Read more!

Kalagnanam-21

 

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం - 21

Sri Potuluri Veerabrahmendra Swamy Kalagnanam-21

 

“గోదావరి నది పన్నెండు రోజులు ఎండిపోయి తిరిగి పొంగిపొర్లుతుంది. వేంకటేశ్వరుని కుడిభుజం అదురుతుంది. మంగళగిరిలో వైష్ణవుల మధ్య కలహాలు చెలరేగుతాయి.

కృష్ణానది మధ్యలో బంగారు రథం కనిపిస్తుంది. ఆ రథాన్ని చూసిన వారి కళ్ళుపోయి, గుడ్డివారవుతారు. కర్ణాటక దేశంలో దేవాలయాలను తురకలు ధ్వంసం చేస్తారు.

కుక్కలు గుఱ్ఱాలను చంపుతాయి. ఆకాశం నుండి చుక్కలు రాలిపడతాయి.

నేల నెత్తురుతో తడిచిపోతుంది .చనిపోయిన వారి ఎముకలు గుట్టలుగా పడి వుంటాయి. దుష్టశక్తులు విజ్రుంభిస్తాయి. అందువల్ల జననష్టం జరుగుతుంది. కాకులు కూస్తాయి, నక్కలు వూళలు వేస్తాయి. ఫలితంగా ప్రజలు మరింతమంది గుంపులుగా మరణిస్తారు.

కొండవీటి రాతిస్థంభం కూలిపోవటం తథ్యం.

కలియుగాన 5000 సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదు. బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జననష్టం జరుగుతుంది. పగిలిన రాతిముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయి.

పసిబిడ్డలు మాట్లాడతారు. ఒకరి భార్య మరొకరి భార్యగా మారుతుంది.

కార్తీక బహుళ ద్వాదశి రోజున ఉత్తరాన వింత వింత చుక్కలు కన్పిస్తాయి. అవి అయిదు నెలలపాటు వుంటాయి. వేంకటేశ్వరుని సొమ్ము దొంగలు అపహరిస్తారు. కృష్ణా, గోదావరి నదుల మధ్య ప్రాంతమందు జనులు ఎక్కువగా నశిస్తారు. ప్రజలు గ్రామాలు వదిలి అడవులకు వెళ్ళిపోతారు. అనేక రకాలయిన జబ్బుల వలన పలువురు మరణిస్తారు.

అమావాస్య నాటి అర్థరాత్రి సమయాన ఉదయగిరి శిఖరం మీద చక్రాంకితుడైన ఒక పరమహంస ఎక్కి నిలిచి వుండడం చూసి, చంద్రగ్రహణం అని జనులు ఆశ్చర్యం చెందుతారు.

ఆకాశమార్గాన రెండు బంగారు హంసలు వచ్చి, పట్టణాల్లో సంచరిస్తాయి. దురాశాపరులు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించి సర్వ నాశనమైపోతారు. ఆకాశాన తూర్పు పడమరలు కాషాయరంగున కనిపిస్తాయి. కొండల నుండి పెద్ద పెద్ద ధ్వనులు వినిపిస్తాయి. వీరభోగవసంతరాయులునై నేను వచ్చులోపల ఇలాంటి వింతలూ అనేకం జరుగుతాయి’’ అని చెప్పి బ్రహ్మంగారు తన కాలజ్ఞానం ముగించారు.

 

 

తన గత జన్మల గురించి చెప్పిన బ్రహ్మేంద్రస్వామి

 

ఒకరోజు సిద్దయ్య స్వామికి సేవ చేస్తూ “స్వామీ! మీకు గతంలో కొన్నిసార్లు త్రేతా, ద్వాపర యుగాలలో కూడా జన్మించారని నాకు తెలిపారు. మీ పూర్వ జన్మల వివరాలను గురించి నాకు వివరిస్తారా?’’ అని అడిగాడు.

“నా గతజన్మల గురించిన వివరములు రహస్యములే అయినా, నీకు మాత్రం వివరించగలను’’ అని తన పూర్వ జన్మల గురించి చెప్పటం ప్రారంభించారు బ్రహ్మేంద్రస్వామి.

“బ్రహ్మలోకంలో నేను భైరవుడనే పేరుతో అనేక బ్రహ్మకల్పాలు రాజ్యపాలన చేశాను. ఆ తరువాత వెండి కొండ మీదకి వెళ్ళి 54 బ్రహ్మకల్పములు రాజ్యపాలన చేశాను. అప్పుడే మూడు యోజనాల పొడవైన కూర్మసిహాసనమును నిర్మించి, 290 బ్రహ్మకల్పాలు విష్ణుసేవ చేశాను. నేను చేసిన సేవలను గుర్తించిన మాధవుడు నాకు ‘పంచ విధ ముక్తి’ అనే వరం ఇచ్చారు. తర్వాత నేను సిద్ధాంత శిరోమణి ఆనందాశ్రితువు ఆశ్రమమ వద్ద అన్ని విద్యలూ అభ్యసించి, మూడేళ్ళ తరువాత అనేక యోగశాస్త్ర విద్యలను నేర్చుకున్నాను. 12000 గ్రంథములను పఠించి, అందులోని మర్మములన్నియూ గ్రహించాను.

వీటి ఫలితంగా నేను కాల అకాల మృత్యువులను జయించగలిగే శక్తిని సంపాదించాను. అనంతరం నా యోగబలం వల్ల దివ్య శరీరం ధరించి మూడువేల బ్రహ్మకల్పములు చిరంజీవిగా వున్నాను. ఆ తరువాత నా అవతారముల గురించి వివరముగా తెలుపుచున్నాను విను.

మొదట అవతారమెత్తి ఆనందాశ్రితులకు శిష్యుడిగా 99,662 బ్రహ్మకల్పాలు వున్నాను. మూడవ అవతారంలో 1,09,00,000 వున్నాను. నాల్గవ అవతారంలో కోటి పదమూడు వందల పదిహేడు బ్రహ్మకల్పాలు వున్నాను. అయిదో అవతారంలో నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల యాభై అయిదు వేల బ్రహ్మకల్పాలు వున్నాను. ఆరవ అవతారంలో ఆరువందల బ్రహ్మకల్పాలు వున్నాను. ఏడవ అవతారంలో 27,62,03,400 బ్రహ్మకల్పాలు బతికి వున్నాను. ఎనిమిదో అవతారంలో 22,60,000 బ్రహ్మకల్పాలు వున్నాను. పదవ అవతారంలో కనిగిరిలో జన్మించాను. ఆ జన్మలో 70 లక్షలకు పైగా బ్రహ్మకల్పములలో జీవించాను.

ఇప్పుడు బనగానపల్లెలో వీరప్పయాచార్యుడనై 125 సంవత్సరములు తపస్సు చేశాను. వీరబ్రహ్మేంద్రస్వామిగా మొత్తము 175 సంవత్సరములు జీవించి జీవసమాధి పొందుతాను’’


Veerabrahmendra swamy life story, Potuluri predictions, Potuluri Veerabrahmendra Swamy Biography, Brahmamgari Kalagnanam, predictions about world