నాసికాత్రయంబకం అనే పేరు ఎలా వచ్చింది?

 

నాసికాత్ర్యంబకము అనే పేరు ఎలా వచ్చింది?

పరమేశ్వరుడు వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర క్షేత్రం కూడా ఒకటి. ఈ త్రయంబకేశ్వరాన్ని  'నాసికాత్ర్యంబకము' అని అంటారు. అయితే  దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది?? వంటి విషయంలోకి వెళితే గొప్ప పురాణ కథనం కనిపిస్తుంది. అదేమిటంటే….

 త్రేతాయుగంలో తండ్రి ఆజ్ఞ ప్రకారం శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్ళాడు. అక్కడ పంచవటి అనే ప్రాంతంలో పర్ణశాలను నిర్మించుకుని సీతా, లక్ష్మణ సమేతంగా కాలక్షేపం చేస్తున్నాడు. ఆ సమయంలో రావణుని సోదరి శూర్పణఖ అటువైపుగా వచ్చింది. ఆమె చందమామ లాంటి శ్రీరాముడిని చూసి మనసుపడింది.. రాముడు ఆమెను లక్ష్మణుడి వైపుకు పంపాడు. అయితే  ఆ రాక్షసి ముక్కు, చెవులు కోసి పంపాడు లక్ష్మణుడు. శూర్పణఖ నాసికను ఖండించిన ప్రాంతానికి 'నాక' అనే పేరు వచ్చింది. అదే ఇప్పటి 'నాసిక్'. ఇది మహారాష్ట్రలో ఉంది. ఈ పంచవటి నాసిక మండలములోనే ఉన్నది. ఇక్కడే బ్రహ్మగిరి అనే పర్వతమున్నది. ఆ బ్రాహ్మగిరి పర్వతం మీదనే గోదావరి నది పుట్టింది.

పూర్వకాలంలో బ్రహ్మగిరి పర్వతం మీద అహల్యతో కలసి గౌతమ మహర్షి నివసిస్తూ ఉండేవాడు. అతడు గొప్ప తపస్సంపన్నుడు, నిష్టాగరిష్టుడు, ఎంతటి పనినైనా సాధించగల దీక్ష గలవాడు. ఒకరోజున బ్రహ్మగిరి ప్రాంతంలోని మునీశ్వరులంతా కలిసి "గౌతముడు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఆయనకు అసాధ్యమనేది లేదు. కాబట్టి మనమంతా ఏదో ఒక ఉపాయం పన్ని గౌతమునితో గంగను భూలోకానికి తేవలసినదిగా ప్రేరేపిద్దాము" అనుకున్నారు.. 

గౌతముడు తన భూమిలో వరి పైరు వేశాడు. మునులు తమ తపశ్శక్తితో మాయా గోవును సృష్టించి ఆ పైరు వైపు వదిలారు. అది పైరు మేస్తోంది. అది చూసిన గౌతముడు దర్భపులతో గోవును అదిలించాడు. మాయా గోవు మరణించింది. దాంతో మునులందరూ గౌతముడికి గోహత్యా పాతకం చుట్టుకుంది అని గోల చేశారు. ఆ మాయా మర్మము తెలియని గౌతముడు ఆ పాపానికి పరిహారం చెప్పమన్నాడు. 

అప్పుడు వారందరూ ఆలోచించి, దేవలోకంలో నుండి గంగను తెచ్చి, అందులో స్నానం చేస్తే ఆ పాపము పోతుంది అన్నారు. అలా వినగానే  గౌతముడు కొన్ని వేల సంవ్సరాల తపస్సు చేశాడు, ఆయన తపస్సుకు శంకరుడు కరిగిపోయాడు. గౌతముడు శంకరుడితో గంగను భూమి మీదకు వదలమని అడిగాడు. అలా  గంగను భూమిపైకి తెచ్చాడు గౌతముడు. గౌతముడి చేత భూమిపైకి తేబడింది కాబట్టి ఆ నది పేరు 'గౌతమి' అయింది. గోవు ప్రాణాలను వదలిన ప్రదేశము నుండి ప్రవహించింది కాబట్టి ఆ నది 'గోదావరి' అయింది. భాగీరధికి మాదిరిగా గోదావరి కూడా పరమ పవిత్రమైన జీవనది. ఆ నదీ తీరంలో నివసించినంత మాత్రం చేతనే కోటి సంవత్సరాలు. తపస్సు చేసిన ఫలము వస్తుంది.

గౌతముడు తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు గౌతముడు రెండు వరాలు కోరాడు. వాటిలో ఒకటి…  గంగను భూలోకంలోకి ప్రవహింపచేయమని అడగడం. రెండవది… పరమేశ్వరుడు నాసికలో త్ర్యంబకేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగముగా వెలసి ప్రజలను రక్షించటము. ఆ రెండు కోరికలు కోరిన గౌతమునిని కరుణించాడు పరమేశ్వరుడు.   త్ర్యంబకేశ్వరుడు అనే పేరుతో నాసికలో వెలిశాడు. ఈ రకంగా నాసికలో త్ర్యంబకేశ్వరుడు వెలిశాడు కాబట్టి 'నాసికాత్ర్యంబకము' అని అంటున్నారు. పరమేశ్వరుడు అక్కడ ఈ పేరుతో పూజించబడుతున్నాడు. ఇదీ త్రయంబకేశ్వరుడి వృత్తాంతం.

                                   ◆నిశ్శబ్ద.