సాలకట్ల బ్రహ్మోత్సవాల గురించి విన్నారా
సాలకట్ల బ్రహ్మోత్సవాల గురించి విన్నారా
తెలుగువారికి ఇష్టమైన దైవం వెంకటేశ్వరుడు. అందుకే ఏడాది పొడవునా... తిరుమలగిరులు గోవిందనామాలతో హోరెత్తిపోతుంటాయి. ఇక బ్రహ్మోత్సవాల సమయం వచ్చిందంటే దారులన్నీ తిరుమల వైపే పరుగులు తీస్తుంటాయి. శ్రీనివాసుని సేవించుకోవడానికి సాక్షాత్తూ ఆ బ్రహ్మదేవుడే ఈ బ్రహ్మోత్సవాలను మొదలుపెట్టినట్లు చెబుతారు. వేయి సంవత్సరాల ముందు నుంచే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయనడానికి ఆధారాలు ఉన్నాయి.
ఒకప్పుడు బ్రహ్మోత్సవాలు ఏడాదికి పొడవునా... నెలకి ఒకసారి చొప్పున జరిగేవట. ఇప్పుడు మాత్రం ఏడాదికి ఒకసారే... అది కూడా దసరా సమయంలో జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల మాడవీధులలో వేర్వేరు రథాల మీద తిరిగే స్వామిని దర్శించుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. రథోత్సవంలో ఉన్న స్వామిని కనుక చూస్తే, తన కష్టాలన్నీ తీరిపోయి అంతులేని అనుగ్రహం దక్కుతుందని నమ్ముతారు.
అలాంటి బ్రహ్మోత్సవాలు ఈసారి రెండుసార్లు రావడం విశేషం. ఇలా రెండుసార్లు వచ్చే బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారు. ఒక ఏడాదిలో కనుక అధికమాసం వస్తే ఇలా సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. అలా 2015లోనూ, తిరిగి 2018లోనూ సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జ్యేష్టమాసం అధికమాసం రావడం వల్ల ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 13 నుంచి ఇవి మొదలవుతున్నాయి.
దసరాలో జరిగే బ్రహ్మోత్సవాలలాగానే ఇవి కూడా తొమ్మిది రోజులపాటు జరుగుతాయి. కానీ ఈ రెండు బ్రహ్మోత్సవాల మధ్యా కొన్ని తేడాలు లేకపోలేదు. సాధారణ బ్రహ్మోత్సవాల మొదటి రోజున ధ్వజారోహణం ఉంటుంది. స్వామివారి వాహనం అయిన గరుడుని బొమ్మ ఉన్న జెండాను ఎగరవేయడమే ఈ ధ్వజారోహణం. అలా ధ్వజస్తంభం మీదకు చేరిన గరుడుడు, తన యజమాని బ్రహ్మోత్సవాలకు రమ్మంటూ ముల్లోకాలలో ఉన్న దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. కానీ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఈ ధ్వజారోహణం జరగదు.
ధ్వజారోహణం బదులు స్వామివారు మొదటి రోజు బంగారు రథం మీద తిరుగుతారు. అలాగే బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు సాయంత్రం పుష్పకవిమానం బదులు స్వర్ణరథం మీద ఊరేగుతారు. ఎనిమిదో రోజు ఉదయం కూడా స్వర్ణ రథోత్సవం బదులు సాధారణ రథం మీద భక్తులను అనుగ్రహిస్తారు. ఇలాంటి చిన్నచిన్న తేడాలు తప్పితే... సాలకట్ల బ్రహ్మోత్సవాలకీ, సాధారణ బ్రహ్మోత్సవాలకీ మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదు. సందడిలోను, సంప్రదాయంలోనూ... ఇవి ఏ ఉత్సవానికీ తీసిపోవు. పైగా ఇది సెలవలు వచ్చే కాలం కాదు కాబట్టి, స్వామివారిని మనస్ఫూర్తిగా కావల్సినంతసేపు దర్శించుకోవచ్చు. మరెందుకాలస్యం. వీలైతే ఈ తొమ్మిది రోజులలో ఒక రోజు తిరుపతి వెళ్లేందుకు ప్లాన్ చేసుకోండి.
- Surya Nirjara