడుతున్నట్లేగా! ప్రకృతికి ప్రతీకగా ఆ తల్లిని మధ్యలో ఉంచి, తామంతా ఆమె లీల అన్న సందేశాన్ని అందించే నృత్యమే గర్బ.

 

 

గోలు

బొమ్మల కొలువు అనగానే మనకి సంక్రాంతి గుర్తుకువస్తుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలతో పాటుగా కర్ణాటక, తమిళనాట నవరాత్రులలో కూడా బొమ్మలని కొలువు తీర్చే సంప్రదాయం ఉంది. ముఖ్యంగా తమిళనాట బొమ్మల కొలువు అంటే నవరాత్రులలో పేర్చే బొమ్మలే. అక్కడ ఈ సంప్రదాయాన్ని గోలు అని పిలుస్తారు. గోలులో భాగంగా సాగే ఆచారం ఒక క్రతువుని తలపిస్తుంది. సాధారణంగా నవగ్రహాలకు సూచనగా తొమ్మిది మెట్ల మీద ఈ బొమ్మలను పేరుస్తారు. అందులోని ప్రతి మెట్టు మీదా ఎలాంటి బొమ్మలను ఉంచాలనేదానికి ఒక పద్ధతిని పాటిస్తారు. ఉదాహరణకు త్రిమూర్తులను ఎక్కడ ఉంచాలి, ప్రాపంచిక విషయాలకు సంబంధించిన బొమ్మలను ఎక్కడ ఉంచాలి, ప్రకృతి సంబంధమైన రూపాలను ఎక్కడ ఉంచాలి... అనేవాటికి ఒక క్రమపద్ధతిని పాటిస్తారు. మొత్తంగా.... ఈ గోలుని వారు ప్రపంచానికి ప్రతీకగా భావిస్తారన్నమాట. అందులో భాగంగా కలశాన్ని కూడా స్థాపించి తొమ్మిదిరోజుల పాటు పూజలు చేస్తారు. పేరంటాళ్లను ఆహ్వానిస్తారు. విజయదశమినాటి సాయంత్రం ఈ గోలు బొమ్మలని నిద్రపుచ్చి, కలశాన్ని ఉత్తర దిక్కుగా జరిపి... క్రతువుకి ముగింపు పలుకుతారు.

 

- నిర్జర.