Read more!

వైశాఖ పురాణం 6 వ అధ్యాయము

 

వైశాఖ పురాణం 6 వ అధ్యాయము

 


            
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

          జలదాన మహత్మ్యము - గృహగోధికా కథ

నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి మహర్షీ! వైశాఖమాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖమాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్తించెను. అప్పుడు నారదమహర్షి యిట్లనెను. మహారాజా! వినుము మాసవ్రతములన్నిటిలో నుత్తమమగు వైశాఖమాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటినీయనివారు పశు పక్ష్యాది జన్మముల నందుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖమాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ.

పూర్వము యిక్ష్వాకురాజ వంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు గోదానముల ననేకములగావించెను. భూమియందు రేణువులను లెక్కించుట, నీటిబొట్టులను గణించుట, ఆకాశామునందలి నక్షత్రములిన్నియని లెక్కించుట యెంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము మున్నగు దానములను గూడ లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్దినందెను. అందరకు సులభముగ దొరుకునది జలము. అది దైవదత్తము సులభము. అట్టి జలమును దానమిచ్చుటయేమని తలచి జల దానమును మాత్రము చేయలేదు. బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునగు గురువు పురోహితుడు. అతడును జలదానము చేయుమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పెను. నీరు అమూల్యమైనది అట్టిదానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును. ఎవరికిని సులభము కాని దానిని దానమిచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చెను. అట్లే యెవరును గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తమని తలచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింప లేదు గౌరవింపలేదు. అందరును ప్రసిద్దులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాధులు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చేయు వారెవ్వరు? నేను అట్టివారినే గౌరవింతునని అట్టివారిని మాత్రమే గౌరవించెను ఆదరించెను. ఈ విధముగ అపాత్రులకు మాత్రమే దానముల నిచ్చెను.

ఇట్టి దోషముచే నా రాజు యొకప్పుడును జలదానము చేయకపోవుట వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగను, కుక్కగ నేడుమార్లు జన్మించెను. అటు పిమ్మట మిధిలాదేశమును పాలించు శ్రుతకీర్తి మహారజు గృహమున గోడపైనుండు బల్లిగా జన్మించెను. అచట వ్రాలు కీటకములను భక్షించుచు బల్లియై హేమాంగద మహారాజు జీవనము గడుపుచుండెను. ఈ విధముగ ఎనుబదియేడు సంవత్సరముల కాలముండెను.

మిధిలాదేశ రాజగృహమునకు శ్రుతదేవమహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్నకాలమున వచ్చెను. మహారాజు అగు శ్రుతకీర్తి ఆ మునిని జూచి సంభ్రమముతో ఆ మునికి యెదురు వెళ్ళి సగౌరవముగ ఇంటిలోనికి దీసికొవచ్చెను. వానిని మధుపర్కము మున్నగువానితో పూజించి వాని పాదములను కడిగి యా నీటిని తన తలపై జల్లుకొనెను. అట్లు జల్లుకొనుటలో తలపై జల్లుకొన్న నీటి తుంపురులు కొన్ని యెగిరి గోడమీదనున్న బల్లిపై దైవికముగా పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ కలుగగనే ఆ బల్లికి పూర్వజన్మస్మృతి కలిగి తన దోషమును తెలిసికొని పశ్చాత్తాపము కలిగెను. నన్ను రక్షింపుము నన్ను రక్షింపుమని మానవునివలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడా ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లీ! నీవెందులకిట్లు దుఃఖించుచున్నావు. నీవు యేపని చేసి యిట్టి దశనందితివి? ఇట్లేల అరచుచున్నావు? నీవు దేవజాతివాడవా, రాజువా, బ్రాహ్మణుడవా? నీవెవరవు? నీకీదశయేల వచ్చెనో చెప్పుము. నేను నీకు సాయపడుదునని ప్రశ్నించెను.

