Read more!

తిరుమలేశునికి సుప్రభాత సేవ (Tirumala Venkateswara Suprabhata Seva)

 

తిరుమలేశునికి సుప్రభాత సేవ

(Tirumala Venkateswara Suprabhata Seva)

తిరుమల వేంకటేశ్వరునికి షట్కాల పూజ నిర్వహిస్తారు. షట్కాల పూజ అంటే ప్రత్యూష, ప్రాతఃకాల, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాల, రాత్రి వేళల్లో జరిపే పూజలు. అంటే వేంకటేశ్వరునికి సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకూ రోజులో ఆరుసార్లు పూజ చేస్తారు. ఇప్పుడు సుప్రభాతసేవ ఎలా చేస్తారో విపులంగా తెలుసుకుందాం.

 

తెల్లవారుజామున మూడు గంటలకు ''కౌసల్యా సుప్రజా రామా..'' అంటూ శ్రీ వేంకటేశ్వరునికి మేలుకొలుపు పాడుతూ చేసే సేవ సుప్రభాత సేవ. షట్కాల పూజలో ఇది మొదటిది. బ్రహ్మముహూర్త సమయాన రెండున్నర గంటల వేళ యాదవుడైన సన్నిధి గొల్ల ఆలయ అర్చకులు, జీయంగారులను వెంటబెట్టుకుని వచ్చి గర్భగుడి ద్వారం తెరుస్తాడు. యాదవుని వెంట అర్చకులు, జీయంగారు అనుసరించి రాగా ఆలయం చేరుకుంటారు. కుంచెకోలను, తాళంచెవులను ధ్వజస్తంభం వద్ద ఉన్న క్షేత్ర పాలక శిలకు తాకించి ఆలయ ద్వారాలు తెరిచేందుకు క్షేత్ర పాలకుని అనుమతి తీసుకుంటారు.

 

తాళ్ళపాక అన్నమాచార్యులవారి వంశీకుడు తంబురా పట్టుకోగా, సుప్రభాతం చదివేందుకు ఏర్పాటైన దిట్టలుతో కలిసి అక్కడికి చేరుకుంటాడు. అర్చకులు సుప్రభాతం పఠించడం ఆరంభిస్తారు. అందరూ కలిసి శ్రావ్యంగా సుప్రభాతం ఆలపిస్తారు.

 

అర్చకులు శ్రీ వేంకటేశ్వరుని పాదాలకు నమస్కరించి, మేల్కొలుపు ఆలపిస్తారు. పరిచారకులు స్వామివారి ముందు తెర వేస్తారు. అర్చకులు నైవేద్యం, తాంబూలం సమర్పించి హారతి ఇస్తారు. అప్పటికి మంగళశాసన పఠనం ముగుస్తుంది. ద్వారాలు తెరిచి, మరోసారి స్వామివారికి హారతి ఇవ్వడంతో సుప్రభాత సేవ పూర్తవుతుంది. సుప్రభాత సేవానంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.