తిరుపతి, నారాయణపురం - ఆకాశరాజు కథ

 

తిరుపతి, నారాయణపురం - ఆకాశరాజు కథ

 

 

తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు ఎంత శక్తివంతమైన దేవుడో మనకు తెలుసు. తిరుమల వస్తానని మొక్కుకుంటే చాలు తలచిన పనులు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, ఆరోగ్యం తదితర అంశాల్లో మేలు చేకూరాలని వేంకటేశ్వరుని ప్రార్థిస్తారు. కొందరు భక్తులు కాలి నడకన తిరుమల వస్తామని, ఇంకొందరు భక్తులు భారీ సొమ్ము సమర్పించుకుంటామని, మరికొందరు భక్తులు తల నీలాలు ఇస్తామని, కొందరు భక్తులు ఒంటిమీద ఉన్న నగలన్నీ ఇచ్చేస్తామని మొక్కుకుంటారు. ఇదీ వేంకటాద్రిపై వెలసిన శ్రీ వేంకటేశ్వరుని మహత్యం. తిరుపతి, తిరుమల క్షేత్రమే కాదు, ఆ పరిసర ప్రాంతాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాభవాన్ని తెలిపే ఆకాశరాజు కధ ఇప్పుడు తెలుసుకుందాం.

 

 

తిరుపతికి 20 మైళ్ళ దూరంలో నారాయణపురం ఉంది. ఒకప్పుడు ఆ నగరాన్ని రాజధానిగా చేసుకుని సుధర్ముడు అనే రాజు పాలించేవాడు. అప్పటికే విష్ణుమూర్తి ఆగ్రహానికి బలై రాక్షసుడిగా మారిన చోళరాజు తనువు చాలించే రోజు వచ్చింది. దాంతో ఆ చోళరాజు సుధర్ముని భార్య గర్భంలో ప్రవేశించి, వారికి కొడుకుగా పుట్టాడు. సుధర్ముడు కొడుకుకు ''ఆకాశరాజు'' అని పేరు పెట్టి, అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ఇలా ఉండగా, ఒకరోజు సుధర్ముడు వేటకు వెళ్ళి,  అలసిపోయాడు. దగ్గర్లో ఉన్న కపిలతీర్థంలో దాహం తీర్చుకుని, విశ్రాంతిగా కూర్చున్నాడు. ఆ సమయంలో నాగకన్య కపిలతీర్థంలో స్నానం చేసి వస్తోంది. ఆమె అందాలకు పరవశుడైపోయాడు సుధర్ముడు. నాగకన్య దరిచేరి, వివరాలు అడిగి, తన గురించి చెప్పి వెంటనే గంధర్వ వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ తొండమానుడు అనే పుత్రుడు కలిగాడు.

 

 

కాలక్రమంలో సుధర్ముడు వయోవృద్ధుడు అయ్యాడు. అవసాన దశలో పెద్ద కొడుకు ఆకాశరాజుకు రాజ్యాన్ని అప్పగించి, తొండమానుని బాధ్యత స్వీకరించమని చెప్పి చనిపోయాడు. ఆకాశరాజు ధర్మవంతుడైన రాజు అనిపించుకున్నాడు. ఆకాశరాజు భార్య ధరణీదేవి. ఆమె కూడా భర్తకు తగ్గ ఇల్లాలు. ఆలుమగలు ఇద్దరూ కూడా ప్రజలను కన్నబిడ్డల్లా ఆదరించేవారు. ఆకాశరాజు పరిపాలనలో ప్రజలకు ఎలాంటి కష్టనష్టాలూ కలిగేవి కావు. సుఖసంతోషాలతో జీవనం గడిపేవారు. దేశం సుభిక్షంగా ఉండేది. ఎవరికీ ఏ కొరతా లేదు  కానీ, ఆకాశరాజుకు సంతానం కలగలేదు. రాజూ, రాణీ ఇద్దరూ పిల్లల కోసం తపించారు. పుత్రకామేష్టి యజ్ఞం చేయగా సంతాన ప్రాప్తి కలిగింది.