శ్రుతదేవుని మాటలను విన్న బల్లిరూపమున నున్న హేమాంగదమహారాజు మహాత్మా! నేను యిక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడను ప్రభువును. వేదశాస్త్ర విశారదుడను. భూమియందలి రేణువులెన్ని యుందునో, నీటియందు జలబిందువు లెన్నియుండునో, ఆకాశమున నెన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగ దానమిచ్చితిని. అన్ని యజ్ఞములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. ధర్మముగా రాజ్యమును పాలించితిని. నేనెన్ని సత్కర్మల నాచరించినను, ముమ్మారు చాతక పక్షిగను, గ్రద్దగను, యేడుమార్లు కుక్కగను, ప్రస్తుతము బల్లిగను జన్మించితిని. ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై జల్లుకొనుచుండగా కొన్ని నీటితుంపురలు నా పైబడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది. నా పాపభారము తగ్గినట్లనిపించుచున్నది. కాని నేనింకను యిరువది యేడుమార్లు బల్లిగా జన్మించవలసి యున్నట్లుగ నాకు తోచుచున్నది. నాకీవిధమైన బల్లిగా జన్మపరంపరయెట్లు తొలగునాయని భయము కలుగుచున్నది. నేను చేసిన పాపమేమియో నాకీ జన్మయేల కల్గెనో యెరుగజాలను. దయయుంచి నాకీ జన్మలు కలుగుటకు కారణము అయిన పాపమును ఆపాపము పోవు విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించెను.

శ్రుతదేవమహాముని హేమాంగదుని మాటలను తన దివ్యదృష్టితో పరిశీలించి యిట్లనెను. రాజా! నీవు శ్రీమహావిష్ణువునకు ప్రియమైన వైశాఖమాసమున జలమునెవనికిని దానమీయలేదు. జలము సర్వజన సులభము. దానిని దానమిచ్చుట యేమి అని తలచితివి. ప్రయాణమున అలసినవారికిని జలదానమైనను చేయలేదు. వైశాఖమాస వ్రతమును గూడ పాటింపలేదు. హోమము చేయదలచినవారు మంత్రపూతమగు అగ్నియందే హోమము చేయవలయును. అట్లుగాక బూడిద మున్నగువాని యందు హోమము చేసిన ఫలమెట్లు కలుగును? అట్లే నీవును యోగ్యులగువారికి దానమీయక అయోగ్యులగువారికి దానముల నిచ్చితివి. అపాత్రులకెన్ని దానము లిచ్చినను ప్రయోజనము లేదు కదా! వైశాఖమాస వ్రతమును చేయలేదు. జలదానమును చేయలేదు. యెంతయేపుగ పెరిగినను, సుగంధాదిగుణములున్నను ముండ్లుకల వృక్షము నెవరాదరింతురు? అట్టి వృక్షము వలన ప్రయోజనమేమి? వృక్షములలో రావిచెట్టు ప్రశస్తమైనది. అందువలన నది పూజార్హమైనది. తులసియు మిక్కిలి పవిత్రమైనదే. ఇట్టి రావిచెట్టును, తులసిని వదలి వాకుడు చెట్టునెవరైన పూజింతురా? అట్టి పూజలవలన ఫలితముండునా? అనాధలు, అంగవైకల్యము కలవారు దయజూపదగినవారు. వారిపై దయను చూపుట ధర్మము. కాని వారు మాన్యులు పూజ్యులు కారు. అట్టివారిని పూజించుట ఫల దాయకము కాదు. వారిపై దయ, జాలి చూపవచ్చును. కాని గౌరవింపరాదు. తపము, జ్ఞ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీమహావిష్ణు స్వరూపులు. అట్టివారినే పూజింపవలయును. వీరిలో జ్ఞానవంతులు శ్రీమహావిష్ణువునకు మిక్కిలి యిష్టమైనవారు. అట్టివారిని పూజించినచో తనను పూజించినట్లుగ భావించి శ్రీహరి వరములనిచ్చును. కావున జ్ఞానులైనవారు సర్వాధికులు, సర్వోన్నతులు అట్టివారిని గౌరవింపక పోవుట వారిని అనగా శ్రీమహావిష్ణువును అవమానించుటయే యగును. ఈ విధముగ చేయుట యిహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును. మానవుడు పురుషార్థములను సాధింపవలెనన్నచో జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞానులు కానివారు, అంధులు - ప్రజ్ఞాజ్ఞాన నేత్రములు లేనివారు. అట్టి అంధుల నెంతమందిని పూజించినను ఫల్ముండునా? గ్రుడ్డివానికేమి కనిపించును? అతడేమి చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారి నెంతమందిని యెంత పూజించినను, వారిని సేవించినను అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములను, దుఃఖములను కలిగించును. పురుషార్థములగు ధర్మార్థ కామ మోక్షములెట్లు సిద్దించును?

