శ్రీ వెంకటేశ్వర దండకం
శ్రీ వెంకటేశ్వర దండకం
హే సప్తశైలేశ ! హే సత్య సంకాశ ! హే నిత్య సంతోష ! ఈశాదయాభూష శ్రీ వెంకటేశ ! సుధాసిక్తపోషా ! స్వయం సుప్రకాశా ! గుణాతీతభాసా ! మహా చిద్విలాసా !
రసద్దివ్య సంగీత సాహిత్య సౌరభ్య సంపన్న గీత ప్రసూనార్చితామేయ శ్రీ పాద యుగ్మా ! హరే ! వేదవేదాంగ విద్భృంగ సంగూర్భటాభంగ సంకీర్తనావర్చితానంత కీర్తిచ్ఛటాపూర్ణ కళ్యాణమూర్తీ ! జగద్భార నిర్వాహణాధుర్య సర్వంసహా చక్రవర్తీ ! భవన్నామ గానానుసంధానమే రాగ సంకేత సంకీర్ణ శబ్దావ్యలంకార సందోహమై, భావభాండారమై, రాగశృంగారమై, రక్తికాసారమై, భక్తపాళిన్ సదా మోదసంద్రాల తెలించుగాదేధరన్ ! వాయు సంచారమున్ వారి గంభీర్యమున్, సూర్యచంద్రాది తారాగణానీక తేజః పరీవాహమున్, దేవా ! నీ ఆజ్ఞ వర్తించు నీకై ప్రవర్తించునీతోడ నర్తించు, నిన్నించి మన్నించి మమ్మున్ కటాక్షించుమో దేవదేవా! ప్రసిద్ధ ప్రభావా !
కలిన్, పాపకూపాల శాపాల తాపాలతో, దుర్విలాపాలతో, కామక్రోధాంధులై, మోహలోభాత్ములై, మత్సరగ్రస్తులై, దుర్మదాభిష్టులై, సర్వదాభ్రష్టులై అష్టకష్టాల నష్టాల కృంగే జనానీకమున్ వేగరక్షింప వైకుంఠమున్ వీడి భూలోకమే తెంచి, శ్రీ హకుళాంబా వరారోహ మాతృత్వ వాత్సల్య వార్ధిన్ ప్రయాణించి, పద్మవతీ నమ్నయై పుట్టియున్నట్టి సౌశీల్య సత్సంగ సద్యోకృపాపాంగ శృంగార గంగాతరంగా నృషంగ అలమేల్మంగనా వెల్లు సాక్షాన్మహాలక్ష్మి దేవేరిగా పొంది,
సత్యాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, వరాహాద్రి, శ్రీ గరుడాద్రి, వృషాద్రి, మహావెంకటాద్రి యనున్ సుప్రసిద్ధంబులైయున్న శైలావళిన్ శ్రీనివాసుండవై నిట్టియున్, వేదవేద్యుండవై భక్తసాధ్యుండవై, అండపిండాండ బ్రహ్మాండ భాండార కాద్యుండవై, ఖండ ఖండాంత రక్షాత గాధా విశేషుండవై, వెంకటేశుండవై, భారతమ్మందు వెల్గొందు ఆంధ్రప్రదేశాన, ఆనందహర్మ్యాలతో విందుగా నుండి గోవిందయన్నంత కొండంతగా పొంగుచున్ అండవై దండవై ఆర్తనాథుండవై కాచుచున్ బ్రోచుచున్ వచ్చి కాపాడుచున్ కామసాంతూరముల్,
రాజసాహంక్రియా మూలముల్ మా శిరోజావఖండాల మ్రొక్కుల్ సదా గొనుచు, హృత్సాత్త్వికత్త్వంబు, తత్త్వంబు బోధించుచున్ కామితార్థాల తీర్థప్రసాదాలతో ఆశ్రితాళిన్ కటక్షించుచున్, నిత్య వైకుంఠ భోగాలతో, నవ్య కళ్యాణ రాగాలతో తిర్పతిన్ చేరి వేంచేసియున్నట్టి పద్మావతీ వల్లభా, కోటి సూర్యప్రభా సన్నిభా, భావనా చార్య సంభావితానంద సంధాయకాంఘ్రిద్వాయా ! శ్రీప్రియా! పాహి పాహీ వరం. దేహి దేహీప్రియం, దీన రక్షావనా, దివ్య తేజోఘనా, భవ్య ధర్మాసనా, సర్వ సమ్మోహనా ! శ్రీనివాసా! ఘనానంద వేషా ! ప్రభో వెంకటేశా! నమస్తే ! నమస్తే !నమస్తే నమః
ఫలశృతి:-
ధరణి వెంకటనాథుని దండకంబు
భక్తిమై విన్న చదివిన ప్రతిదినంబు
సుఖము, భోగము, భాగ్యముల్ శుభవితతియున్
కలుగు జనులకు తథ్యంబు కలియుగమున !