Read more!

వైశాఖ పౌర్ణమి రోజు లెక్కలేనన్ని ప్రత్యేకతలు

 

వైశాఖ పౌర్ణమి రోజు లెక్కలేనన్ని ప్రత్యేకతలు


 

పౌర్ణమి తిథి తెలుగువారికి చాలా ప్రత్యేకం. ఎందుకంటే పౌర్ణమినాటి నక్షత్రం ఆధారంగానే… మన నెలలను ఏర్పరుచుకున్నాం. వాటికి అనుగుణంగానే మన పెద్దలు వ్యవసాయ, సంప్రదాయాలు కొనసాగించేవారు. పౌర్ణమినాటి చంద్రుడు నిండు సామర్థ్యంతో ఉంటాడు. మన మనసు మీద చంద్రుడి ప్రభావం గణనీయంగా ఉంటుందని జ్యోతిషులు చెబుతుంటారు. అందుకే పౌర్ణమినాడు ఉవ్వెత్తున ఎగసే మనసును స్థిరం చేసుకునేందుకు, దాని శక్తిని బలపరుచుకునేందుకు ఈ రోజు జపతపాలు, ధ్యానం చేస్తే మంచిదని చెబుతూ ఉంటారు. ఇక వైశాఖ పౌర్ణమి మరింత ప్రత్యేకం. బహుశా ఏ పౌర్ణమికీ లేనన్ని ప్రత్యేకతలు ఈ రోజున ఉన్నాయి. 

వైశాఖపౌర్ణమిని బుద్ధజయంతిగా కూడా వ్యవమరించడం తెలిసిందే. ఈ రోజు బుద్ధునికి మహా ప్రీతికరమైన రోజు. ఆయన జననం, బుద్ధుడిగా మారడం, నిర్యాణం చెందడం… మూడూ కూడా ఈ పౌర్ణమినాడే జరిగాయని చెబుతారు. అందుకే బౌద్ధులకు, ఆయనను ఆరాధించే సకలజీవులకు ఈ రోజు పరమపవిత్రం. 

ఈ పౌర్ణమి విష్ణుభక్తులకు పరమపవిత్రం. విష్ణుమూర్తి రెండవ అవతారమైన కూర్మావతారం ఈ రోజునే ఉద్భవించడం అందుకు కారణం. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరాన్ని మథించే సమయంలో, కవ్వంలా ఉన్న మందర పర్వతం జారిపోకుండా ఉండేందుకు కూర్ముడు అండగా నిలబడ్డాడు. అతి విశిష్టమైన ఈ కూర్మావతాన్ని పూజించేందుకు ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. అలాంటి ఓ గుడి తెలుగునాట ఉండటం విశేషం. శ్రీకాకుళానికి సమీపంగా ఉన్న శ్రీకూర్మం అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ గుడికి పదిహేను వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉండటం విశేషం. వైశాఖ పౌర్ణమి రోజునే విష్ణుభక్తులైన ఆళ్వారులలో ముఖ్యుడైన నమ్మాళ్వార్‌ జన్మించాడని చెబుతారు. 

వైశాఖ పౌర్ణమి శైవులకు కూడా ప్రత్యేకమే. శివుని రూపమైన శరభేశ్వరుడు అవతరించింది ఈ రోజునే. ఎనిమిది పాదాలతో, రెక్కలతో, సింహపుదేహంతో ఉన్న అవతారమే ఇది. హిరణ్యకశిపుని చంపిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రత్వం తగ్గలేదట. దాంతో ఆ స్వామితో తలపడి ఆయనను బలహీనపరచి, శాంతింపచేసేందుకు శరభేశ్వరుడు అవతరించాడు. దక్షిణాదిన పురాతనమైన ఆలయాలలో ఈ శరభ రూపం తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి శైవారాధకులకు కూడా ఈ రోజు విశిష్టమే! 

సంప్రదాయపరంగా కూడా వైశాఖ పౌర్ణమి అపూర్వమైనది. ఈ రోజును మహావైశాఖిగా పిలుచుకుంటారు. ఈనాడు సముద్రస్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతారు. ఎండ ఉధృతంగా ఉండే ఈ సమయంలో దధ్యోజనం (పెరుగన్నం), గొడుగు, ఉదకుంభం (నీటితో నిండిన కుండ) లాంటివి దానం చేస్తే పుణ్యం లభిస్తుంది. ఏది ఏమైనా ఈ రోజున మన ఇష్టదైవాన్ని మనసారా కొలుచుకుని…. మన కోరికలను, కష్టాలను చెప్పుకుంటూ అనుగ్రహం దక్కుతుంది. 

- మణి.