తీర్థములు కేవల జలములు కావు. దేవతలు శిలారూపులు కారు. చిరకాలము తీర్థస్నానము, సేవ చేసినచో శిలారూపముననున్న దైవమును చిరకాలము పూజించినచో వారియనుగ్రహము కలుగును. కాని జ్ఞానులగు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు. ఇష్టఫలప్రాప్తిని కలిగింతురు. కావున జ్ఞానులగు వారిని సేవించినచో వారియుపదేశములను పాటించినచో విషాదముండదు. యిష్టప్రాప్తిచే సంతోషము కలుగును. అంఋతమును సేవించినచో జన్మ, మృత్యువు, ముసలితనము మున్నగువానిని వలని బాధయుండదు. అమృతత్వసిద్ది కలుగును. హేమాంగద మహారాజా! నీవు వైశాఖమాస వ్రతము నాచరింపలేదు. జలదానము చేయలేదు. జ్ఞానులగువారిని సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. నీకు యీ వైశాఖమాస వ్రతము నాచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యద్వర్తమాన కాలములలోని నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకొని విజయము నందగలవు. అని పలికి శ్రుతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపముననున్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖమాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను.

ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్యరూపమును పొందెను. శ్రుతకీర్తి మహారాజునకు, శ్ర్తదేవమహామునికి నమస్కరించెను. వారి యనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానము నెక్కి పుణ్యలోకములకు పోయెను. దేవతలందరును హేమాంగదుని యదృష్టమును మెచ్చిరి. హేమాంగదుడును పుణ్యలోకమున పదివేల సంవత్సరములుండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అటు పిమ్మట యిక్ష్వాకు కులమున కాకుత్స్థ మహారాజుగ జన్మించెను. ఏడు ద్వీపముల భూమిని సజ్జనులు, జ్ఞానులు మెచ్చునట్లు పరిపాలించెను. శ్రీమహావిష్ణువు అంశను పొంది యింద్రునికి స్నేహితుడై యుండెను. కులగురువగు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖమాస వ్రతమును సంపూర్ణముగ ఆచరించెను. అందుచేయవలసిన దానధర్మముల నన్నిటిని శ్రద్దాసక్తులతో భక్తి పూర్వకముగ చేసెను. సర్వపాపములను పోగొట్టుకొనెను. దివ్యజ్ఞానము నందెను. శ్రీమహావిష్ణువు సాయుజ్యము నందెను. కావున వైశాఖమాస వ్రతము సర్వపాపహరము. అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడును వైశాఖమాసవ్రతమును, వ్రతాంగములగు దాన ధర్మాదులను పాటించి శ్రీహరియనుగ్రహము నందవలెను. అని నారదుడు అంబరీషునకు వైశాఖమాసవ్రత విశిష్టతను వివరించుచు గృహగోధికావృత్తాంతమును వివరించెను.

వైశాఖ పురాణం ఆరవ అధ్యాయము సంపూర్ణము