వెంకటేశుడి సమ్మోహనం!!

 

వెంకటేశుడి సమ్మోహనం!!

 

తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా శేషాచలం  కొండలలో వెలసిన కలియుగ దైవం వేంకటేశ్వరుడు రోజుకొక వాహన సేవలో ఊరేగుతూ భక్తులను అలరిస్తాడు. అయితే అన్ని ఒక ఎత్తు అయితే అయిధవరోజు మోహినీ అవతారం మాత్రం ఎంతో ప్రత్యేకం. 

అసలేమిటీ మోహినీ అవతారం

సాగరమధనం జరిపినపుడు అందులో నుండి అమృతం బయటకు వస్తుంది. ఆ అమృతం మాకు కావాలి అంటే మాకు కావాలి అని దేవతలు, రాక్షసులు రెండు వర్గాల వారు పొట్లాడుకుంటారు. రాక్షసులకు అమృతం దొరికితే వాళ్ళ ఆటలు మరింత పెరిగిపోయి ప్రజలను, దేవతలను అందరిని హింసించడం మరింత పెంచుతారనే ఉద్దేశ్యంతో త్రిమూర్తులలో ఒకడైన శ్రీమహావిష్ణువు అందమైన  స్త్రీ రూపాన్ని పొంది ఆ గొడవ దగ్గరకు వచ్చి రాక్షసులను ఆ అందంతో మోసం చేసి, అమృతాన్ని దేవతలకు దక్కేలా చేస్తాడు. అదే మోహినీ అవతారం.

ఈ మోహినీ అవతారం గురించి మరొక కథ కూడా ఉంది. అదే మోహినీ భస్మాసుర ఇతివృత్తం. భస్మాసురుడు శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ఏమి వరం కావాలో కోరుకోమంటాడు. అత్యాశపరుడైన భస్మాసురుడు లోకాన్ని మొత్తం తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని నేను ఎవరి తలమీద అయితే చెయ్యి పెడతానో వాళ్ళు భస్మం అయిపోయేలా వరం ఇవ్వు అని అడుగుతాడు. అందులో మెలిక తెలియని శివుడు భస్మాసురుడికి వరాన్ని ప్రసాదిస్తాడు. అయితే భస్మాసురుడు శివుడినే భస్మం చేయాలని చూసినపుడు శివుడు పారిపోయి విష్ణువు దగ్గరకు వెళ్లి కాపాడమని అడుగుతాడు. అప్పుడే విష్ణువు మోహినీ రూపంలో భస్మాసురిడి దగ్గరకు వెళ్తాడు. మోహినీ అందాన్ని చూసి ఆశ్చర్యపోయిన భస్మాసురుడు తనని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. నన్ను పెళ్లి చేసుకోవాలంటే నాతో నాట్యంలో గెలవమని మోహినీ అడుగుతుంది. అలా నాట్యం చేస్తూ తలమీద చెయ్యి వేసుకునేలా చేసి భస్మాసురుడిని అంతం చేస్తుంది మోహినీ.

ఈ రెండు కథలలో మోహినీ మనోహర అందాన్ని వివరిస్తారు. అమ్మాయిలకు కూడా ఉండని అద్భుతమైన అందం మోహినీ సొంతం. వజ్రాలు, రత్నాలు పొదిగిన హారాన్ని, కుడిచేతిలో చిలుకను పట్టుకుని, మిరుమిట్లు గొలిపే ఏడు వారాల ఆభరణాలను, ఎర్రని ముక్కుపుడకను ధరించి. మోహినీ అవతారంలో ఆద్యంతం సమ్మోహన పరుస్తాడు తిరుమల వెంకటేశుడు.

◆ వెంకటేష్ పువ్వాడ